నలుగురితో కలిసి భోజనం చేసే పద్దతిని బట్టి ఒక వ్యక్తి పట్ల అక్కడివారికి ఒక స్పష్టమైన అభిప్రాయం కలగటం సహజమే. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఎలా ఉన్నాపెద్ద ఇబ్బంది ఉండదు గానీ అదే.. ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడో, ఆఫీసులో క్లయింట్లతో, వ్యాపార భాగస్వాములతో కలిసి, ప్రముఖులతో భోజనం చేయాల్సి వచ్చినప్పుడు తోటివారికి ఇబ్బంది కలిగించని రీతిలో వ్యవహరించటం ఎంతైనా అవసరం. భోజనం చేసే విషయంలో ఒకవైపు మన సంప్రదాయాలను పాటిస్తూనే అటు అతిథి లేదా అతిథేయి (ఆహ్వానించిన వ్యక్తి)ల మనసు గెలుచుకొనేలా చేసే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.

వెళ్ళగానే

 • డైనింగ్ టేబుల్ కుర్చీ బరబరా లాగకుండా నెమ్మదిగా ఎత్తి వెనక్కు తీసి కూర్చోవాలి.
 • కుర్చీలో కూర్చునే ముందు టోపీలు, హాండ్ బ్యాగ్, ఓవర్ కోట్ వంటివి ఉంటే తీసి ఒక పక్కన పెట్టుకోవాలి.
 • కూర్చున్న తర్వాత టేబుల్ మీది నాప్కిన్ తీసి ఒళ్లో పరచుకోవాలి. దీనివల్ల వేడి వేడి ఆహార పదార్థాలు ఒలికినా ఇబ్బంది ఉండదు.
 • కూర్చోగానే ఫోన్ ను తక్కువ శబ్దం వచ్చేలా సరిచేసుకోవాలి. వినటానికి ఇబ్బందిగా ఉండే రింగ్ టోన్స్ ఉంటే ఫోన్ మ్యూట్ లో పెట్టటం లేదా స్విచాఫ్ చేయటం మంచిది.
 • మిగిలిన అతిథులు వచ్చేవరకు ఎదురుచూడాలి. ఏమి వంటకాలు చేసారని ముందుగా గిన్నెల మూతలు తీసి చూడరాదు.
 • డైనింగ్ టేబుల్ మీద మోచేతులు పెట్టి కూర్చోరాదు.
 • అందరూ కూర్చున్న తర్వాత టేబుల్ మీద బోర్లించిన ప్లేట్ ను నెమ్మదిగా తీసి మీకు అనువుగా పెట్టుకోవాలి.

భోజనం చేసేటప్పుడు

 • ఫోర్క్, నైఫ్ వాడేవారు వాటిని పద్దతి ప్రకారం మాత్రమే వాడాలి. భోజనం చేసేటప్పుడు వేళ్ళు చూపి మాట్లాడటం, ఫోర్క్, నైఫ్ చూపటం కూడదు. వాటిని వాడే అలవాటు లేనివారు చేతితోనైనా పద్దతిగా కలుపుకొని తినొచ్చు.
 • అందరికీ వడ్డించటం పూర్తయిన తర్వాత, అతిథేయి ( ఆహ్వానించిన వ్యక్తి) భోజనానికి ఉపక్రమించిన తర్వాతే మిగిలినవారు భోజనం చేయటం ఆరంభించాలి.
 • భోజనం మధ్యలో మంచినీరు తాగితే టిష్యూ పేపర్ తో మూతి తుడుచుకోవాలి.
 • కంచంలో వడ్డించిన పదార్థాలన్నీ తినాలనే ఆదుర్దా వద్దు. నచ్చనివి వదిలేయటానికి మొహమాటపడాల్సిన పనిలేదు.
 • వంటకాలను కొంచెం కొంచెంగా కలుపుకొని మునివేళ్ళతో ముచ్చటగా తినాలి. ముందు నోట్లో పెట్టుకున్నది నమిలి తిన్న తర్వాత మరికొంచెం నోట్లో పెట్టుకోవాలి.
 • చెంచాతో తినేవారు టకటక మనే శబ్దం రాకుండా తినాలి.
 • తినేటప్పుడు నోరు బార్లా తెరవటం, శబ్దం వచ్చేలా నమలటం, కంచం ఎత్తిపట్టుకొని తాగటం, మాంసం తినేటప్పుడు కంచంలో ఎముకల వంటివాటిని గట్టిగా కొట్టటం, వాటిని జుర్రుమని పీల్చటం అస్సలు చేయకూడదు.
 • భోజనం చేసేటప్పుడు తుమ్ము, దగ్గు వస్తే కాస్త పక్కకు వెళ్లి టిష్యూ అడ్డుపెట్టుకోవటంతో బాటు ‘ఎక్స్ క్యూజ్ మి’ అని చెప్పాలి.
 • ఎంత మిత్రులైనా తోటివారి పళ్ళెంలోని పదార్థాలను తీసుకోవటం మర్యాదకాదు. ఉప్పు, పెప్పర్ పొడి చల్లుకునేటప్పుడు వాటిని తోటివారికీ అందించాలి.
 • తినేసమయంలో నోట్లో వేలుపెట్టి ఆహారాన్ని బయటకు తీయకూడదు. మరీ అవసరం అయితే చెంచా వాడాలి.
 • భోజనం చేసేటప్పుడు ఏదైనా గొంతుకు అడ్డుపడినా, లేక పళ్ళల్లో ఇరుక్కొని ఇబ్బంది పెట్టినా ‘ఎక్స్ క్యూజ్ మి’ అనిచెప్పి లేచి వాష్ రూమ్ కి వెళ్ళాలి. తిరిగి వచ్చి కూర్చునేటప్పుడూ మరోమారు పక్కనున్న వారికి ‘ఎక్స్ క్యూజ్ మి’ అని చెప్పటం మర్యాద.
 • ఏదైనా కొత్త పదార్ధం వడ్డిస్తే తోటివారు ఎలా తింటున్నారో గమనించి మీరూ అలాగే తీసుకోండి.
 • సూప్ లేదా ఇతర పానీయాలు చెంచాతో తీసుకున్నతర్వాత వాటిని అలాగే బౌల్ లో వదిలేయకుండా తీసి సాసర్ లో పెట్టాలి.
 • భోజన సమయంలో మౌనంగా, ముభావంగా ఉండక అతిథేయితో నాలుగు మాటలు సరదాగా మాట్లాడుతూ తింటే బాగుంటుంది. అలాగని ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలా బిగ్గరగా మాట్లాడటం,కేకలు పెట్టటం, నవ్వటం, పొంతనలేని మాటలు మాట్లాడటం, సైగలు చేయటం, వెకిలి జోక్స్ వేయటం పనికిరాదు.
 • తినటం పూర్తి కాగానే లేచి చేతులు కడుక్కోవటం కంటే అతిథేయి తినటం పూర్తై తన ఒడిలోని రుమాలు టేబుల్ మీద పెట్టిన తర్వాతే లేవటం మర్యాద.
 • భోజనం అనంతరం ఆహ్వానించిన వ్యక్తికి, వారి కుటుంబ సభ్యులకు కృతఙ్ఞతలు చెప్పి బయలుదేరటం కనీస మర్యాద.
 • హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడి సిబ్బందితో గౌరవంగా మాట్లాడాలితప్ప వారిపై పెత్తనం చేసే ప్రయత్నం తగదు.
 • హోటల్ బిల్లు మీ మిత్రుడు బిల్లు చెల్లించేందుకు సిద్దపడితే అతని కోరికను మన్నించండి. అయితే మరోమారు ఆ పని చేస్తానని చెప్పటం మరువొద్దు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE