గతంలో కీళ్ళ నొప్పుల సమస్య కేవలం వయసు మళ్లినవారి ఇబ్బంది మాత్రమే. అయితే ఇప్పుడది పదేళ్ళ పిల్లలనుంచి పెద్దవారి వరకూ అందరినీ వేధించే సమస్యగా మారింది. కీళ్ళ నొప్పులకు గల కారణాలు, పరిష్కారాలు ,నివారణ తదితర అంశాల విషయంలో ఉన్న అనుమానాలు, వాటికి నిపుణులు ఇస్తున్న సమాధానాలను తెలుసుకుందాం.
ఆస్టియో ఆర్థరైటిస్ అంటే?
వయస్సు పై బడే కొద్దీ కీళ్ళు క్రమంగా అరిగిపోవటం, గుల్లబారటాన్నే వైద్యపరిభాషలో ఆస్టియో అర్థరైటిస్ అంటారు. అయితే అరిగిపోవడం, కీళ్ళ అంతర్గత మార్పుల వల్ల యువకుల్లోనూ అరుదుగానైనా ఈ సమస్య రావచ్చు. మందుల వాడకం, ఫిజియోథెరపీతో కీళ్ళకు మరింత నష్టం వాటిల్లకుండా చూసుకోవటంతో బాటు బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆర్థరైటిస్ ఉంటే ఆహారపుటలవాట్లు మార్చుకోవాలా?
ఈ సమస్య ఉన్న అందరికీ ఒకే నియమం అని చెప్పలేము. గౌట్ (పాదాల కీళ్ళను ప్రభావితం చేసేది) బాధితులు మాత్రం మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
వయస్సును బట్టి కీళ్ళ నొప్పుల్లో తేడా ఉంటుందా?
ఉంటుంది. కీళ్ళు అరిగిపోవటం వల్ల వృద్ధులు కీళ్ళనొప్పులకు గురవుతుంటారు. అదే.. యువతలో కనిపించే నొప్పులకు కాల్షియం లేమి, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా కారణాలుగా ఉన్నాయి.
బరువు పెరిగితే కీళ్ళనొప్పులు తప్పవా?
అవును. మితిమీరిన బరువు కేవలం మోకాళ్ళ నొప్పులకే గాక పలు ఇతర అనారోగ్యాలకూ దారి తీస్తుంది. దీనికి తోడు ఎముకలు గుల్ల బారటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తోడైతే సమస్య మరింత ఎక్కువవుతుంది.
చికిత్స ఆలస్యం అయితే ప్రమాదమా?
కీళ్ళనొప్పులను నిర్లక్ష్యం చేస్తే అవి కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. అప్పుడు మోకాలి చిప్ప మార్పిడి తప్ప మరో దారి మిగలదు. ఇది ఒక రోజులోనో, నెలలోనో వచ్చే సమస్య కాదు. ఎంత త్వరగా సమస్యను గుర్తించగలిగితే, అంతగా చికిత్స, నయం అయ్యే అవకాశాలూ ఉంటాయి. రెగ్యులర్ ఫాలోఅప్, ట్రీట్మెంట్ రెండూ ఎంతో ముఖ్యమైనవి. సమస్య రకం, తీవ్రత, వయసు తదితర అంశాల మీద ఆధారపడి పరిష్కారం ఉంటుంది.
రుమటాలజిస్ట్ (కీళ్ళవ్యాధుల నిపుణులు)ను ఎప్పుడు సంప్రదించాలి?
కీళ్ళ నొప్పులు కనిపించిన తొలి రోజునే రుమటాలజిస్ట్ను సంప్రదించటం మంచిది. అప్పుడే ఏ తరహా నొప్పి అనేది నిర్ధారించి తగు చికిత్స ఇచ్చేందుకు ప్రయత్నం చేయొచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ సమస్య తీవ్రం కావచ్చు.
ఆర్థరైటిస్ కాకుండా మిగతా ఏయే వ్యాధులకు రుమటాలజిస్ట్ చికిత్సనందిస్తారు?
కండరాల నొప్పులు, శారీరక బలహీనత, మడమల నొప్పులు, రక్తనరాలను ప్రభావితం చేసే వ్యాధులు (వాస్క్యులైట్స్), సొరియాటిక్ ఆర్థరై టిస్, స్కెలెరోడెమ్రా (చేతులు, ముఖంపై చర్మం బిగుతు కావడం), నోరు, కళ్ళు తరచూ ఎండిపోవడం, ఆటోఇమ్యూన్ తదితర అంశాల్లో రుమటాలజిస్ట్ తగు చికిత్సను అందించగలుగుతారు.