• HOME
  • అందం
  • గతి తప్పిన హార్మోన్లతో కళ తప్పే చర్మం

ఆనాటి మనుషులు 70 ఏళ్ళు వచ్చినా ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఆ వయసులోనూ స్వయంగా తమ రోజువారీ పనులు చేసుకొనేవారు. చిన్న చితకా అనారోగ్యాలకు చిట్కా వైద్యం, మరీ అవసరమైతే నాటు వైద్యమే తప్ప ఆసుపత్రి మొహం చూడాల్సిన అవసరం లేకుండానే వారి జీవితాలు గడిచేవి. ఆ రోజుల్లో నూరేళ్లు బతకటం కూడా గొప్ప విషయం కాదు. అయితే.. కాలక్రమంలో యంత్రాల రాకతో శారీరక శ్రమ తగ్గటం, వాతావరణ కాలుష్యం పెరిగి ఆహారం, నీరూ కలుషితం కావటం, వేళాపాళా లేని పనిగంటలు, సామాజిక సంబంధాల్లో వస్తున్న మార్పులతో పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. మనిషి జీవితాన్ని ఉహించలేనంతగా మార్చేశాయి. గతంలో 60 ఏళ్ళు దాటాక మాత్రమే కనిపించే సమస్యలు ఇప్పుడు 20 ,30 ఏళ్లకే వస్తున్నాయి. యువతీయువకులు 30 ఏళ్లకే వృద్ధాప్య ఛాయల బారిన పడుతున్నారు. ఈ మార్పులకు ప్రధాన కారణం.. హార్మోన్ల అసమతౌల్యమే.     

మన శరీరంలో ఎండోక్రైన్ (వినాళ) గ్రంథులు వయసు ప్రభావాన్ని నిర్ణయిస్తుంటాయి. యవ్వనంలో మెరిసే చర్మం వయసు పెరిగే కొద్దీ కళ తప్పటం వెనక ఈ గ్రంథుల పనితీరులో వచ్చే మార్పులే ముఖ్యకారణం.  ఎండలోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం, కాలుష్యం, జీవనశైలి వంటి మార్పుల వల్ల చర్మం కళతప్పటం, ముడతలు పడటం, జీవక్రియల్లో వచ్చే మార్పులూ ఇందుకు తోడు కావటంతో చిన్న వయసులోనే ముదిమి లక్షణాలు కనిపిస్తాయి. 

నిజానికి 40 ఏళ్ళు నిండేసరికి చర్మం పొడిబారటం, పాలిపోవటం, ముడతలు పడటం సహజమే. జీవక్రియలు నెమ్మదించటం వల్ల హార్మోన్ల ఉత్పత్తిలో కలిగే మార్పుల వల్ల వచ్చే ఈ సహజ మార్పులను పూర్తిగా నిరోధించటం కష్టమే. మహిళల్లో నడివయసు నాటికి ఈస్ట్రోజన్ ఉత్పత్తి మందగించంతో, ఆ ప్రభావం చర్మానికి సాగే గుణాన్నిచ్చే కొల్లాజన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీంతో చర్మపు తేమ తగ్గటం, బిగువు కోల్పోవటం, ముడతలు పడటం జరుగుతుంది. ఇలాంటప్పుడు కొల్లాజన్ ఉత్పత్తికి దోహదం చేసే పదార్థాలను వాడాలి. 

వయసు పైబడినా చర్మపు కాంతిని నిలుపుకోవాలనుకొనే మహిళలు రెటినాయిడ్స్ (ఓ రకమైన విటమిన్)ను ఎక్కువగా తీసుకోవాలి. అదే సమయంలో.. రెటినాల్, పెప్టైడ్స్ ఎక్కువగా ఉండే క్రీమ్స్, సౌందర్యపోషకాలను వాడాలి. విటమిన్ సి వినియోగం సైతం కొల్లాజన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది గనుక పుల్లని పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో తగినంత ఐరన్ ఉండేలా చూసుకోవటంతో బాటు ఆహారంలో రంగురంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, నిమ్మ, బచ్చలి మొదలు పలు ఆకుకూరలు, టమోటా, నేరేడు తదితరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను హానికారకాల బారి నుంచి కాపాడుతాయి. ద్రాక్షలోని 'రెస్వెరెట్రాల్' అనే యాంటీ ఆక్సిడెంట్ చిన్న వయసులో కనిపించే వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. 

మంచి ఆహారపు అలవాట్లతో బాటు చర్మ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ పెట్టగలిగితే వయసు పైబడినా అందమైన, మెరిసే చర్మం తప్పక మీ సొంతమవుతుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE