• HOME
 • ఆహ్లాదం
 • నేర్చుకోవటంలో సమస్యలు..పరిష్కారాలు 

       కొందరు పిల్లలు చూడటానికి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ  ఆటపాటలు, చదువు మొదలు ఏ విషయంలోనూ తోటి వారితో పోటీ పడలేరు. చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం, లెక్కించటం వంటి అంశాల్లో ఎప్పుడూ వీరికి తడబాటే.  జ్ఞానేంద్రియాల పనితీరుతో బాటు గ్రహణ శక్తి లోపాలతోనూ ఈ పిల్లలు సతమతం అవుతుంటారు. ఈ లక్షణాలనే వైద్యపరిభాషలో 'నేర్చుకోవటంలో లోపాలు' (స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటి) అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంద మందిలో కనీసం ఏడెనిమిది మంది పిల్లలు  ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.  బాల నేరస్థుల్లో 40 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. కొన్నిసార్లు ఈ సమస్య  కేవలం తక్కువ తెలివితేటలున్న పిల్లల్లోనే గాక ఎంతో చురుకైన పిల్లల్లో, వయోజనుల్లోనూ  కనిపిస్తుంది. అయితే   అవగాహనా లోపం కారణంగా అటు తల్లిదండ్రులు గానీ ఇటు టీచర్లు గానీ చిన్నారుల ఈ ఇబ్బందిని కనిపెట్టటం లేదు. అయితే  నాలుగేళ్లనాడు వచ్చిన ' తారే జమీన్ పర్' సినిమా ఈ సమస్య ప్రభావాన్ని స్పష్టంగా చూపించటంతో ఈ సమస్య పట్ల కొంత అవగాహన పెరిగింది.  వీలున్నంత ముందుగా సమస్యను గుర్తిస్తే ఈ సమస్యకు సులభంగానే చెక్ పెట్టొచ్చు.

గుర్తించటం ఎలా?

 • వయసు పెరిగినా ఇంకా చిన్నపిల్లలలాగా అస్పష్టంగా, నంగినంగిగా మాట్లాడటం
 • భాషమీద అవగాహన, పట్టు దొరక్కపోవటం, ఒక్కోమాటా కూడబలుక్కొని పలకటం
 • కదిలే వస్తువుల వేగం, దిశలను, శబ్దాలను సరిగా అంచనా వేయలేకపోవటం
 • గుర్తులు,అంకెలు, అక్షరాలు, బంధుత్వాల విషయంలో తడబాటు
 • దిక్కుల గందరగోళం, ఒక వస్తువు ఎంత ఎత్తు, దూరంలో ఉందనే అంశాల్లో గందరగోళం
 • ఏ పని మీదా ఎక్కువ సమయం దృష్టి సారించలేకపోవటం
 • సులభమైన, రోజూ చేసే పనుల్లో కంగారు, సమయపాలన పాటించకపోవటం
 • పెన్సిల్, పెన్ను వంటివి అడ్డదిడ్డంగా పట్టుకోవటం, ఇష్టం వచ్చినట్లు రాయటం
 • వ్రాత పరీక్షల్లో ఎప్పుడూ ఫెయిల్ కావటం, అదే ప్రశ్నలను అడిగితే టకటక మని సరైన జవాబివ్వటం

పరిష్కారం

 • ఈ లక్షణాలను అల్లరి, బాల్య చేష్టలుగా అపోహపడక, వీలైనంత త్వరగా వైద్యపరీక్షలు చేయించాలి.
 • సాధారణ వైద్యుడికి బదులు చైల్డ్ రెమెడియల్ థెరపిస్ట్, ఆక్యుపెషనల్ థెరపిస్ట్ సలహా తీసుకొని చికిత్స ఇప్పించాలి.
 • చిన్నారులకు అన్నివిధాలా అండగా ఉంటూ సమస్యను జయించగలమనే భరోసా కల్పించాలి.
 • మిగతా పిల్లలు చదివే పాఠాల స్థానంలో నిపుణులు ఎంపిక చేసిన వాటిని పెద్దలు శ్రద్దగా నేర్పించాలి.
 • చదువుతో బాటు వృత్తివిద్య, సులభంగా నెట్టుకు రాదగిన పనుల్లో ముందునుంచే తర్ఫీదునివ్వాలి.
 • చిన్నారి తన రోజువారీ పనులు స్వతంత్రంగా చేసుకొనేలా చూడాలి.

తమ భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కనే చిన్నారుల బాల్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్ది, వారికి పూర్తిస్థాయిలో ఆ ఆనందాన్ని అందించటం పెద్దల బాధ్యత. ఈ  సానుకూలమైన  వాతావరణం ఉన్నప్పుడే వారు స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తగిన అవకాశాలను కల్పిస్తే ఈ లోపాలున్న పిల్లలు సైతం అద్భుతాలు ఆవిష్కరించగలరనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE