• HOME
 • అందం
 • మచ్చల విషయంలో నిర్లక్ష్యం వద్దు

 ఇష్టంగా ధరించే డ్రెస్ మీద ఏదైనా ఒలికి మచ్చ పడితే ఎంతో బాధ పడతాం. అది పూర్తిగా పోయేలా ఉతికి శుభ్రం చేస్తాం. అదే ఒంటిమీద ఏదైనా కొత్త మచ్చ కనిపిస్తే మాత్రం అంతగా శ్రద్ధ తీసుకోము. అయితే ఒంటిమీది పుట్టు మచ్చ మొదలు ఎలాంటి కొత్త మచ్చనైనా నిర్లక్ష్యం చేయకుండా గమనించి అవసరాన్ని బట్టి వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్షల్లో అది ప్రమాద కారమని తెలిస్తే నిర్లక్ష్యాన్ని పక్కనబెట్టి తక్షణం పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

ప్రమాదకరమైనవి

 • అరచేతులు, అరికాళ్లలో నల్ల మచ్చలు
 • 3 సెం.మీ కంటే పెద్ద నల్ల మచ్చలు
 • 50కి మించి ఉండే పుట్టు మచ్చలు
 • మచ్చలు రంగు మారటం, పెరగటం
 • మచ్చలు దురద, మంటగ అనిపించటం
 • మచ్చ దగ్గర ఇన్‌ఫెక్షన్‌ కనిపించటం
 • 50 ఏళ్లు దాటిన వాళ్లలో పెరిగే మచ్చలు 

 మచ్చలు.. సూచించే రోగాలు

చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే మచ్చలను వైద్య పరిభాషలో ‘లెంటిజీన్స్‌’ అంటారు. ఇవి చిన్న పుట్టుమచ్చల సైజు నుంచి అరచేయంత కూడా ఉండొచ్చు. పుట్టినప్పుడు లేకపోయినా పుట్టిన కొద్ది రోజులకి కనిపిస్తాయి. నలుపు, కాఫీ రంగుల్లో మచ్చలున్న పిల్లల్లో మెదడు, నాడీ వ్యవస్థ, గుండె వంటి అవయవాల్లో లోపం ఉండొచ్చు.

యుక్తవయసుకు వచ్చేవారిలో ఎండాకారణంగా ఏర్పడే సన్ టాన్ లేదా ‘ఫ్రికిల్స్‌’ ఎక్కువగా కనిపిస్తాయి. కొందరిలో చర్మం పలుచబడి అడుగునుంచే రక్త నాళాలు పైకి తేలడంతో చెంపలు ఎర్రగా మారి ‘రోసాషే’ అనే మచ్చలూ కనిపిస్తాయి. పైపూత మందులు, లేజర్‌ చికిత్సతో రోసాషే మచ్చల్ని వదిలించొచ్చు.

యువతీయువకులు ముఖం మీది మొటిమల్ని గిల్లుకోవటం వల్ల అక్కడ నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని లేజర్‌ ట్రీట్మెంట్‌, కెమికల్‌ పీల్స్‌ సహాయంతో పోగొట్టవచ్చు.

నడి వయసు వారిలో.. ముఖ్యంగా స్టిరాయిడ్స్‌ వాడే వారిలో రోసాషే మచ్చలు కనిపిస్తాయి. కొందరిలో హార్మోన్ల పనితీరు మార్పు వల్ల ‘పిగ్మెంటేషన్‌’ (గోధుమ రంగు మచ్చలు) ముఖం మీద వస్తాయి. గర్భిణుల్లోనూ ఈ తరహా మచ్చలు(మెలాస్మా) కనిపించినా సాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతాయి. కొందరిలో తగ్గకపోవచ్చు. అలాగే మధుమేహం, థైరాయిడ్‌ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులున్నవారు, ఓరల్‌ పిల్స్‌ వాడేవారిలోనూ ఈ మచ్చలు కనిపించవచ్చు. అలాంటప్పుడు హార్మోన్‌ టెస్ట్‌ చేసి అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి. రోజంతా ఎండలో పనిచేసే నడివయసు మహిళల్లో కాళ్లు, చేతుల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. రక్తనాళాల్లో లోపం వల్ల కూడా కాళ్ల మీద పిగ్మెంటేషన్‌ మచ్చలు ఏర్పడతాయి. కొన్ని ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా పిగ్మెంటేషన్‌ కనిపించొచ్చు. ఈ మచ్చలకు కారణాన్ని కనుగొని తగిన చికిత్స తీసుకోవాలి.

వృద్ధుల్లో చర్మంలోని కొల్లాజెన్‌ కరిగి, చర్మం సాగే గుణాన్ని కోల్పోయి చర్మం పలుచబడి మచ్చలు ఏర్పడతాయి. వీటిలో మెజారిటీ ప్రమాద రహితమైనవే గానీ ఆ మచ్చలు బుడిపెల్లా మారి దురద, మంట కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. 50 ఏళ్ళు దాటిన వారిలో ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

నిర్ధారణ, చికిత్స

ఏదైనా మచ్చ ప్రమాదకరంగా అనిపించినప్పుడు వైద్యులు దాన్ని ‘డెర్మోస్కోపీ’ పరికరం సాయంతో పరీక్షిస్తారు. మచ్చ ఏ మేరకు విస్తరించింది? మచ్చ రంగు మారుతున్నా, దానివద్ద రక్తనాళాలు ఎక్కువగా ఉన్నా, దాని చివరలు అసహజంగా ఉన్నా బయాప్సీ చేయాల్సి రావచ్చు . దీనివల్ల మెలనోమాగా తేలితే అది ఎంత లోతుగా వెళ్లిందనే దాన్ని బట్టి అక్కడి చర్మాన్ని తొలగిస్తారు. అవసరమైతే అక్కడి లింఫ్‌నోడ్స్‌ కూడా తొలగించాల్సి వస్తుంది. మెలాస్మా, సన్‌ అలర్జీ, మొటిమల వల్ల వచ్చిన మచ్చలను కెమికల్‌ పీల్స్‌తో, చర్మంలోతుకు విస్తరించిన మచ్చలకు ‘క్యూ స్విచ్‌డ్‌ ఎండియాగ్‌ లేజర్స్‌’తో చికిత్స చేసి తొలగించొచ్చు. ఇలాంటి చికిత్స సంవత్సరం నుంచి రెండేళ్లపాటు కూడా కొనసాగుతుంది. 

జాగ్రత్తలు

 • చర్మం మీద మచ్చ ఏర్పడితే దాన్ని పొరబాటున కూడా గిల్లరాదు. గిల్లితే కేన్సర్‌ గా మారే ప్రమాదం ఉంది.
 • కొత్తగా వాడుతున్నబాడీ స్ప్రే, జుట్టుకు వేసే రంగు వంటివి వాడే ముందు తప్పనిసరిగా చెవి వెనక కొంత రాసి దురద, మంట లేకపోతేనే వాడాలిటప్ప నేరుగా కాదు.
 • కొందరు వాడుతున్న పాత బ్యూటీ ప్రొడక్ట్‌ని పక్కనబెట్టి కొత్తవి ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల అలర్జీలు రావచ్చు. అందుకే పాత కాస్మటిక్స్‌ వల్ల ఇబ్బంది లేకపోతే వాటినే వాడటం మంచిది.ఒకవేళ కొత్తది వాడాలనుకుంటే ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి.
 • ప్లాస్టిక్‌, ఆర్టిఫిసియల్‌ జ్యువెలరీ, లెదర్‌ వస్తువుల వల్ల అలర్జీ కనిపిస్తే వాటి వాడకాన్ని వెంటనే మానేయాలి.

మచ్చల నివారణకు

 • చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవాలి.దానికై వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.
 • ఎండలో వెళ్ళేటప్పుడు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడాలి.
 • థైరాయిడ్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులున్నవాళ్లు, పొడి చర్మం కలిగినవాళ్లు మాయిశ్చరైజర్‌ వాడాలి.
 • చర్మ తత్వానికి సరిపడే కాస్మటిక్స్‌ మాత్రమే వాడాలి.
 • తాజా ఆకుకూరలు, పండ్లు తినాలి.
 • రోజుకి 6 - 8 గంటల నిద్ర తప్పనిసరి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE