• HOME
  • ఆహ్లాదం
  • శ్రీ హేవళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)

ఆదాయం: 8          వ్యయం: 14

రాజపూజ్యం: 4      అవమానం: 3

 ఈ ఏడాది మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పేరుప్రతిష్ఠలకు లోటు లేదు. శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తులు సమకూర్చుకొంటారు. విద్యార్థులు గట్టి పట్టుదలతో కృషి చేస్తేనే ఉన్నతవిద్యలో రాణించగలరు. సెప్టెంబర్‌ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రులు, బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి సానుకూల ఫలితాలున్నాయి. పొత్తు వ్యాపారాలు లాభించినా, కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగించినా, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. లేనిపోని వ్యవహారాల్లో జోక్యం వద్దు. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు . ఉద్యోగులు పైఅధికారుల వ్యవహారాల్లో మౌనంగా ఉండటం మంచిది. 

 మేషరాశి వారు ఏప్రిల్‌ - జూన్‌ మధ్యకాలంలో గురువు వక్రగమనంలో ఉన్నందున ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలాగే 6, 7 స్థానాల్లో గురు సంచారం రైతులు, వ్యాపారులకు మేలు జరుగుతుంది. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు , వైవాహిక జీవితంలో అపోహలు రావచ్చు. ఈ ఏడాది 8, 9 స్థానాల్లో శని సంచారం వల్ల ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.అలాగే ఏప్రిల్‌ 7నుంచి ఆగస్టు 26 మధ్యలో శని వక్రగమనం వల్ల షేర్లలో నష్టాలు రావచ్చు. ఈ ఏడాది 5, 4 స్థానాల్లో రాహు సంచారం వల్ల ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టటం, 11, 10 స్థానాల్లో కేతు సంచారం వల్ల ఉద్యోగజీవితం ఉల్లాసంగా సాగటం వంటి మార్పులు కనిపిస్తాయి.

దత్తాత్రేయస్వామి ఆరాధన వల్ల సమస్యలు తొలగి శుభాలు చేకూరతాయి.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం : 2         వ్యయం : 8

రాజపూజ్యం : 7    అవమానం : 6

 వృషభ రాశి వారికి ఈ ఏడాది అన్నివిధాలా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో, వివాహ యత్నాల్లో సానుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. షేర్లు లాభిస్తాయి. విద్యార్థుల ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. స్నేహసంబంధాలు పెంపొందుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సృజనాత్మకతకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. సైన్సు రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. 

 ఈ ఉగాది నుంచి జూన్‌ వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి. గురువు 5-6 స్థానాల్లో ఉండటం వల్ల సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. గురువు సెప్టెంబర్‌ 13 నుంచి తులారాశిలో ప్రవేశించటం వల్ల ఉద్యోగప్రాప్తి, పదోన్నతులు, వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది. అలాగే..ఈ ఏడాది శని 7, 8 స్థానాల్లో సంచరించటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించటం, స్థిరాస్తులు కొనుగోలు, షేర్ల కొనుగోళ్లు లభించటం, దుబారా పెరగటం సంభవిస్తాయి. శని వక్రించిన ఏప్రిల్‌-ఆగస్టు మాసాల మధ్య దంపతుల మధ్య అపోహలు, శతృబాధలు, రుణ బాధలు, ఆస్తి వ్యవహారాల్లో సమస్యలు ఎదురుకావచ్చు. వీటితో బాటు బ్యాంకులు, చిట్స్, బీమా, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌ ఉద్యోగులకు నిరాశాజనక ఫలితాలు, వాహన చోదకులకు ప్రమాదాలు ఎదురుకావచ్చు. ఈ ఏడాది 4, 3 స్థానాల్లో రాహుసంచారం మూలంగా కుటుంబ సమస్యలు, బదిలీలు ఉండొచ్చు. ఈ ఏడాది 10, 9 స్థానాల్లో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

శివారాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

మిథునం (మృగశిర 3,4; ఆరుద్ర, , పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం : 5         వ్యయం : 5

రాజపూజ్యం : 3    అవమానం : 6

ఈ రాశివారు ఈ ఏడాదిలో ఇంటి స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో చక్కని పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు వృత్తిపరమైన పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలసమయం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మిథున రాశివారికి ఈ ఏడాది 4, 5 స్థానాల్లో శుభప్రదుడైన గురువు సంచారం వల్ల విలువైన వస్తువులు, నగలు, స్థిరచరాస్తులు సమకూర్చుకోవటంతో బాటు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉగాది నుంచి జూన్‌ వరకు గురువు వక్రగమనంలో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో ప్రతికూలత, కుటుంబసభ్యుల వైఖరిలో ప్రతికూల మార్పులు, న్యాయవివాదాలు ఎదురవుతాయి. ఈ సమయంలో రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సెప్టెంబర్‌ నుంచి వచ్చే ఉగాది వరకు గురువు పంచమంలో సంచరించటంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు, షేర్లలో లాభాలు, సైన్సు రంగాల వారికి ప్రోత్సాహం, శతృవులు మిత్రులుగా మారటం వంటి సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. 

శని ఈ ఏడాది మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేయటం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, శ్రమకు తగిన ప్రతిఫలం, వివాహ ప్రయత్నాల్లో పురోగతి, ఆర్థిక పరమైన లాభాలు, వ్యాపార విస్తరణ, సృజనాత్మకమైన ఆలోచనలు సాధ్యమవుతాయి. అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవటంతో బాటు పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. శని వక్రించిన ఏప్రిల్‌ 7నుంచి ఆగస్టు 26 మధ్యకాలంలో ప్రత్యర్థులతో సమస్యలు, దంపతుల మధ్య స్పర్థలు, అనారోగ్య సమస్యలు రావచ్చు. ఈ ఏడాది 3, 2 స్థానాల్లో రాహు సంచారం వల్ల ఉద్యోగంలో మార్పులుచేర్పులుంటాయి. దుబారా ఎక్కువ. పిన్న వయస్కులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ ఏడాది చెడుస్నేహాలకు దూరంగా ఉండటం, భారీ పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఈ ఏడాది 9, 8 స్థానాల్లో కేతు సంచారం వల్ల ఉన్నతవిద్యలో కృషితో విజయాన్ని అందుకుంటారు. అలాగే.. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవటం , ఆర్థిక సమస్యలు, ఆస్తివివాదాలు, వృత్తిపరమైన ఒత్తిడి తప్పవు.

ఆంజనేయస్వామి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

కర్కాటకం (పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం : 14      వ్యయం : 2

రాజపూజ్యం : 6    అవమానం : 6

 శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఈ రాశి వారు చేపట్టిన కాంట్రాక్టులు, కుదుర్చుకున్న ఒప్పందాలు విశేషంగా లాభిస్తాయి. విదేశాల్లో ఉన్నతవిద్యకోసం వెళ్లేందుకు పూర్తిగా అనుకూలసమయం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్స ల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంతఇంటికల నెరవేరుతుంది. ఉగాది నుంచి జూన్‌ మధ్యకాలంలో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్య, రాజకీయ రంగాల వారికి ప్రతికూల అనుభవాలు ఎదురు కావచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 12 వరకు గురువు కన్యారాశిలోనూ, ఆ తర్వాత తులారాశిలో సంచరించటం మూలంగా తోబుట్టువులు, బంధువుల విషయాల్లో శుభపరిణామాలు, ఉద్యోగప్రయత్నాలు ఫలించటం, పెద్దల ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. దూరప్రయాణాలకు , బదిలీలకు ఇది అనుకూల సమయం. ఫిబ్రవరి 7 నుంచి జూన్‌ 19 వరకు గురువు వక్రించిన కారణంగా వృత్తి, వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం, ఉద్యోగ యత్నాలు ఫలించకపోవటం, కుటుంబ సమస్యలు తప్పవు. సెప్టెంబర్‌ తరువాత స్థిరాస్తులు సమకూర్చుకోవటం, ఉద్యోగులకు గుర్తింపు, పొత్తు వ్యాపారాల ఆరంభం, వారసత్వ సమస్యల పరిష్కారం వంటి సానుకూల మార్పులుంటాయి. 

 ఈ ఏడాది 5, 6 స్థానాల్లో శని సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు, విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోవటం, వ్యాపారంలో నష్టాలు , ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, పని ఒత్తిడి అధికం కావటం, బాకీలు వసూలు కాకపోవటం వంటి ప్రతికూల మార్పులు తప్పవు. భారీ వ్యాపారాలకు, కొత్త ప్రాజెక్టులకు ఇది అనుకూల సమయం కాదు. ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య శని వక్రగమనం వల్ల వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం , ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి ఈ సమయం శుభప్రదం. క్రీడాకారులకు, వివాహ యత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు. ఈ ఏడాది 2, 1 స్థానాల్లో రాహు సంచారం వల్ల దుబారా ఎక్కువ గావటం, మాట నిలుపుకోలేని దుస్థితి, రుణబాధలు, డబ్బు నిలవకపోవటం,మానసిక ఆందోళన, అనారోగ్యం వంటి ఇబ్బందులుంటాయి. అలాగే.. 8, 7 స్థానాల్లో కేతు సంచారం వల్ల దంపతుల మధ్య అపోహలు, ఆందోళన ఎక్కువవుతాయి. డ్రైవింగ్‌ చేసేవారు నిదానం పాటించటం, వ్యాపారులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించటం అవసరం.

శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

 

సింహ (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

ఆదాయం : 2         వ్యయం : 14

రాజపూజ్యం : 2    అవమానం : 2

ఈ రాశి వారికి హేవళంబిలో ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల, ఉద్యోగంలో బదిలీలు, పదోన్నతులకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పిల్లల విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏప్రిల్‌ -జూన్‌ మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.విద్యార్థులు కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనందం కలిగిస్తాయి. సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి వారికి 2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం వల్ల ఆస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకోవటం, ప్రముఖులతో పరిచయాలు, తోబుట్టువుల విషయంలో శుభ పరిణామాలు చోటుచేసుకొంటాయి. వ్యాపారులు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకొంటే మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి ఆలోచించాలి . సెప్టెంబర్‌ 13 నుంచి సోదరులు, సన్నిహితులతో సఖ్యత, కార్యసిద్ధి చేకూరతాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభఫలితాలు. 

ఈ రాశివారికి 4,5 స్థానాల్లో శని సంచారం వల్ల ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. తలపెట్టిన పనిలో ఆటంకాలు, జాప్యం ఎదురవుతాయి. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 మధ్యకాలంలో శని వక్రించటం వల్ల ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలెదురైనా ఓర్పుతో అందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తారు. మిత్రుల వల్ల చదువును నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఎక్కువ. ఈ ఏడాది 1, 12 స్థానాల్లో రాహు సంచారం వల్ల మానసిక ఆందోళన ఎక్కువ. విలాసాల ఖర్చులు ఎక్కువవుతాయి. విద్యలో ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. 7, 6 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో చిక్కులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మందగించటం, అపార్థాల వల్ల సంబంధాలు దెబ్బతినటం వంటిమార్పులుంటాయి.

సూర్యారాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

కన్య (ఉత్తర 2,3,4; హస్త; చిత్త 1,2 పాదాలు)

ఆదాయం : 5         వ్యయం : 5

రాజపూజ్యం : 5    అవమానం : 2

 కన్యా రాశి వారికి ఈ ఏడాది మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. మీ సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. గృహ నిర్మాణం, స్థలసేకరణకు అనుకూలమైన సమయం. వివాహ, ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసాల మధ్య మానసిక అశాంతికి లోనవుతారు. ఈ సమయంలో చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఉగాది నుంచి గురువు చంద్రరాశిలో సంచరించటం వల్ల సృజనాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టటం, పదోన్నతులు, ఉద్యోగం లభించటం, ఆరోగ్యం మెరుగుపడటం వంటి సానుకూల మార్పులుంటాయి. జీవిత భాగస్వామి సహకారం, వారితో అనుబంధాలు బలపడటం, పొత్తు వ్యాపారాలు లాభించటం, సంతానం విషయంలో శుభపరిణామాలు, శతృవులు సైతం మిత్రులుగా మారటం జరుగుతుంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఫిబ్రవరి 7 నుంచి జూన్‌ 10 వరకు గురువు వక్రించిన కారణంగా అశాంతికి లోనవటం, చర్మ సమస్యల వంటి అనారోగ్యం వేధిస్తాయి. 

శని 3, 4 స్థానాల్లో సంచరించటం వల్ల పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురైనా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ సమస్యలు.. ముఖ్యంగా పిల్లల విషయంలో ఆందోళ ఎక్కువవుతుంది. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేసి విలాసాలవైపు ఆకర్షితులవుతారు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మాసాల మధ్య శని వక్రించిన కారణంగా ఆస్తి సమస్యల పరిష్కారం , ఉద్యోగుల బదిలీయత్నాలు ఫలించటం, కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనటం జరుగుతుంది. ఈ దశలో విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఈ సంవత్సరంలో 12, 11 స్థానాల్లో రాహుసంచారం వల్ల దుబారా, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. క్రీడాకారులకు ఇది అనుకూల సమయం. 6, 5 స్థానాల్లో కేతు సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో చికాకులు, షేర్లు, పొత్తు వ్యాపారాల్లో చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఉన్నత విద్యకై చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

 

సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

తుల (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం : 2          వ్యయం : 8

రాజపూజ్యం : 1     అవమానం : 5

తులారాశి వారికి హేవళంబి నామ సంవత్సరంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌, రాజకీయ, సినీ రంగాల వారికి సానుకూల ఫలితాలు. ఉగాది నుంచి జూన్‌ వరకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. విద్యార్థులు లక్ష్య సాధన కోసం మరింత శ్రమించాలి. ఉద్యోగులకు పదోన్నతులు. ఉద్యోగవిధుల్లో భాగంగా విదేశీయానం చేస్తారు. గురువు 12-1 స్థానాల్లో సంచారం మూలంగా విలాసాలకు, దూరప్రయాణాలకు అధిక సమయం వెచ్చిస్తారు. నేతలకు పదవీయోగం ఉంది. కళాకారులు మంచి ప్రాజెక్టులు చేపడతారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు దుబారా పెరగటం, ఆదాయం పెరిగినా చేతిలో డబ్బు నిలవకపోవటం, ఇల్లు, ఉద్యోగంలో మార్పులుంటాయి. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు డబ్బు ఖర్చు చేస్తారు. 

2, 3 స్థానాల్లో శని సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో నిదానం, పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తోబుట్టువులు, ఆత్మీయుల బాధ్యతలు మోయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబ గొడవలు, విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది. వ్యాపారులకు ఒత్తిళ్లు ఎదురైనా చివరకు సానుకూల ఫలితాలున్నాయి. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు చదువులో రాణింపు, వృత్తి, వ్యాపార సంబంధిత సానుకూల వార్తలు వింటారు. 11, 10 స్థానాల్లో రాహు సంచారంతో నిరుద్య్యోగులకు ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. 5, 4 స్థానాల్లో కేతు సంచారం మూలంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. గృహనిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి.

శ్రీరామచంద్రమూర్తి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం : 8          వ్యయం : 14

రాజపూజ్యం : 4     అవమానం : 5

శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. జీవితం ఉల్లాసంగా సాగుతుంది . కొత్త వ్యాపారాలు ఆరంభించి విజయాన్ని అందుకొంటారు. ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య చక్కని అవగాహన నెలకొంటుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహ వాతావరణం, మానసిక ఒత్తిడి, విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపించటం వంటి మార్పులు ఉంటాయి. ఈ ఏడాది గురువు లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తున్న కారణంగా ఆదాయంలో వృద్ధి, వృత్తి పరమైన రాణింపు, సంతానం వృద్ధిలోకి రావటం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలకు శ్రీకారం చుట్టటం, వివాహ యత్నాలలో ముందడుగు, విదేశీ యాత్రలు, విదేశీ విద్యకై చేసే యత్నాల్లో సానుకూలత, ఉద్యోగంలో స్థిరత్వం సిద్ధిస్తాయి. ఈ ఏడాది విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ, వస్త్ర, రవాణా, మత్స్య వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉగాది నుంచి జూన్‌ వరకు పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.

ఈ ఏడాది 1, 2 స్థానాల్లో శని సంచారం వల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. పనుల్లో అటంకాలు, మానసిక అస్థిరత, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, అప్పుల బాధ, ఆర్థిక వివాదాలు, మంచికి పోతే చెడు ఎదురుగావటం, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపలేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఓ మేరకు లాభిస్తాయి. ఇతరుల ఆర్థిక విషయాల్లో తలదూర్చితే చిక్కులు తప్పవు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు వైఫల్యాలను లెక్కచేయక ముందుకుసాగి లక్ష్యాలు సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఈ ఏడాది 10, 9 స్థానాల్లో రాహు సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగ మార్పుకు ప్రయత్నిస్తారు. 4, 3 స్థానాల్లో కేతు సంచారం వల్ల కుటుంబ వ్యవహారాల్లో అశాంతి, అనారోగ్యం, దుబారా పెరగటం,తోబుట్టువులు, బాంధవులతో సఖ్యత లోపించటం సంభవిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

లక్ష్మీదేవి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

ఆదాయం : 11       వ్యయం : 5

రాజపూజ్యం : 7     అవమానం : 1

ఈ రాశివారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులున్నాయి. రాజకీయ, ప్రభుత్వ, సహకారరంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ఏడాది విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఈ ఏడాది గురువు 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు గనుక ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు సాకారం కావటం, కీర్తిప్రతిష్టలు పెరగటం, తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు, నాయకులకు పదవీయోగం సిద్ధిస్తాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ఉద్యోగుల బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఈ సమయంలో తొందర పాటు నిర్ణయాలు తగవు. సెప్టెంబర్‌ 13 నుంచి గురువు లాభస్థానంలో సంచరించటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన వివాహ యత్నాలు ఫలిస్తాయి. 

12, 1 స్థానాల్లో శని సంచారం వల్ల ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సలహాతో ముందడుగు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. తల, నరాలు, కండర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు శని వక్రించటం వల్ల క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సహనం పాటిస్తే మంచి ఫలితాలున్నాయి. 9, 8 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వల్ల మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. 3, 2 స్థానాల్లో కేతు సంచారం వల్ల దుబారా ఖర్చులు పెరగటం, సంతానం విషయంలో సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదురవుతాయి. విద్యార్థులు ఏకాగ్రతాలోపం వల్ల నష్టపోతారు.

గణపతి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం : 14       వ్యయం : 14

రాజపూజ్యం : 3     అవమానం : 1

శ్రీ హేవళంబినామ సంవత్సరంలో మకర రాశి వారి విదేశీయాత్రా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి. వ్యాపారాల్లో లాభాలు, విస్తరణ ఉంటాయి. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి ఇది తగిన సమయం. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అధిష్టిస్తారు.గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ - జూన్‌ మధ్యకాలంలో పలు కారణాల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికమవుతాయి. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ ఏడాది 9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు, వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, మీడియా, కళ, సాంస్కృతిక, ఉన్నత విద్య, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. దమ్పతులకు సంతాన ప్రాప్తి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పు ఆశిస్తారు. విద్యార్థులు, క్రీడారంగాల వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉగాది నుంచి జూన్‌ 11 వరకు గురువు వక్రించటం వల్ల వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం, అసౌకర్యం తప్పవు. మీ పురోగతికి అసూయ చెందేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. 

11, 12 స్థానాల్లో శని సంచారం వల్ల వ్యాపార లాభాలు మందగిస్తాయి. జల్సాలకు డబ్బు ఖర్చు చేస్తారు. అప్పులు పెరుగుతాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. రహస్య కార్యకలాపాల వల్ల అప్రతిష్ఠ రావచ్చు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. 8, 7 స్థానాల్లో రాహు సంచారం కారణంగా పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక సాయం విషయంలో ఒకటి రెండు సార్లు అలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు, ప్రేమ లో వైఫల్యం ఉండొచ్చు. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. 2, 1 స్థానాల్లో కేతు సంచారం వల్ల దుబారా ఖర్చులు పెరగటం, చికాకుల వల్ల ఏకాగ్రత దెబ్బతినటం జరుగుతుంది.

కనకదుర్గ ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

కుంభం (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం : 14       వ్యయం : 14

రాజపూజ్యం : 6     అవమానం : 1

కుంభ రాశి వారు హేవళంబినామ సంవత్సరంలో న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐ.టి, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది . విదేశీ విద్యకు, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. నూతన వ్యాపారాలకు సానుకూల సమయం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు స్థలమార్పిడి, పదోన్నతులకి అవకాశం ఉంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య ఆర్థిక, వృత్తిపరమైన విషయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. న్యాయవివాదాలు , ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 8-9 స్థానాల్లో గురు సంచారం వల్ల ఆస్తులు సమకూర్చుకోగలుగుతారు. ఉద్యోగులు ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగపు వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో గల విబేధాలు సమసిపోతాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సాయంగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. 

ఈ ఏడాది 10, 11 స్థానాల్లో శని సంచారం వల్ల నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు తప్పవు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కార్యదీక్షతో లక్ష్యాలు సాధిస్తారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఒత్తిళ్లు పెరగటం వల్ల అసంతృప్తి, అశాంతి పెరుగుతుంది. వాహనాలు నడిపేవారికి ఏకాగ్రత అవసరం. షేర్లలో నష్టాలు, చెడు స్నేహాల వల్ల అప్రతిష్ట రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 7, 6 స్థానాల్లో రాహు సంచారం వల్ల స్నేహితులతో సమస్యలు, దంపతుల ఆమధ్య అపోహలు, రుణబాధలు రావచ్చు. 12, 1 స్థానాల్లో కేతు సంచారం వల్ల దుబారా ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.

శ్రీకృష్ణుడి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది.

 

మీనం (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం : 11       వ్యయం : 5

రాజపూజ్యం : 2     అవమానం : 4

శ్రీ హేవళంబినామ సంవత్సరంలో మీన రాశివారి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. ఆస్తులు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు. ఉన్నతవిద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. కొత్త వ్యాపారాలు, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృత్తిపరమైన ఒత్తిళ్ళు, న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 13 వరకు 7వ స్థానంలో గురు సంచారం వల్ల మీ లక్ష్యసాధనలో బంధుమిత్రుల సాయం అందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పొత్తు వ్యాపారం లాభిస్తుంది. విద్యార్థులకు సానుకూలఫలితాలు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రకటనలు, రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి,ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. షేర్లు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడాకారులకు శుభఫలితాలు. ఉగాది నుంచి జూన్‌ 11 వరకు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శస్త్ర చికిత్స చేయాల్సి రావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. యుక్తితో పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 

ఈ ఏడాది 9, 10 స్థానాల్లో శని సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. బదిలీలకు ఆస్కారం ఉంది. అదనపు బాధ్యతల మూలంగా ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రతిష్ఠ దిగజారవచ్చు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ ఏడాది 6, 5 స్థానాల్లో రాహు సంచారం వల్ల రుణ బాధలు, ఆర్ధిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువ. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సర్జరీ చేయించుకోవాల్సి రావచ్చు. విద్యార్థులు లక్ష్య సాధనకు మరింతగా శ్రమించాలి. 12, 11 స్థానాల్లో కేతు సంచారం వల్ల ఇంటి ఖర్చులు పెరుగుతాయి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో తొందరపాటు తగదు. ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు. 

పార్వతీదేవి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE