బోలెడన్ని పోషకాలు అందించే ఫలంగా పేరున్న బొప్పాయి మంచి సౌందర్య కారకంగానూ పనిచేస్తుంది. మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన శిరోజాలు కోరుకునే వారికి బొప్పాయి వరమనే చెప్పాలి. సౌందర్య పోషణలో మరీ ముఖ్యంగా చర్మ సౌందర్య పరిరక్షణకు బొప్పాయి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
- తరచూ బొప్పాయి గుజ్జు ముఖం, మెడకు రాసుకొంటే అందులోని విటమిన్ ఏ వల్ల చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి చర్మం మెరుపులీనుతుంది.
- వెన్న, బొప్పాయి గుజ్జు కలిపి కళ్ల చుట్టూ రాసుకొని ఆరనిచ్చి కడిగితే కంటికింది నల్లని మచ్చలు, వలయాలు పోతాయి.
- బొప్పాయి గుజ్జు తేనె కలిపిన మాస్క్ వాడేవారు ముఖం సహజమైన మెరుపును సంతరించుకొంటుంది.
- గాయాలు, మొటిమలు, పొక్కుల మూలంగా ఏర్పడిన మచ్చలున్న వారు పచ్చి బొప్పాయి గుజ్జును రాస్తే ఆ మచ్చలు మాయమవుతాయి.
- అరికాళ్ళ, మడమల పగుళ్లకు బొప్పాయి గుజ్జు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- వారంలో కనీసం 3 రోజులు బొప్పాయి తినే వారికి జుట్టు రాలే సమస్య ఉండదు.
- గుప్పెడు చొప్పున బొప్పాయి గుజ్జు, అరటి పండు గుజ్జు, పెరుగు కలిపి దానికి చెంచా కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి టవల్ చుట్టి గంట ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది.