అప్పటి వరకూ చలాకీగా మాట్లాడుతున్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మూతి వంకపోవటం, మాట స్పష్టతను కోల్పోవటం, కాలూ, చేయీ మెలితిరగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడో ఏర్పడిన అవరోధం తాలూకూ ఫలితమిది. దీనినే పక్షవాతం అనీ,  వైద్య పరిభాషలో పెరాలసిస్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రతి వేయిమందిలో ఒకరిద్దరు పక్షవాతం బారిన పడుతున్నారు. వీరిలో మూడవ వంతుమంది మూడు వారాలలోపు చనిపోతే సగం మంది ఏడాదిలోపే కన్నుమూస్తున్నారు. పక్షవాతం ఏ వయసువారికైనా రావచ్చు.అయితే వృద్ధుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ.మహిళల్లో కంటే పురుషులకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువ. బాధితుడిని వీలున్నంత త్వరగా ఆసుపత్రికి తరలించి తక్షణ చికిత్స ఇవ్వగలిగితే నూటికి 99 మంది బాధితులను దీని ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.

పక్షవాతం... అంటే?

మెదడులోని అతి సూక్ష్మమైన రక్తనాళాల్లో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడి అది శరీరంలోని ఒక వైపు అవయవాలను చచ్చుబడేలా చేస్తుంది. ఒక్కోసారి రక్తనాళాల ఒరిపిడి కారణంగా మెదడులో రక్తస్రావం కావడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. హృద్రోగుల్లో గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ లేదా కొవ్వు ఒక్కోసారి మెదడులోకి చేరి పక్షవాతానికి దారి తీస్తుంది. మెదడులోని కుడివైపున ఉన్నశరీర భాగాలను మెదడు ఎడమ అర్థగోళం, అలాగే శరీరంలోని ఎడమ భాగాలను  కుడి అర్ధగోళం నియంత్రిస్తుంది. మాటను నియంత్రించే ప్రక్రియ అంతా ఎడమ గోళంలోనే జరుగుతుంది.మెదడు కుడివైపు భాగాలకు రక్త ప్రసరణ జరగకపోతే ఎడమ వైపు, ఎడమ మెదడుకు రక్తపస్రరణ జరగకపోతే కుడివైపు శరీర భాగాలు చచ్చుబడతాయి.

లక్షణాలు

 • మాట తడబడటం, రాస్తున్నప్పుడు చేతి కదలికల్లో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి ఒకటి, రెండు గంటల్లో సర్దుకుంటాయి. దీన్నే (టిఐఎ)ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ అటాక్‌ అంటారు.
 • ఉన్నట్లుండి ఒక వైపు చేయి, కాలూ పడిపోవడం వంటి లక్షణాలుంటే దీన్ని హెమిప్లిజియా అంటా రు.
 • ఒక వైపు మూతి వంకర కావడం, కళ్లు తిరిగి పడిపోవడం, బ్యాలెన్సు తప్పి మద్యం సేవించిన వారిలా నడవటం వంటి లక్షణాలుంటే దీన్ని ఆరాక్సియా అంటారు.
 • ఒక వైపు చూపు పడిపోవడాన్ని హెమియనోపియా అంటారు.
 • ఏమాత్రం స్పృహలేకుండా పడిపోతే మాసివ్‌ స్ట్రోక్‌ అంటారు.

కారణాలు.. చికిత్స 

అధిక రక్తపోటు, డయాబెటిస్‌, రక్తంలో అధికంగా క్రొవ్వు పదార్థాలు పేరుకొపోవటం, పొగ తాగటం, గుండెజబ్బులు, మాదక ద్రవ్యాల సేవనం, ఎయిడ్స్, ఆనువంశికత, నోటిద్వారా గర్భరోధక మాత్రల వినియోగం వంటి కారణాలవల్ల రక్తనాళాలు కుచించుకు పోయి రక్తనాళాల్లో అడ్డంకి గా పరిణమిస్తాయి. పక్షవాతం (స్ట్రోక్‌ ) గానీ మెదడులో గాయం మూలంగా అయ్యే రక్తస్రావ్రం (హెమరేజ్‌)గానీ అయినప్పుడు బాధితుడిని 3, 4 గంటల్లో ఆసుపత్రికి తీసుకెళితే యాంజియోగ్రాఫీ ద్వారా రక్తనాళంలో ఎక్కడ అడ్డంకి ఉందో తెలుసుకొని, క్లాట్‌ రిటక్ష్రన్‌ సిస్టమ్‌ ద్వారా ఆ అడ్డంకిని తొలగిస్తారు. టిపిఎ అనే విధానం సాయంతో కూడా అడ్డంకి తొలగిపోయేలా చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే సహజ రీతిలో రక్తపస్రరణ మొదలవుతుంది. ఫలితంగా అప్పటిదాకా కనిపించిన పక్షవాత లక్షణాలన్నీ క్షణాల్లో కనుమరుగెపోతాయి. ఒకప్పటి పక్షవాత చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది ఎంతో పెద్దముందడుగు.

సమయమే కీలకం

ఈ తరహా చికిత్సల్లో రోగిని ఎంత త్వరగా వైద్యం అందించారనేదే చాలా కీలకం. నాలుగు గంటల లోగా తీసుకువస్తే మంచిదే. అలా వీలు కానప్పుడు కనీసం ఆరేడు గంటల్లోనైనా వైద్య సాయం అందేలా చూడాలి. అప్పటికీ ఆలస్యం జరిగితే రక్తపస్రరణ అందని భాగంలో మెదడు కణాలు చనిపోయి శాశ్వత నష్టం జరిగిపోతుంది.

జాగ్రత్తలు

పక్షవాతం వచ్చిన తర్వాత బాధ పడటం కంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవటం ప్రధానం. ఈ క్రింది అంశాల మీద దృష్టి సారించగలిగితే చాలా వరకు సమస్య బారిన పడకుండా చూసుకోవచ్చు. అవి..

 • మధుమేహులు రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉండేలా చూసుకోవాలి.
 • రక్తపోటును కూడా నెలకొకసారి పరీక్షించుకుంటూ నియంత్రణలో పెట్టుకోవాలి.
 • ధూమపానం చేసే వారు తక్షణం ఈ అలవాటు మానుకోవాలి.
 • ఆల్కహాల్‌ ఒకటి, రెండు పెగ్గులు తీసుకోవచ్చు. ఎక్కువైతే ప్రమాదం.
 • స్ట్రోక్‌ వచ్చిన తరువాత తగు పరీక్షలు చేయించుకుని వైద్యులు సూచించిన మందులు విధిగా వాడుకోవాలి.
 • పక్షవాతం తీవ్రతను బట్టి పిజియో థెరపీ చేయించుకోవాలి.
 • జీవనశైలిలో కూడా మార్పులు చేయాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. ఆకు కూరలు, కూరగాయలు ఎక్కు వగా తీసుకోవాలి.
 • ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది గనుక రాత్రి భోజనంలో నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తినరాదు.
 • పక్షవాతానికి జీడిపప్పు చక్కని విరుగుడు.ఇందులోని మెగ్నీషియం కండరాలు, నాడుల పనితీరును మెరుగు పరచి పక్షవాతం ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.
 • పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, చిక్కుడు జాతి కూరగాయలు, బాదంలోనూ మెగ్నీషియం లభిస్తుంది.
 • ప్రతి రోజూ తగిన వ్యాయామం చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE