అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి,  వ్యక్తిగా తానూ తప్పక ఎదగాలి. వ్యక్తిగతంగానూ ఔన్నత్యం సాధించి, హుందాతనాన్ని సంతరించుకున్న మనిషిని సమాజం బాగా గౌరవించి, ఆయన్ను అనుసరిస్తుంది. పెద్ద నాయకుడు లేదా ధనికుడయ్యేనాటికి ఆ మనిషికి పెద్దమనిషి తరహా అలవడాలి. వయసొచ్చిన ప్రతి వ్యక్తీ పెద్దవాడవుతాడని లేదు. చాలామంది ముసిలాళ్ళవుతారు. కొందరే పెద్దవాళ్ళవుతారు. 

వ్యక్తిగతంగా ఉన్నత స్థితిని పొందిన వ్యక్తి ఆలోచనల్లో- ఒకానొక సామాజిక, సాంస్కృతికమైన హుందాతనం కనపడుతుంది. లోకహితం చేకూర్చే సద్భావన ఆ ఆలోచనల్లోంచి తొంగిచూస్తుంది. ఈ లోపలి ఎదుగుదల లేకుండా మనిషి ఈ లోకంలో గొప్పవాడైపోతే, అతనికి ఆత్మతో  సంఘర్షణ తప్పదు. లోపల ఒకలా, బయట మరోలా ఉన్న మనిషిని ఆత్మలోకపు దివాలాతనం వెక్కిరిస్తుంది. నూటికి తొంభైమందిలో ఈవేళ మానసిక అశాంతికి ముఖ్య కారణం ఇదే! సమాజంలో ఉన్నతస్థితిలోనే ఉన్నా, వ్యక్తిగతంగా ఔన్నత్యం లోపిస్తే మనిషికి మనశ్శాంతి కరవవుతుంది. సమాజంలో పెరుగుతున్న కీర్తిప్రతిష్ఠలు- మనిషికి నీడ వంటివి. నీడ మనిషిని మించిపోతోందంటే- సూర్యాస్తమయానికి సమయం సమీపించిందని అర్థం. ఆపై మిగిలేది చీకటే! కనుక కీర్తి కన్నా, ప్రాచుర్యం కన్నా మనిషి స్వీయ వ్యక్తిత్వం తప్పక ముందుండాలి. ఆ రెండింటి మధ్యా సమతుల్యం ఏర్పడాలి. 

మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పేదిదే! ఆత్మలోకపు ఎదుగుదల లేకుండా పెద్దమనిషిగా చలామణీ అయ్యేవారిని 'మిస్టర్‌ జకిల్‌-మిస్టర్‌ హైడ్‌'గా వర్ణిస్తారు.ఉదారవాదాన్ని వినిపిస్తూ, నీతిని ప్రవచించే వ్యక్తి- 'మిస్టర్‌ జెకిల్‌!' లోలోపలి తప్పుడు ఆలోచనలకు ముసుగు తొడిగి ఉన్న అదే వ్యక్తి పేరు 'మిస్టర్‌ హైడ్‌'! మనకు ఎదురయ్యేవాళ్ళలో చాలామంది ఇలాంటివాళ్ళే. సభల్లో, బారుల్లో, క్లబ్బుల్లో యూనియన్ల నేతల్లో- ఎక్కువమంది వీరే. రాజకీయ నాయకుల్లో వీరి సంఖ్యా మరింత ఎక్కువ. దురదృష్టకరమైన విషయం ఏమంటే- అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటున్నప్పుడు కూడా! 

'విజయమా, విలువలా?' అని ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను అడిగితే ఆయన 'ఓటమి ఎరుగని మనిషిని అనిపించుకోవడం కన్నా- విలువలు వదులుకోని వ్యక్తిగా ఉండటమే ఇష్టం' అన్నాడు. ఏం సాధించావు అనేదాని కన్నా, ఎలా దాన్ని సాధించావు అనేది ప్రధానం అనే అర్థంలో బాపూజీ 'సిద్ధి కన్నా సాధనలు ముఖ్యం' అని నిర్వచించారు. విలువల కోసం తపించినందునే వారు చరిత్రలో నిలిచారు. ఎదిగే క్రమంలో ఓడినా ప్రమాదం లేదుగానీ, విలువలు జారిపోతే మాత్రం- అటు వ్యక్తికీ, ఇటు సమాజానికీ చేటు తప్పదు. కనుక మనిషి బయటే గాక  లోపలా 'మిస్టర్‌ జెకిల్‌'గానే ఉండాలి. 'హైడ్‌'తో స్నేహం వదులుకోవాలి. అప్పుడే మనిషిలో ఘర్షణ ఆగిపోయి, ప్రశాంతత ఏర్పడుతుంది. 

 ప్రముఖ కవి షేక్‌స్పియర్‌ కవితాత్మకంగా వ్యాఖ్యానిస్తూ 'నువ్వు బయటకు ప్రదర్శిస్తున్నదానికన్నా నీలో విషయం ఎక్కువ ఉండాలి. ప్రపంచానికి నీవు చెబుతున్నదానికన్నా నీకు ఎక్కువ తెలిసి ఉండాలి' అన్నాడు. ఇప్పడు అది జరగనందునే మనిషికి ఒత్తిడి పెరిగిపోతోంది. దీనికి విరుగుడుగా పెద్దలు 'చిత్తశుద్ధి' అనే మంత్రాన్ని మనకు సూచించారు. దీన్ని కాపాడుకుంటే, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ మనిషిలో ఘర్షణ, దివాలాకోరుతనం ఉండవు. జీవనరాగం శ్రుతి తప్పదు. బయటా లోపలా 'మిస్టర్‌ జెకిల్‌'గానే ఉండగలగడం అంటే- జీవితాన్ని జయించటమే. దానికి చిత్తశుద్ధి మూలం. అప్పుడు మనిషి సాధించినదానికన్నా అతడి అర్హత ఇంకా పై స్థాయిలో ఉంటుంది. లోకంలో ప్రాచుర్యంకన్నా, కీర్తికన్నా- అసలు మనిషి ఇంకా ఎత్తులో ఉంటాడు. అలాంటి మనుషుల్నే ధన్యజీవులంటారు.

- ఎర్రాప్రగడ రామకృష్ణ గారికి కృతజ్ఞలతో  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE