మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. సాధారణంగా పరీక్షల సమయంలో ఎంత బాగా చదివిన విద్యార్థులైనా తమకు తెలియకుండానే కొంత ఒత్తిడికి గురవుతుంటారు. కొందరు విద్యార్థుల్లో ఈ ఒత్తిడి కారణంగా చదివినది మరచిపోవడం, పరీక్షల పట్ల భయం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే పరీక్షలకు ప్రణాళికా బద్ధంగా సిద్ధమైతే ఈ తరహా ఒత్తిళ్లను అధిగమించవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అంశాలు ..

  • మీరు రాయబోతున్న ఈ పరీక్షలు ఇప్పటి వరకు మీరు సాధన చేసిన పరీక్షల వంటివే. ఇంకా చెప్పాలంటే వాటికంటే సులభంగా ఉంటాయని భావించండి.
  • మిగిలిన సమయాన్ని టైం టేబుల్ వేసుకొని సబ్జక్టుల వారీగా పంచుకొని చదువుకోవాలి. ఈ సమయంలో కొత్తవి చదివే బదులు ఎంతగా రివిజన్ చేసుకొంటే అంత మంచిది.
  • పరీక్షల పేరుతో పగలు రాత్రి తేడా లేకుండా చదువుతూ కూర్చోకుండా వేళకు తిని, వేళకు నిద్రపోవాలి. కావాలంటే ఉదయాన్నే1 గంట అదనంగా చదువుకోవచ్చు.
  • రోజంతా ఒకే సబ్జక్టు చదువుతూ కూర్చోకుండా నిర్ణీత సమయంలో నిర్ణీత అంశాలను చదవటం పూర్తిచేయాలి. రోజూ అన్నిసబ్జక్టుల రివిజన్ కు ఎంతోకొంత సమయం కేటాయించాలి.
  • ఒక అంశాన్ని అరగంట చదివిన తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేయాలి. ఒకవేళ గుర్తుకు రాకపోతే మరోసారి చదివి మననం చేసుకొంటే సరి. కష్టమైన అంశాలను మననం చేసుకోవటమే గాక ఒకసారి చిత్తుగా రాసి చూసుకోవాలి.
  • మొత్తం సిలబస్‌ను కవర్ చేయటం కుదరదు గనుక ప్రాధాన్యతా క్రమంలో చదువుకోవాలి. పాత పరీక్షా పత్రాలను చూసి ఈ ప్రాధాన్యాలను గుర్తించాలి.
  • ఎప్పుడూ ఒకే చోట కూర్చొని కాకుండా అప్పుడప్పుడూ లేచి ఇంట్లో, ఆరుబయట 5 నిమిషాలు అటూ ఇటూ తిరిగి, తాజా గాలి పీల్చుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • గణిత సూత్రాలు, బొమ్మల సాధన, మ్యాప్స్, పట్టికలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
  • రోజూ లేవగానే 10 నిమిషాలు యోగా, ప్రాణాయామం సాధన చేస్తే మానసిక ఒత్తిడి దూరం కావటమే గాక జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
  • ఫలానా ప్రశ్న తప్పక వస్తుంది, పేపర్‌ లీక్‌ అయ్యింది వంటి ఊహలను మనసునుంచి తుడిచేసి రివిజన్ మీదే దృష్టి పెట్టాలి.
  • పరీక్షల సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది గనుక వాటికి తప్పక తాత్కాలిక విరామ ఇవ్వాలి.
  • అప్పుడప్పుడు మిమ్మల్ని మీరే ఉత్సాహపరచుకోండి. ఇదిమీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
  • వేసవి గనుక తగినంత నీరు, మజ్జిగ, జావతో బాటు ఓట్స్, తృణధాన్యాలు, బాదం పప్పు, పండ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి.
  • పరీక్ష ముందురోజు హాల్‌ టికెట్‌ మొదలు అవసరమైన సరంజామా ఒకచోటపెట్టుకోవటం, పరీక్షా కేంద్ర వివరాలు ముందే తెలుసుకోవటం , పరీక్షా కేంద్రానికి కాస్త ముందుగా చేరుకోవటం వల్ల చివరి నిమిషంలో కంగారు పడాల్సిన ఇబ్బంది తలెత్తదు. 

చివరగా.. పరీక్షలు సదరు అంశంపై విద్యార్థుల అవగాహనను పరీక్షించే కొలమానాలే తప్ప ఆ ఫలితాలే విద్యార్థి ప్రతిభకు గీటురాళ్ళు కావు. కనుక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల కోసం అటు తల్లిదండ్రులు, ఇటు గురువులు కూడా విద్యార్థులను ఒత్తిడి పెట్టకుండా పరీక్షల విషయంలో వారికి తగిన స్వేచ్ఛనివ్వాలి.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE