• HOME
  • అందం
  • యువతుల అందాన్నిరెట్టింపు చేసే గాగ్రా

నేటి ఫ్యాషన్ యుగంలో లెక్కకు మించిన ఆధునిక వస్త్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో మారుతున్న యువత అభిరుచులకు తగ్గట్టుగా అటు విదేశీ, ఇటు సంప్రదాయ దుస్తులూ ఉంటున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో విదేశీ వస్త్రాల కంటే  భారతీయ సంప్రదాయ వస్త్రాలకు ఆదరణ బాగా పెరుగుతోంది. భారతీయ సంప్రదాయ శైలి వస్త్రాలకు ఆధునికమైన హంగులు చేర్చి సరికొత్తగా రూపొందిన మహిళల  వస్త్రాల్లో గాగ్రా ముందువరసలో ఉంది. రొటీన్ లుక్ స్థానంలో ప్రత్యేకమైన ఆహార్యం కోరుకొనే యువతుల సంఖ్య ఇప్పటి రోజుల్లో బాగా పెరుగుతోంది. తమ శరీరాకృతి, రంగు , ఆయా సందర్భాలకు అనుగుణంగా ఈ తరహా దుస్తులు డిజైన్ చేయించుకొనే వారి సంఖ్య కూడా ఇప్పుడు తక్కువేమీ కాదు. సమ్మర్‌లో కాటన్‌తోనూ, చలికాలంలో కాస్త మందంగా ఉండే వస్త్రంతో చేసిన గాగ్రాలూ ఇప్పుడు అన్ని తరగతుల వారికీ తగిన ధరల్లో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే ఏడాది పొడవునా అన్ని రకాల వాతావరణాలలోనూ ధరించదగిన ఉత్తమ వస్త్ర విశేషంగా గాగ్రా నిలిచింది. 

గతంలో ఉత్తరాది దసరా నవరాత్రుల  గర్భా నృత్యం, వివాహ వేడుకలలో మాత్రమే గాగ్రా ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు దేశమంతా అన్నిప్రాంతాల యువతులూ వీటిని ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందంగా, హుందాగా ఉండటంతో బాటు సౌకర్యంగానూ ఉండటం గాగ్రా ప్రత్యేకత. గాగ్రా ధరించిన యువతులు ఎంతమంది మధ్యలో ఉన్నాఎంతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకే విదేశీ డిజైనర్లతో బాటు మనదేశాన్ని సందర్శించే  విదేశీయులూ గాగ్రా పట్ల మక్కువ పెంచుకొంటున్నారు. తెలుగువారి సంప్రదాయ లంగా- ఓణీ కి దగ్గరగా ఉండే గాగ్రా వినియోగం గుజరాత్, రాజస్థాన్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ పెద్ద వయసు మహిళలూ గాగ్రాలో కనిపిస్తారు. పేరుకు గాగ్రా ఒక్కటే అయినా డిజైన్లు, వాటిమీద చేసే వర్క్‌, వస్త్రాల ఎంపికను బట్టి లెక్కకు మించిన వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

గాగ్రా డిజైన్, వస్త్రం నాణ్యత తదితర అంశాలను బట్టి వెయ్యి నుంచి లక్ష రూపాయల ధర వరకూ గాగ్రాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు వెండి, రాగి, బంగారం వంటి తీగలతో తమకు నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేసుకొంటున్నారు.  కుందన్‌, చేనేత, సర్వోస్కీ వర్క్‌, బీడ్స్‌ వంటి గాగ్రాలకు యువతలో ఆదరణ ఎక్కువగా ఉంది. ఇతర సందర్భాలతో పోల్చినప్పుడు పెళ్ళిళ్ళ సీజన్‌లో వీటికి డిమాండ్‌ ఎక్కువ. పార్టీలు, ఫంక్షన్ల వేళ గాగ్రాలు వాడొచ్చు. అయితే హెవీ వర్కు వున్న గాగ్రాలు ఇతర సందర్భాల్లో వేసుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది గనుక తక్కువ వర్క్‌ వుండి సింపుల్‌గా వుండే గాగ్రాలను ఎంపిక చేసుకోవాలి. వీటిని క్యాజువల్‌ వేర్‌గా కూడా వేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE