• HOME
  • ఆహ్లాదం
  • తోటివారితో పిల్లల్ని పోల్చొద్దు    

‘ నీతో బాటు  చదివే ఎదురింటి రాముకు అన్ని సబ్జెక్టుల్లో నీకంటే మంచి మార్కులే. నీకు మాత్రం ఎప్పుడూ వాడికంటే తక్కువే. ఎన్నిసార్లు చెప్పినా ఆటలు, టీవీ, ఫోన్ తప్ప నీకు మరో వ్యాపకం లేదు' వంటి మాటలు పిల్లలున్న ప్రతి ఇంట్లో వినిపిస్తుంటాయి. పిల్లల విషయంలో అవసరం ఉన్నంత వరకు తోటి వారితో  పోలిక మంచిదే గానీ అదేపనిగా పిల్లల్ని తోటి వారితో పోల్చి, వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తే అనుకున్న ఫలితాలు రాకపోగా  ప్రతికూలమైన ఆలోచనలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటి రోజుల్లో ఒక్కబిడ్డ వున్నా కుటుంబాలే ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో పెద్దలు ఈ పోలికల అంశం విషయంలో రవ్వంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

పెద్దలకు సూచనలు

  • ఎదుటి వారినైనా చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెద్దలు అప్పుడప్పుడూ పోల్చి చెప్పడం సబబే. అయితే అది పిల్లల మనసును గాయ పరిచేలా, ఒత్తిడికి గురిచేసేదిగా గాక వారిని ఆలోచింపజేసి, వారిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంచేదిగా వుండాలి.
  • మంచి, చెడుల మధ్య ఉండే తేడాను పసిపిల్లలు అర్ధం చేసుకోలేరు. కాస్త కటువుగా చెప్పే ప్రతి మాటా వారికి తిట్టుగానో, నిందగానో అనిపించే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి ప్రతి సందర్భంలోనూ పిల్లలకు మీ ఆదేశాల వెనకున్నఆంతర్యాన్ని ప్రేమగా, ఓపికగా విడమరచి చెప్పాలి. అప్పుడే సదరు మార్పు తమ మంచికేననే సంగతి ఆ చిన్నారుల మనసులో దృఢ పడుతుంది.
  • పిల్లకు సంబంధించిన ఏ మార్పు అయినా కాలానుగతంగా రావాలి తప్ప రాత్రికి రాత్రి కాదు.  అందుకే పిల్లల వైఖరి,అలవాట్ల విషయంలో ఒక్కసారిగా వారిలో మార్పు రావాలనుకోవటం పొరపాటు . దీని వాళ్ళ పిల్లలు భయపడి ఇల్లు విడిచి పోవటం, గాయపరచుకోవటం వంటి పనులకు పూనుకునే ప్రమాదం ఉంది.
  • ఉమ్మడి కుటుంబ నేపధ్యంలో పిల్లల్ని అక్క, చెల్లి,అన్న, తమ్ముడు వంటి వారితో  పోల్చటం మన దేశంలో కనిపిస్తుంది. ఆహారం తీసుకోవటం, ఆటలు ఆడటం వంటి విషయాల్లో తోటి వారితో పోల్చినప్పుడు పిల్లలు ఆనందంగా ఆయా అంశాల్లో పోటీపడతారు. పాజిటివ్ ఆలోచనలు, ప్రేరణ కలిగించి ఈ తరహా పోలిక మాదిరిగానే అన్ని అంశాల్లో పోలిక తెస్తే ఇబ్బంది ఉండదని పెద్దలు గుర్తుంచుకోవాలి.
  • ఒక చేతి వేళ్ళు ఒకలా ఉండనట్లే, ఒక తల్లికి బిడ్డలూ ఒకేలా ఉండరు. ప్రతి బిడ్డకూ కొన్ని ప్రత్యేక లక్షణాలు,అలవాట్లు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అంగీకరిస్తూనే నేటి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పిల్లల్ని మలచుకోవాలి. ఇందుకు పెద్దలకు ఆయా అంశాల్లో అవగాహన, నైపుణ్యం, ఓర్పు అవసరం.     
  • ఉదయం నుంచి పడుకోబోయే వరకూ పిల్లని ప్రతి విషయంలో తోటి వారితో పోల్చితే, వారిలో ప్రతికూలమైన ఆలోచనా విధానం ఏర్పడి, ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచించటం, పనిచేయటం చేస్తారు. కొత్త వారితో చొరవగా కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటానికి అలవాటు పడతారు.
  • తరచూ తోబుట్టువులతో పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మనూన్యతా భావం పెరిగి కోలుకోలేనంత నిరాశలో కూరుకు పోతారు. ఇది మొండితనానికీ , తప్పించుకు తిరిగే ధోరణికీ దారితీసే ప్రమాదం వుంది.
  • పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే మీరు ఒకరి పక్షం వహించొద్దు. ఇలా చేస్తే రెండో పిల్లాడికి మీ మీద, తోబుట్టువు మీద ద్వేషం కలుగుతుంది. ఇద్దరు పిల్లలున్నప్పుడు కూడా ఒకరిని తిట్టడం మరొకరిని పొగడటం లాంటివి చేయకూడదు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE