మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న జీవన శైలి అనారోగ్య సమస్యల్లో అధిక  రక్తపోటు (hypertension) ఒకటి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అది మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరుగుదల, హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అదుపుతప్పిన బీపీ వల్ల కీలక అవయవాలైన కళ్ళు, మెదడు, మూత్రపిండాలు, రక్తనాళాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి.

రక్తపోటు అంటే ...

గుండె ఎంత ఒత్తిడితో రక్తనాళాలకు రక్తాన్ని సరఫరా చేస్తోంది? రక్తనాళాలు ఏమేరకు ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నాయనే అంశాలపై సదరు వ్యక్తి రక్తపోటును లెక్కిస్తారు. గుండె ముడుచుకుని ఉన్న స్థితిని సిస్టోలిక్ అనీ, గుండె గదులు పూర్తిగా తెరుచుకున్నప్పటి స్థితిని డయాస్టోలిక్ అంటారు. ఈ రెండింటి మధ్య తేడానే పల్స్ ప్రెజర్ అంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి 120 సిస్టోలిక్ , 80 డయాస్టోలిక్ ఉంటుంది. దీనినే 120/80 అని రాస్తుంటారు. ఇది హైబీపీ(హైపర్ టెన్షన్)గా  మారినప్పుడు 140 / 90 గానూ, లోబీపీ(హైపో టెన్షన్)గా మారితే 90 / 60 స్థాయికి పడిపోతుంది.

లక్షణాలు

హైబీపీ బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగటం, ఉన్నట్టుండి తూలిపడటం, మెడనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. హైబీపీ ఉన్నప్పటికీ చాలామంది ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపిస్తారు. ఎంతోకాలంగా ఈ సమస్య ఉన్నా ప్రతి వందమంది బాధితుల్లో డెబ్భై మందికి అసలు ఈ సమస్య ఉన్నట్లే తెలియదు. సమస్య తీవ్రమై వైద్యుడి దగ్గరకు వెళ్ళే సమయానికే కీలక అవయవాలకు హైబీపీ  చేయాల్సిన నష్టం చేసేస్తోంది. వయసు పెరిగేకొద్దీ బీపీ పెరిగే మాట నిజమే. అయితే గతంలో 40,50 ఏళ్ళకు కనిపించే సమస్య ఇప్పుడు 20 ఏళ్ళ వారిలో కూడా కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా జీవన శైలిలో వచ్చిన మార్పులే ఈ సమస్యకు ప్రధాన కారణం.

మేలుచేసే జీవనశైలి మార్పులు

పోషకాహారం

హైబీపీ బాధితులు తప్పక పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, పీచు, మాంసకృత్తులు  అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు తీసుకొంటూనే ఉప్పు వినియోగం తగ్గించాలి. జంక్ ఫుడ్, నిల్వ పచ్చళ్ళు, చిప్స్ వంటి ఉప్పు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. వంటకాల్లో ఎలాగూ ఉప్పు వేస్తారు గనుక విడిగా సలాడ్స్, పెరుగులో ఉప్పు కలుపుకోవద్దు. వైద్యులిచ్చే ఆహార ప్రణాళికను క్రమం తప్పక పాటిస్తే బీపీ అదుపులోకి వస్తుంది.

శారీరక శ్రమ

వారానికి కనీసం 5 రోజుల్లో రోజుకు కనీసం అరగంట నుంచి ముప్పావు గంట పాటు ఏదైనా వ్యాయామం చేయటం ఆరోగ్యానికి ఏంతో  మేలు చేస్తుంది. అలాగని జిమ్ బాట పట్టాల్సిన పనిలేదు. నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామమైనా చాలు. ఇలాంటి కసరత్తు వల్ల గుండె పనితీరు మెరుగై, బీపీ సమస్య , బరువు  సాధారణ స్థాయికి వస్తుంది. ఊబకాయం, పొత్తికడుపు కింద పేరుకున్న కొవ్వు కూడా క్రమంగా కరిగిపోతుంది.

ధూమపానం వద్దు

 పొగతాగే అలవాటున్న వారు దాన్ని మానుకుంటే వెంటనే రక్తపోటు అదుపులోకి  వస్తుంది. బీపీ తో బాటు శ్వాస సమస్యలు కూడా ఉపశమిస్తాయి. కాస్త కష్టమైనా ఈ అలవాటును వదిలించుకుంటే హైబీపీ సమస్యను సులభంగా అదుపు చేయగలము.

మద్యానికి దూరం

మితిమీరిన మద్యపానం హైబీపీ బాధితుల అనారోగ్యాన్ని కుదేలు చేస్తుంది. అందుకే బాధితులు ఈ అలవాటు మానుకుంటే మంచిది. ఒక్కసారిగా మానుకోలేని వారు నెమ్మదిగానైనా ప్రయత్నించాలి.

మానసిక ఒత్తిడి వద్దు

రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని వీలున్నంత మేరకు తగ్గించుకోనేందుకు యోగా, ప్రాణాయామం వంటి విధానాల సాయం తీసుకోవాలి. మనం అనుకున్నవన్నీ జరగవనే సత్యాన్ని గ్రహించి వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి. వర్తమానం మీద నమ్మకం, భవిష్యత్తు మీద ఆశతో ముందుకు సాగితే మానసిక ఒత్తిడి దరిచేరే ప్రమాదం తక్కువని గుర్తించాలి. కుటుంబ సభ్యులతో గడపటం, సంగీతం, తోటపని, పెంపుడు జంతువుల పెంపకం వంటి వ్యాపకాలు కూడా ఒత్తిడిని పారద్రోలుతాయి.

హైబీపీని నివారించే పలు మార్గాలు మెరుగైన ఫలితాలిస్తాయి గనుక వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. బీపీ ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయినుంచి హైబీపీగా మారుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుల సలహా కోరాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE