మీకెంతో ఇష్టమైన ఐస్ క్రీం తినాలని ఉన్నా పంటి నొప్పి వల్ల తినలేక పోతున్నారా? వేడి వేడిగా కప్పుడు కాఫీ తాగుతున్నా అదే ఇబ్బందా? చివరికి కుండలో నీళ్ళు తాగినా పళ్ళు జిల్లుమంటున్నాయా? అయితే మీ దంతాలు బలహీన పడ్డాయని గుర్తించి దానికి తగిన చికిత్స చేయాల్సిన సమయం వచ్చేసినట్టే. వైద్యపరిభాషలో ఈ సమస్యను డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. ఈ సమస్య బారిన పడితే వేడి, చల్లని పదార్థాలేగాక పుల్లని, తీయని పదార్థాలు తిన్నా భరించలేనంత నొప్పి కలుగుతుంది. సమస్య తీవ్రమయ్యే కొద్దీ ఈ నొప్పి తెరలు తెరలుగా పంటి చిగురు, మూల భాగానికి పాకి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది.
కారణాలు
- బ్రష్ తో అడ్డదిడ్డంగా, గంటల తరబడి పళ్ళు తోమటం
- దంతక్షయం వల్ల చిగుళ్ళు దెబ్బతినటం
- చిగుళ్ళు వాటి సహజ స్థానం నుంచి పక్కకు జరగటం వల్ల వేడి, చల్లని పదార్థాలు నేరుగా పంటి కుదిటికి తగలటం
- చిట్లిన, గాయాలపాలైన దంతాలలో బ్యాక్టీరియా చేరి వాపునకు గురికావటం
- పళ్ళ మీది మచ్చలు, మరకలు తొలగించేందుకు చేసే గ్రైన్డింగ్ వల్ల పంతిపైన ఉండే పల్చని ఎనామిల్ దెబ్బతినటం
- అతిగా పుల్లని పండ్లు, పచ్చళ్ళు, టీ, కాఫీ తీసుకోవటం వల్ల వాటిలోని బలమైన ఆమ్లాలు పంటి పైపొరను దెబ్బతీసిన సందర్భాల్లో
- మాటిమాటికీ పళ్ళు క్లీన్ చేయించటం, రూట్, క్రౌన్ మార్పిడి లాంటివి చేయించటం
నివారణ.. పరిష్కారాలు
- రోజూ శుభ్రంగా పళ్ళు తోముకోవటం, క్రమపద్ధతిలో బ్రష్ చేసుకోవటం
- సున్నితమైన కుంచెలున్నటూత్ బ్రష్ వినియోగం, ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చటం
- ఎప్పుడూ ఒకేరకమైన, నాణ్యమైన టూత్ పేస్ట్ వినియోగం
- పుల్లని పదార్థాల వినియోగాన్ని తగ్గించటం
- ఫ్లోరిన్ ఆధారిత మౌత్ ఫ్రెష్ణర్ తో రోజూ నోరు పుక్కిలించటం
వైద్యపరమైన పరిష్కారం
- సున్నితంగా మారిన దంతాలను తిరిగి పూర్వస్థితికి తేవటం సాధ్యమే. అయితే ముందు సమస్యను పంటి ఉపరితలం నుంచి కుడితి వరకు పాకనీయకుండా చూడాలి.
- ఫ్లోరైడ్ జెల్ వినియోగం వల్ల చిగుళ్ళు గట్టిపడి పళ్ళ తీపులు తగ్గుతాయి.
- దంతక్షయం ఏర్పడితే పంటిపై మరో పొర ఏర్పాటు చేసి పంటిపై ఒత్తిడి తగ్గించొచ్చు.
- పంటి మూలంలోని మెత్తటి కణజాలం దెబ్బతిని చిగుళ్ళు పూర్తిగా బలహీనపడితే సర్జరీ ద్వారా కొత్త చిగుళ్ళు అమర్చుతారు.
- పై విధానాలు అక్కరకు రాకపోతే చివరి ప్రయత్నంగా రూట్ కెనాల్ చికిత్స చేస్తారు.