టీచర్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నట్లే కనిపిస్తారు. తిరిగి ప్రశ్నిస్తే తెల్ల మొహం వేస్తారు. ఇంట్లో పెద్దలు బయటికెళ్లి ఏదైనా వస్తువు తెమ్మని వివరాలు చెబుతుంటే ఇకచాలన్నట్టు మొహం పెడతారు. తీరా బయటికెళ్ళాక కొనాల్సిన వస్తువు మరచిపోయి ఒత్తి చేతులతో తిరిగొస్తారు . ఇవీ పరధ్యానంగా ఉండే కొందరు పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు. ఏదైనా విషయాన్ని లేక సంఘటనను గురించి లోతుగా ఆలోచించటం, అప్పటి ఘటనతో తాదాత్మ్యత చెందినప్పుడు ఎవరైనా రవ్వంత ఏమరపాటుగా ఉండటం సహజమే.అయితే ఈ పరిస్థితి రోజువారీ వ్యవహారంగా మారి ఎప్పుడూ మనిషొకచోట, మానసిక చోట ఉన్నట్లు మారితే దాన్ని పరధ్యానం అంటారు. ఇది అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. ఇలాంటి పిల్లలు ఏ పనిమీదా సరిగా దృష్టి కేంద్రీకరించలేరు. కేవలం లక్షణాలను బట్టి దీన్ని మానసిక వ్యాధిగా భావించలేము. అయితే ఇది కొన్ని రకాల మానసిక సమస్యల లక్షణం కావచ్చు.నిజానికి చక్కని తెలివి తేటలున్న వారే ఎక్కువగా పరధ్యానంగా కనిపించటం విశేషం.

లక్షణాలు

 • ఇతర పిల్లల మాదిరిగా నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. సున్నిత స్వభావులుగా, ఊహల్లో ఉంటారు. భవిష్యత్తును పలుకోణాల్లో ఊహిస్తూ ఉంటారు.
 • చదువు పట్ల పెద్ద ఆసక్తి ప్రదర్శించటం, కష్టపడి చదవటం ఉండవు. చూసేందుకు అమాయకుల్లా ఉంటారు. వేషధారణ, అవసరాల గురించి పట్టించుకోరు.
 • ఏకాంతంగా ఉండేదుకు ఇష్టపడతారు. తమలో తాము మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చేస్తారు. ఒక్కోసారి ఎదురుగా మనిషి ఉన్నా పట్టనట్లు, ఉదాసీనంగా, ఒక్కోసారి ఎవరూ లేకున్నా, ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.
 • అవకాశం వచ్చినా ప్రతిభను చాటేందుకు ఉత్సాహం చూపరు. అడిగితే క్లుప్తంగా, అనాసక్తిగా జవాబిస్తారు.
 • ప్రశాంతత కోరుకునే వీరుఉత్సాహంగా, గందరగోళంగా ఉండే వాతావరణానికి దూరంగా ఉంటారు.
 • ప్రతి చిన్న పనికీ ఇతరుల మీద ఆధారపడతారు.
 • పని చేస్తూనే ఉంటారు గానీ ఏమి చేస్తున్నావని అడిగితే వెంటనే జవాబు చెప్పలేరు.
 • ఇచ్చిన మాటను నిలుపుకోలేరు. అదేమని ప్రశ్నిస్తే బిక్క మొహం పెడతారు.
 • కళ్ళ ముందు కనిపించే వటువునూ గుర్తించలేక వెతుకుతూ ఉంటారు.
 • తోటిపిల్లలతో కలవరు గనుక వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు.

కారణాలు

 • పెద్దల నుంచి పిల్లలకు సంక్రమించటం
 • ఇంట్లో పెద్దల నమ్మకాన్ని పొందలేకపోవటం, పెద్దలు పిల్లలను నిర్లక్ష్యం చేయటం
 • పెద్దలు అతిగారాబం చేసి పిల్లలను స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇవ్వకపోవటం
 • పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు
 • మందుల ప్రభావం

పెద్దల బాధ్యత

 • పిల్లల పరధ్యానం ఎందుకో పెద్దలు ప్రేమగా అడిగి, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడు సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.
 • తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కోసం తగినంత సమయం కేటాయించాలి. వారితో స్నేహంగా మసలుకోవాలి.
 • పిల్లలకు ఇష్టమైన వ్యాపకాలను గుర్తించి వారితో కలిసి పెద్దలూ చేయాలి. బాగా చేసినప్పుడు మెచ్చుకోవాలి.
 • ఉదయం మొదలు రాత్రి వరకు చేసిన పనులన్నీ ఒక డైరీలో వరుస క్రమంలో రాసేలా అలవాటు చేయాలి. పని, సమయాన్ని సమన్వయం చేసుకోవటం గురించి వివరించాలి.
 • ఏకాగ్రత కుదిరేందుకుసంగీతం, సాహిత్యం చదవటం, చిత్రలేఖనం వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి.
 • ఏది జరిగినా మంచికే అనే భావనను పిల్లల్లో పాదుకొల్పి అనవసరపు ఆందోళనను దూరం చేయాలి.అవసరం లేదని చెప్పాలి.
 • సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి.
 • పిల్లల ఏకాగ్రత పెరిగేందుకు ఉపయోగపడే పొడుపు కథలు, పజిల్స్‌ సాధన, చెస్ వంటివి అలవాటు చేయాలి.
 • మానసిక రుగ్మత ఉన్నట్లు అనిపిస్తే మనస్తత్వ నిపుణులను సంప్రదించి తగు చికిత్స ఇప్పించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE