క్రీడాకారులు, సినిమా తారల వంటివారు అరవైలలోనూ యువకులంత ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఆ  వయసులోనూ తమ తమ వృత్తుల్లో తిరుగులేని రీతిలో, అలుపూ సొలుపూ లేకుండా కొనసాగుతూనే వుంటారు. అయితే  సమాజంలో మిగిలిన వర్గాల్లో ఈ మార్పుఅంత ప్రస్ఫుటంగా కనిపించదు. ఆరోగ్యం విషయంలో ముందునుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఆరోగ్యం విషయంలో నెలకొని వుండే అపోహలు,  అవగాహనా రాహిత్యమే ఈ మార్పుకు  కారణం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకునే వారంతా నడివయసు నుంచే తగిన జాగ్రత్తలు పాటించటంతో బాటు ముదిమి గురించిన అవగాహనను పెంచుకోవాలి. అప్పుడే నిండు నూరేళ్ళు హాయిగా జీవితాన్ని గడపటం సాధ్యమవుతుంది. 

జాగ్రత్తలు

 • ముదిమిలో ఆకలి, అరుగుదల కాస్త మందగించటం సహజమే. అందుకే ముందునుంచీ సంతుల ఆహారాన్ని వేళ పట్టున తీసుకోవాలి. దీనివల్ల అన్ని రకాల పోషకాలు అంది చక్కని ఆరోగ్యం సమకూరుతుంది. 
 • వయసు పెరిగే కొద్దీ మెదడులోని కణాల సమూహం తగ్గి మతిమరపు వస్తుంది. చదరంగం, సుడోకు పూరణ, పజిల్స్ నింపటం , పొదుపు కధలు చదవటం  రోజువారీ దినచర్యలో భాగం చేసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడి చివరి రోజు వరకూ అల్జీమర్స్  వంటి సమస్యలు రావు. 
 • నలభై ఏళ్ళు దాటినప్పటి నుంచి ఏటా ఎముకలలో కాల్షియం తగ్గుతూ వస్తుంది. మహిళల్లో మెనోపాజ్ దశలో ఈ మార్పు కనిపిస్తుంది. బరువు నియంత్రణ, తగినంత వ్యాయామం, మేలైన ఆహారం తీసుకోవటం మీద దృష్టి సారించాలి.
 • వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. మెనోపాజ్‌ తరువాత మహిళల్లో ఈస్ట్రోజెన్‌ నిల్వలు తగ్గిపోతాయి. అందుకే వీరు సోయాబీన్స్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం అవసరం.  రోగనిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉన్నందున వేళకి తిండి, నిద్ర ఉండేలా చూసుకోవాలి.
 • పెరిగే వయసుతో బాటు శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కంటి చూపును గమనించాలి . అస్పష్టంగా కనిపించటం , దగ్గరగా పెట్టుకునే పేపర్ చదవాల్సి రావటం వంటి మార్పులు ఈ వయసులో సర్వ సాధారణం . అందుకే ఈ వయసులో కంటి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించటం, అవసరమైతే కళ్ళజోడు వాడటం అవసరం.
 • కంటి చూపుతో బాటు వినికిడి శక్తి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. భారీ శబ్దాలకు దూరంగా వుండటం అవసరం. శ్రావ్యమైన మంద్ర స్థాయి సంగీతం వినటం  వల్ల మంచి ఫలితం వుంటుంది. వినికిడి శక్తి తగ్గినట్లు అనిపిస్తే ఏమాత్రం మొహమాటపడకుండా వైద్యుడిని కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
 • వయసు పెరిగే కొద్దీ చర్మం సాగటం, ముడుతలు పడటం, చర్మం కింద వుండే కొవ్వు తగ్గిపోవటం సహజమే. చర్మానికి సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజన్ ఉత్పత్తీ తగ్గుతుంది. ఈ మార్పుల వల్ల ముఖం కాంతిని కోల్పోవటం, గీతలు పడటం కూడా ఉండొచ్చు. అందుకే ముదిమి వయసుకు దగ్గరవుతున్న కొద్దీ సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడటం, తగినంత నీరు తాగటం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలతో బాటు పండ్ల వినియోగం మీద దృష్టి పెట్టాలి. 
 • ఈ వయసులో కనిపించే మరో మాపు రుచి, వాసనను సరిగా గుర్తుపట్టలేక పోవటం. ఉప్పు, కారం,నూనె వంటివి పరిమితంగా వాడుతూ ఎక్కువగా సాత్వికాహారం తీసుకుంటే ఈ  లోపాన్ని అధిగమించవచ్చు. 
 • వృద్ధాప్యంలో రక్త నాళాలు గట్టిపడటం, కుచించుకు పోవటం వల్ల గుండె మీద ఒత్తిడి పెరిగి దాని పనితీరు దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రోజూ ఉదయం, సాయంత్రం నడక,జాగింగ్, వంటి సాధనలు ఎంతగానో ఉపయోగపడతాయి.
 • ఈ వయసులో ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. రోజూ ప్రాణాయామం, యోగా  చేయగలిగితే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శ్వాస కోశ సమస్యలు రావు.
 • నరాల పనితీరు తగ్గి రక్త ప్రసరణ నెమ్మదించటం ఈ వయసులో కనిపించే మరో లక్షణం.  దీంతో నొప్పి, జ్వరం, ఎండ ప్రభావం, గాయాల బాధ వంటి వాటిని సరిగా గుర్తించ లేకపోతారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాల్లో  మసాజ్ ప్రధానమైనది . వీలున్నప్పుడల్లా బాడీ మసాజ్‌ చేయించుకోవడం శరీరంతో బాటు మనసు కూడా ఉల్లాసంగా, చురుగ్గా ఉంటుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE