ఆహారాన్ని బట్టే ఆరోగ్యం, ఆయుర్దాయం ఆధారపడి ఉంటాయని ఆయుర్వేదం పేర్కొంటోంది. సమతుల ఆహారం తీసుకున్నప్పుడే శారీరక స్థితి (ఆయుర్వేద పరిభాషలో ప్రకృతి ) అన్నివిధాలా బాగుంటుంది. పిత్త, వాత, కఫ దోషాలే సకల రోగాలకు కారణమని చెప్పే ఆయుర్వేదమే, వీటి నివారణ, చికిత్సకు పనికొచ్చే పలు రకాల ఆహారాలను కూడా నిర్దేశించింది. పీచుపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరు ధాన్యాలు, గింజలు  వంటి ఆహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఈ శాస్త్రం చెబుతోంది. అలాంటి ఆయుర్వేదం చెబుతున్న ఆహారాలు, వాటికి సంబంధించిన విశేషాలనూ  తెలుసుకుందాం .

నియమాలు

మనిషి శరీరం పిత్త ,వాత, కఫ వర్గాలలో ఏదో ఒక రకానికి చెందినదై  ఉంటుంది . జల, వాయు, పృథ్వి, ఆకాశ, అగ్నిఅనే తత్వాలను బట్టి పిత్త, వాత, కఫ శరీరాల్లో ఎవరిది ఏ రకానికి చెందిన శరీరమో  నిర్ణయిస్తారు. తీసుకునే ఆహారంలో తీపి,  ఉప్పు, పులుపు, వగరు, చేదు రుచులతో కూడిన పదార్ధాలతో బాటు ఏదైనా కషాయం ఉంటేనే అది సంతులిత ఆహారమని ఆయుర్వేదం చెబుతోంది. తీపి, ఉప్పు, పులుపు  ఎక్కువగా ఉండే ఆహారంతో వాతాన్ని తగ్గించవచ్చు. చేదు, ఘాటైన మసాలాలతో కూడిన ఆహారం కఫ దోషాల్ని దూరం చేస్తుంది. తీపి, ఘాటైన ఆహారాలు పిత్త దోషాన్ని నివారిస్తాయి. సదరు వ్యక్తి ప్రకృతిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఎలాంటి ఆహారం సూచిన్చాలో వైద్యులు నిర్ణయిస్తారు. తీసుకునే ఆహారాన్ని బట్టే ఆయా వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి.

సాత్వికాహారం

ఆయుర్వేదం ప్రకారం ఇది అత్యుత్తమ ఆహారం . శారీరక, మానసిక పరిస్థితులను సమన్వయ పరచె ప్రత్యేకత దీని సొంతం. ఇది చాలా త్వరగా, సులభంగా జీర్ణం అవటమే గాక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శారీరక దృఢత్వం కోరే వారు దీన్ని తప్పక తీసుకోవాలి. ఈ ఆహారంలో పచ్చి కూరగాయలు, తేలికగా ఉడికించిన  ఆకుకూరలు, పండ్లరసాలు, ఆవు పాలు, మొలకెత్తిన గింజలు, నెయ్యి, తేనె, హెర్బల్ టీ వంటివి ఉంటాయి . 

రాజసిక ఆహారం

ఎక్కువ కేలరీలుండే ఈ ఆహారంలో మాంసం, మసాలాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు దీనిని తప్పక తీసుకోవాలి. ఇది జీర్ణం కావటం కాస్త కష్టమే అయినా పెద్ద మొత్తంలో శక్తిని అందిస్తుంది.

తామసిక ఆహారం

నిల్వ పచ్చళ్ళు, ఎక్కువ నూనెలో చేసిన వేపుళ్ళ వంటి వంటలు, మైదా వంటకాలు, ఉప్పు అధికంగా ఉండే చిరుతిళ్ళు ఈ జాబితాలో ఉంటాయి . ఈ ఆహారం అతిగా తీసుకునే వారిలో బద్ధకం, అలసత్వం, అసహనం వాటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇతర నియమాలు

  • ఆయుర్వేదం ప్రకారం ఆహారం అంటే తాజా ఆహారమే. నిల్వ ఉంచిన ఆహారం ఎంతమాత్రం తినరాదు.
  • అతిగా ఉడికించిన ఆహారం, నల్లగా మాడిన ఆహరం, ఎక్కువకాలం ఊరబెట్టిన ఆహారం తినరాదు.
  • సబ్జా , పుచ్చ, బాదం, నువ్వుల వంటి గింజలను నేరుగా గానీ లేక వంటకాలతో గానీ రోజూ తీసుకోవాలి .
  • రోజువారీ ఆహారంలో పాలు, మజ్జిగ, పెరుగు, ఇంట్లో చేసిన పనీర్ ఉండేలా చూసుకోవాలి.
  • చక్కెరకు బదులుగా బెల్లం, తేనె వంటివి, మైదా పిండికి బదులుగా గోధుమ, జొన్న, సజ్జ పిండిని వాడాలి.
  • కందిపప్పు, పెసర పప్పు, మినప్పప్పు, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, కాయధాన్యాల వంటివి ఆహారంలో తప్పక ఉండాలి.
  • ఏ సీజన్లో దొరికే పండ్లను ఆయా కాలాల్లో తప్పక తినాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE