మనిషి జీవితంలో అనుబంధాల పాత్ర చాలా ప్రధానమైనది. మనిషికి కుటుంబపరమైన సంబంధాలు ఎంత ముఖ్యమో ఇరుగుపొరుగు వారితో, సహోద్యోగులతో ఉండే సామాజిక సంబంధాలూ అంతే  అవసరం. ఈ అనుబంధాలు ఎంత బలంగా ఉంటె మనిషి జీవితం అంత ఆనందమయమవుతుంది. అయితే లేనిపోని అపోహలు, ఆర్ధిక విషయాల మూలంగా ఈ బంధాలు దెబ్బతినే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందనే అంశాలను గుర్తించుకుని అందరూ తమ తమ బంధాలను బలోపేతం చేసుకునేందుకు తప్పక ప్రయత్నించాలి.

సామాజిక సంబంధాలు: పుట్టినప్పటి నుంచి చుట్టూ ఉండే ప్రకృతితో మనిషి బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులతో మొదలయ్యే ఈ ప్రయాణం క్రమంగా బంధువులు, ఇరుగుపొరుగు వారికి విస్తరిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మిత్రులతోనూ చక్కని అనుబంధం ఏర్పడుతుంది. ఈ బంధాలన్నీ కలిసి మనిషికి ఒక చక్కని వ్యక్తిత్వాన్ని, సామాజిక గుర్తింపునూ తెస్త్తాయి.

ఏ కారణం చేతనైనా బాల్యంనుంచే మనిషి దూరమైతే ఆ వ్యక్తి పిరికివాడుగా, ఒంటరివాడుగా మిగిలిపోతాడు.

సానుకూల దృక్పథం:  ప్రతి పనిలోనూ ప్రతికూలంగా ఆలోచించటానికి బదులుగా మంచిని చూడటమే సానుకూల దృక్పథం. లేనిపోని భయాలను, అర్థం పర్థం లేని ఆందోళనలను పక్కకు పెట్టి, అంతా మంచే జరుగుతుందని నమ్మే మనిషికి ప్రతి పనిలోనూ విజయమే వరిస్తుంది. ఈ తరహా వ్యక్తులతో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అంతా స్నేహం చేసేందుకు ముందుకొస్తారు. ఇలాంటి వారు పని ఒత్తిడి నుంచి జీవితంలో ఎదురయ్యే పలు రకాల  సమస్యలను చాలా సులభంగా అధిగమించి, జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. మన కుటుంబ సభ్యులను మనం ఎంచుకోలేముగాని మన స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉందని అందరూ గుర్తించాలి. మన స్నేహితులను బట్టి మనమేంటో ఎదుటి వారికి సులభంగా తెలిసి పోతుంది.

స్నేహం పాత్ర: పంచుకోవటం ద్వారానే అంకురించే భావన స్నేహం. నీది, నాది అనే భావన స్థానంలో మనదనే భావన ఇది. ఊహ తెలిసినప్పటి నుంచి జీవితపు చివరి క్షణం వరకూ మనిషికి అన్ని విధాలా ఆలంబనగా నిలిచేది స్నేహమే. ప్రతి స్నేహితుడినీ ప్రత్యేకంగా భావించి అందరితోమంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. నమ్మకమే ఈ బంధానికి పునాది అని గుర్తించాలి. వారితో మనకున్న చనువు, ఆత్మీయత, నమ్మకం ఆధారంగా వారిలో ప్రాణ స్నేహితులు, సాధారణ స్నేహితులు, ముఖ పరిచయం ఉన్నవారనే తేడాలు ఉన్నప్పటికీ వీరంతా ఏదో ఒక స్థాయిలో మనపట్ల సానుకూలంగా ఉన్నవారే. ఆలోచనలు,అభిరుచులు కలిసే కొద్దీ ఈ బంధం మరింత బలపడుతుంది. నిజ జీవితంలో ఎదురయ్యే పలు ఆటు పోట్ల కారణంగా ఈ బంధం ఒడుడుడుకులకు లోనైనా ఎప్పటికప్పుడు చొరవతో, లేనిపోని బింకాలను పాక్కన బెట్టి స్నేహ బంధాన్ని పునరుద్ధరించుకోవాలి. దీని వల్ల జీవితం ఆనంద మయమై మంచి ఆరోగ్యం కూడా సిద్దిస్తుంది. ఇది జరగనప్పుడు జీవితం బరువుగా, యాంత్రికంగా మారి ప్రతికూలమైన ఆలోచనలతో మనసు నిలకడను కోల్పోతుంది.

స్నేహబంధాని దృడ పరచే ఏడు అంశాలు

మెరుగైన కమ్యూనికేషన్: తమ మనసులోని భావనలను తోటి వారితో పంచుకోవటం వల్ల స్నేహ బంధం బలపడుతుంది. ఎప్పుడూ మనం చెప్పేది అందరూ వినాలని కోరుకోకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ వినే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తమ మాట వినే, తమ ఆలోచనలకు విలువిచ్చే ఓ నేస్తం దొరికాడనే సానుకూల భావన ఎదుటివారిలో తప్పక బలపడుతుంది. ఇదే ప్రాణ స్నేహంగా మారుతుంది.

 

నమ్మకం, చొరవ: మనిషి లోని అభద్రతా భావం అతడిని ఒంటరిగా మారుస్తుంది. దీనిని వదిలించుకోలేక పోతే ఆ వ్యక్తి జీవితంలో ఎవరినీ నమ్మలేని పరిస్థితిలో పడిపోతాడు. కొత్త వ్యక్తులతో చొరవగా, నమ్మకంగా మాట్లాడం ద్వారా ఈ పరిస్థితి నుంచి వీరు బయటపడేందుకు చూడాలి.

మానవ సంబంధాలు: సాంకేతికత పెరిగే కొద్దీ మనిషి సమాజానికి దూరమవుతున్నాడు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తప్ప ఏదీ పట్టని ఓ విచిత్రమైన ధోరణికి నేటి తరం అలవాటు పడుతోంది. ప్రపంచంలోని మారుమూల మనిషికీ క్షణంలో సందేశం పంపుతున్న ఈ  రోజుల్లోనే పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులను మాత్రం పలకరించలేక పోతున్నారు. పేస్ బుక్ లైక్స్, సంక్షిప్త సందేశాలు ఓ ఆత్మీయమైన పలకరింపుకు సాటిరావని వీరంతా గుర్తుంచుకోవాలి.

స్నేహమే పెట్టుబడి: దాచుకొన్న సంపద ఎలా ఆపదలో అక్కరకు వచ్చినట్లే మన స్నేహితులు, వారితో మనం ఏర్పరుచుకున్న అనుబంధాలూ కష్టకాలంలో మనకు ఆలంబనగా నిలుస్తాయి.

నిజాయితి: ప్రేమ వంటి భావనల విషయంలో మనిషి వ్యక్తపరిచే భావోద్వేగాలు ఎంతో విలువైనవి. అయితే వీటిని నిజాయితీగా, స్వేచ్ఛగా వ్యక్తీకరించ లేక పోతే మాత్రం అవి కోలుకోలేని రీతిలో దెబ్బతింటాయి.

వాస్తవ దృక్పథం: జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయనీ, అన్ని పరిస్తితులూ మనకు అనుకూలంగా ఉండవనే వాస్తవిక ధోరణిని అందరూ అలవరచుకోవాలి. అప్పుడే ఎలాంటి ఫలితాన్నైనా మనిషి స్వీకరించగలడు. అప్పుడే అనుకోకుండా ఎదురయ్యే చేదు అనుభవాలను సులభంగా మరచి పోవటం సాధ్యమవుతుంది.

అనుమానాల నివృత్తి: బంధాల విషయంలో స్పష్టత, పారదర్శకత ఉండాల్సిందే. లేకుంటే లేనిపోని అనుమానాలు, అపోహలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు తెగేదాకా లాగకుండా పట్టువిడుపు ధోరణితో  సమస్యను పరిష్కరించుకోవాలి.

పెద్దల సలహా: కడివెడు జ్ఞానం కంటే చెంచాడు అనుభవం గొప్పదనే మాటను అనుసరించి, ఏదైనా సమస్య వస్తే పెద్దలు, బంధువులు, స్నేహితుల సలహా తీసుకునేందుకు మొహమాట పడరాదు. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకోవటంలో తప్పులేదు. ఎదుటి వారి సాయం కోరటం సానుకూలాంశమే తప్ప బలహీనత కాదని గుర్తించాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE