నిజజీవితంలో డబ్బు ఎంత అవసరమో మనకు తెలుసు. అయితే ఈ ప్రాధాన్యాన్ని తల్లిదండ్రులు పిల్లలకూ అర్ధమయ్యేలా చెప్పినప్పుడే వారు డబ్బు ఖర్చు విషయంలో ఒక అవగాహనకు వస్తారు. పిల్లల రోజువారీ దినచర్య, చదువు, నడవడిక వంటి అంశాలలో పెద్దలు ఎంత శ్రద్ద తీసుకుంటారో అలాగే పిల్లలకు ఆర్ధిక క్రమశిక్షణ అలవరచటం మీదా పెట్టాలి. ఆదాయ వ్యయాల మీద అవగాహన కల్పించటం, అవసరాలు, సౌకర్యాలు, విలాస మధ్య తేడాను వివరించటం, పొదుపు ప్రాధాన్యం వంటి అంశాల మీద అవగాహన కలిస్తే ఖర్చుల విషయంలో పిల్లలు ఆర్ధిక అంశాల్లో మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. డబ్బు విషయంలో చిన్నారులకు అవగాహన కల్పించే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. 

  • పిల్లలను ఇంటి సమీపంలోని దుకాణాలకు పంపి వస్తువులు కొని తెచ్చేలా ప్రోత్సహించాలి. దీనివల్ల వస్తువుల ధరలు, డబ్బు చెల్లించటం వంటి అంశాల పట్ల అవగాహన వస్తుంది.
  • నెలవారీ వస్తువులు కొనేసమయంలో పిల్లలనూ మార్కెట్ కు తీసుకువెళ్లి, ఏమేమి కొంటున్నారు? దేని ధర ఎంత? ఆ నెల బడ్జెట్ ఎంత?వంటి అంశాలను వివరించాలి.
  • పిల్లలకు కిడ్డీ బ్యాంకును బహుమతిగా ఇచ్చి దాని నిర్వహణను వారికే అప్పగించాలి. చిల్లర ఉన్నప్పుడు వారికిచ్చి కిడ్డీ బ్యాంకులో దాచుకొనేలా ప్రోత్సహించాలి.
  • 10 ఏళ్ళు దాటిన పిల్లలకు ఇచ్చే నెలవారీ పాకెట్ మనీలో మిగిలిన దాన్నిపోస్టాఫీసు, బ్యాంకుల్లో పొదుపు చేసేలా ప్రోత్సహించాలి.
  • పిల్లలకు ఇంటిపని, తోటపని వంటివి అప్పగించి పూర్తయిన తర్వాత పరిమిత మొత్తంలో డబ్బు బహుమతిగా ఇవ్వాలి. దీనివల్ల పిల్లలు కష్టం విలువను గుర్తిస్తారు . అయితే ఇది కేవలం బహుమతే తప్ప ప్రతిఫలం కాదని చెప్పాలి. లేకపోతే పని చెప్పిన ప్రతిసారీ డబ్బు అడగటం లేదా డబ్బు ఇవ్వకపోతే పని చేయమని మారాం చేస్తారు.
  • ఇంటి ఖర్చులు, పొదుపు వంటి వ్యవహారాలు చర్చించుకొనేటప్పుడు పిల్లలనూ భాగస్వాములను చేయాలి. ఆ నెలలో ఏం కావాలి ? ఖర్చులు ఏమి ఉన్నాయి? అని అడిగటం ద్వారా వారికి ఖర్చుల పట్ల అవగాహన కల్పించాలి.
  • పిల్లలు ఏదైనా వస్తువు కొనిపెట్టమని అడిగితే దాని అవసరం ఎంత? ధర ఎంత?ఎక్కడ దొరుకుతుంది? తెలుసుకోమని ప్రోత్సహించాలి. ఒకవేళ కొనివ్వలేకపోతే అందుకు గల కారణాలను వివరించాలి.
  • రోజువారీ ఖర్చులను ఒక కాగితం మీదా రాసి, నెల నెలా లెక్క చూసుకొనేలా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
  • డబ్బు ఖర్చు, పొదుపు విషయంలో పెద్దలు స్వీయ నియంత్రణ పాటించాలి. అప్పుడే పిల్లలూ వారిని అనుకరిస్తారు.
  • పొదుపు చేయటం ద్వారా దాచిన డబ్బును వేసవి సెలవులు, విహార యాత్రల సమయంలో వాడుకోమని చెప్పటంతో బాటు కొంత మొత్తాన్ని ఏదైనా సేవా కార్యక్రమానికి విరాళంగా ఇచ్చేలా ప్రోత్సహించాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE