రక్త దానం ప్రాణ దానం లాంటిది. అత్యవసర పరిస్థితిలో బాధితుడి ప్రాణాన్ని నిలబెట్టే కీలక అంశమిది. అయితే తగినంత అవగాహన, ప్రచారం లేకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రక్తదానానికి ముందుకురావటం లేదు. అందుకే దీనిపై ఉన్న పలు అపోహలు తొలగించాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14న అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం పేరిట అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా రక్తదానం మీద ఉన్న కొన్ని అపోహలు, వాటి వెనకున్న వాస్తవాలను తెలుసుకుందాం.

 అపోహ: శాకాహారుల రక్తంలో తగినంత ఐరన్ ఉండదు గనుక రక్తదానం చేయటం ప్రమాదం.

వాస్తవం: మాంసాహారులతో పోల్చినప్పుడు శాఖాహారుల రక్తంలోనే ఎక్కువ ఐరన్ ఉంటుంది. మనకు కావలసిన ఐరన్ ను ఆహారం నుంచే శరీరం గ్రహిస్తుంది. సంతులిత ఆహారం తీసుకునే వారిలో ఒక్క నెలలోనే తిరిగి తగినంత రక్తం తయారవుతుంది. కనుక శాఖాహారులు నిర్భయంగా రక్తదానం చేయొచ్చు.

 అపోహ: రక్తదానం చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

వాస్తవం: ఇది ముమ్మాటికీ అపోహే. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కలిగే నొప్పి కంటే ఇది ఏమాత్రం ఎక్కువ కాదు. రక్తదానం చేస్తే నొప్పి లేకపోగా ఒక మనిషి ప్రాణం నిలబెట్టామనే సంతృప్తి కలుగుతుంది.

 అపోహ: రక్తదానం చేస్తే పలు ప్రమాదకర వైరస్ లు సంక్రమిస్తాయి.

వాస్తవం: రక్తం సేకరించేందుకు కొత్త సూది వాడటం, కొన్ని పరీక్షలు చేసిన తర్వాతే సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించటం వంటి తగిన జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ సమస్య రానే రాదు.

 

అపోహ: రక్తదానం చేయటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది.

వాస్తవం: రక్తదానానికి కేవలం 40 నిమిషాల నుంచి గంట సమయం చాలు.

 

అపోహ: శరీరావసరాలకు తగినంత రక్తం మాత్రమే ఉంటుంది గనుక రక్తదానం చేస్తే ప్రాణాపాయం.

వాస్తవం: రక్తదానం వేళ కేవలం 350 నుంచి 400 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే సేకరిస్తారు. దీనిని శరీరం నెల లోపే భర్తీ చేసుకుంటుంది గనుక ప్రమాదం లేనేలేదు.

 

అపోహ: రక్తదానం విషయంలో వయసును పరిగణన లోకి తీసుకోవాలి.

వాస్తవం: కౌమార దశ నుంచి 60 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా రక్తదానం చెయ్యొచ్చు.

 

అపోహ:బరువు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ రక్తం ఇవ్వొచ్చు.

వాస్తవం: బరువుకూ రక్తం పరిమాణానికీ ఎలాంటి సంబంధం లేదు.

 

అపోహ: రక్తదానం చేస్తే భవిష్యత్తులో ఏదో ఒక అనారోగ్యం తప్పదు.

వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. రక్తదానం చేసిన రోజు రవ్వంత నీరసంగా అనిపిస్తుంది తప్ప ఎలాంటి అనారోగ్యానికీ అవకాశం లేదు. అందుకే రక్తదానం అనంతరం పండ్లరసం వంటివి తీసుకోవటం, ఆరోజు తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు.

 

అపోహ: రక్తదానం చేసిన వారు క్రీడల జోలికి పోరాదు.

వాస్తవం: రక్తదానం వల్ల బలం కోల్పోవటం జరగదు. అయితే ఆరోజుకి కాస్త నీరసంగా ఉంటుంది గనుక ఎక్కువగా బరువులెత్తటం, వేగంగా పరుగులు పట్టటం చేయకూడదు. ఆ తర్వాత అన్ని ఆటలూ ఎంచక్కా ఆడుకోవచ్చు.

 

అపోహ: అనారోగ్యానికి మందులు వాడేవారు రక్తదానం చేయకూడదు.

వాస్తవం: అది వాడుతున్న మందులను బట్టి ఆధారపడి ఉంటుంది. చిన్న అనారోగ్యాలకు వాడే మందుల వల్ల ఎలాంటి ముప్పూ లేదు. మరీ అనుమానం ఉంటే వైద్యుల సలహా తీసుకుంటే సరి.

 

అపోహ: రక్తాన్ని కృత్రిమంగా చేసుకోవచ్చు గనుక మనం రక్తదానం చేయాల్సిన పనిలేదు.

వాస్తవం: రక్తాన్ని తయారు చేసే పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేదు. దీన్ని తయారు చేయగలిగిన ఏకైక సాధనం మనిషి శరీరం మాత్రమే.

 

అపోహ: బంధువులకు మాత్రమే మన రక్తం ఉపయోగపడుతుంది.

వాస్తవం: బ్లడ్ గ్రూప్, స్వభావం ఒక్కటైతే ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తికైనా ఆ రక్తం పనికొస్తుంది. ఇంకా.. కులం, మతం, జాతి, ప్రాంతం, రంగు, లింగబేధం , వయసు వంటి అంతరాలతో కూడా రక్తదానానికి సంబంధం లేదు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE