కొందరు తల్లిదండ్రులు పిల్లలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. వారి ఇబ్బందుల్ని ముందుగానే ఊహించి తగిన ఏర్పాట్లు చేస్తారు. మరికొందరు పెద్దలది ఇందుకు పూర్తి భిన్నమైన ధోరణి. వీరు  కంటి చూపుతోనే చిన్నారులను అదుపులో పెట్టాలనుకుంటారు. పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గినా లేక చెప్పిన పని క్షణం ఆలస్యమైనా వీరు అస్సలు సహించరు.  ఇంకొందరు తల్లిదండ్రులైతే పిల్లలకు మార్గదర్శులుగా ఉండి పిల్లలను స్వతంత్రంగా ఎదిగేందుకు సాయపడుతారు. ఏ సమస్య వచ్చినా తమతో చెప్పుకొనే అవకాశం  ఇస్తారు. తల్లిదండ్రుల నేపథ్యాలు, వృత్తివ్యాసంగాలు, విద్యార్హతలు, అవగాహన తదితర అంశాలను బట్టి వారి వారి వ్యవహారశైలి ఉంటుంది.

తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకోని పెద్దలు లోకంలో ఎక్కడ ఉండరు. అయితే అందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచటంలో నిర్మాణాత్మకంగా, నేర్పుగా వ్యవహరించే వారు మాత్రం కొందరేనని చెప్పాలి. అలాంటి పెద్దలే తమ పిల్లలను వివేకవంతులుగా, సృజనశీలురుగా తీర్చిదిద్దగలరు. వ్యవహార శైలి, అలోచనా విధానం వంటి పలు అంశాల ప్రాతిపదికన తల్లిదండ్రులను 3 వర్గాలుగా విభజించవచ్చు.  

మొదటి రకం పెద్దలు

 పిల్లలకు చదువు తప్ప మరో వ్యాపకం అవసరం లేదనీ, వారికి  స్వేఛ్చ ఇస్తే మాట వినకుండా పోతారని వీరు బలంగా నమ్ముతారు. ఏ పనికైనా ఆదేశం ఇవ్వటమే తప్ప అనునయంగా చెప్పటం వీరికి చేతకాని పని. తమ బాల్యంలో పెద్దలు వ్యవహరించిన తీరునే తమ పిల్లల పట్ల ప్రదర్శిస్తారు. చెప్పిన పనిలో తేడా వస్తే  కనీసం వివరణ కూడా అడగకుండానే శిక్షిస్తారు. పిల్లలు తెలియక చేసే పొరబాట్లు, తెలిసి చేసే తప్పులను ఒకటిగానే భావిస్తారు.

తల్లిదండ్రుల ఇలాంటి వైఖరి మూలంగా పిల్లలు మొండివారుగానూ, తిరగబడే స్వభావం ఉన్నవారుగా లేక పూర్తిగా పిరికి వారుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పిల్లలు ప్రతికూల ఫలితం వచ్చిన సందర్భాల్లో అబద్ధాలు చెప్పటం, పొంతనలేని సమాధానాలిస్తారు . ఎప్పుడూ ఏదో కోల్పోయిన వారిలా కనిపిస్తారు. 

రెండోరకం పెద్దలు

 వీరికి పిల్లలే లోకం. వారి ప్రతి సమస్యనూ తమ సమస్యగానే వీరు భావిస్తారు. చివరకు పిల్లలకు కాస్త జలుబు చేసినా వీరికి నిద్రపట్టదు. తాము లేకపోతే పిల్లలు ఏ పనీ చేసుకోలేరనే భ్రమలో ఉంటారు. తిండి మొదలు పిల్లల సకల అవసరాలూ అడగకముందే సమకూర్చటం వీరికి అలవాటు. పిల్లలకు పెళ్లి వయసు వచ్చినా వారిని చిన్నారుల మాదిరే చూస్తుంటారు. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా వీరు కనీసం గద్దించటానికి సైతం ఇష్టపడరు. తల్లిదండ్రుల్లో ఎవరైనా ఆ పని చేస్తే రెండోవారు పిల్లలను వెనకేసుకొస్తారు. 

ఇలాంటి పెంపకంలోని పిల్లలు ప్రతిపనికీ ఇతరుల మీద ఆధారపడతారు. నాయకత్వ లక్షణాలు,  ఆత్మవిశ్వాసం లోపించి సొంతగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేరు. ప్రతినిర్ణయం పెద్దల అనుమతితోనే జరగాల్సిరావటంతో ఈ పిల్లలు మానసికంగా బాగా కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఆదర్శవంతమైన పెద్దలు 

పైన చెప్పుకున్న రెండురకాల పెద్దలకూ వీరు పూర్తి భిన్నంగా ఉంటారు. ఇతర తల్లిదండ్రుల మాదిరే వీరికీ ఆలోచనలు ఉన్నా వీరు వాటిని అవసరమైనంత మేరకే బయటపెడతారు. పిల్లల పట్ల ప్రేమ, ఆదరం చూపుతూ వారిలోని భయాల్ని పారద్రోలి స్వతంత్రులుగా తీర్చిదిద్దుతారు. పట్టుదలగా సాధన చేస్తే ఎంత కష్టమైన పనైనా సాధించవచ్చని చెబుతూ కొత్త లక్ష్యాల వైపు పిల్లలను ప్రేరేపిస్తారు. ఫలితంతో నిమిత్తం లేకుండా ప్రయత్నం చేయమని చెబుతూ అపజయం పట్ల భయాన్ని తొలగించేలా చేస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అంతరాత్మ ప్రబోధాన్ని పాటించాలనీ, ఈ క్రమంలో పరాజయం ఎదురైనా భయపడరాదని చెబుతారు. కొత్త విషయాలు తెలుసుకోవటం, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవటం, నలుగురితో కలిసి ముందుకు సాగాలని ప్రబోధిస్తారు. 

ఈ తరహా పెద్దల వైఖరి వల్ల పిల్లలు ఎంతో ఆత్మ విశ్వాసంతో నచ్చిన దారిలో ముందుకు సాగుతారు. ఏదైనా పని విఫలమైనా బాధపడుతూ కూర్చోకుండా  పదే పదే  ప్రయత్నిస్తారు. వయసుతో బాటు వీరి అవగాహన, ఆకళింపు చేసుకొనే సామర్థ్యం కూడా పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు కనబరిచి పదిమందిలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. 

లోకంలో బిడ్డలను ప్రేమించని తల్లిదండ్రులు ఎక్కడా ఉండరు. అయితే  పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాల్లో తమ వైఖరి, ఆలోచనలను  మార్చుకునేందుకు వెనకాడ కూడదు. మారుతున్న కాలం, పరిస్థితులు, అవసరాలు తదితర అంశాలను పెద్దలు దృష్టిలో పెట్టుకొని పిల్లలతో వ్యవహరించాలి. ఈ క్రమంలో  క్రమశిక్షణ ఎంత అవసరమో పట్టువిడుపు ధోరణి కూడా అంతే అవసరమని పెద్దలు గుర్తించాలి. అలాంటి పెద్దలే తమ పిల్లలను రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దగలరు.

 Recent Storiesbpositivetelugu

వృద్ధులు కాదు పెద్దలు

 ఏ కుటుంబపు ఉన్నతికైనా ఆ ఇంటి పెద్దల కృషే ప్రధాన కారణం. బిడ్డల భవిష్యత్తు కోసం చిన్న చిన్న సరదాలను సైతం త్యాగం 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE

A PHP Error was encountered

Severity: Core Warning

Message: PHP Startup: Unable to load dynamic library 'C:\Program Files\PHP\v7.0\ext\php_wincache.dll' - The specified module could not be found.

Filename: Unknown

Line Number: 0

Backtrace: