వర్షాకాలంలో గాలిలో  తేమ ఎక్కువకావటం, ఉష్ణోగ్రతలు పడిపోవటం, వారాల తరబడి ఎండపొడ తగలకపోవటం వల్ల త్వరగా   వైరస్‌లు వృద్ధి చెందుతాయి.  ఇవి  చల్లని వాతావరణంలో సులువుగా, వేగంగా వ్యాపించి, వృద్ది చెంది ఊపిరితిత్తుల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తొలిదశలో గుర్తించి చికిత్స తీసుకుంటే పర్వాలేదు గానీ నిర్లక్ష్యం చేస్తే ఇవి ఆస్తమా, అలర్జీ, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తాయి. చాలా మంది ప్రమాదకరమైన శ్వాస సమస్యను కూడా  సాధారణ జలుబుగా పొరబడి నేరుగా మందులు కొని వాడుతుంటారు. అయితే మందుల పై పై ప్రభావమే తప్ప ఈ శ్వాసకోశ సమస్యలు లోలోపల ముదురుతూ పోతాయి. అందుకే ముందుజాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడితే తొలిదశలోనే సమస్య సులువుగా దారికొస్తుంది.

సమస్యలు .. చికిత్స

ఆస్తమా

ఈ సీజన్ లో వేధించే ప్రధాన సమస్య ఆస్తమా.  ఎండాకాలంలో నిద్రాణంగా ఉండే ఆస్తమా వాతావరణం చల్లబడగానే తీవ్రమవుతుంది. ఆయాసం, దగ్గు, పిల్లికూతలు దీని ప్రధాన లక్షణాలు. కొందరిలో నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసంగా ఉండటం, రాత్రి నిద్రలో ఛాతీ బిగదీసుకుపోవటం, నిరంతరం ముక్కు కారటం  వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆస్తమా బాధితుల  ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు బహు సున్నితంగా ఉంటాయి. బయటి నుంచి వైరస్‌ ఊపిరితిత్తులలోకి ప్రవేశించగానే వేగంగా ప్రతిస్పందిస్తాయి. అందుకే ఆస్తమా బాధితులు తాలింపు, ఘాటైన సెంట్‌, రంగులు, పూల వాసన పీల్చితే వెంటనే ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు మూసుకుపోయి శ్వాస సమస్య తలెత్తుతుంది. శీతల పానీయాలు, ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం, పుల్లని పదార్థాలు తీసుకునే వారిలో ఆస్తమా పెరిగే అవకాశముంది.  వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే జలుబు  వారం రోజులలో తగ్గిపోతుంది. అంతకు మించి పై లక్షణాలు కొనసాగితే మాత్రం ఆస్తమాగా అనుమానించాల్సిందే.

ఎలర్జీ

ఈ సీజన్ లో ఎలర్జీల తాకిడి ఎక్కువ. ఉదయపు వేళ చల్లగాలి పీల్చినా, బయట తిరిగినా అప్పటికప్పుడు ముక్కు కారడం, తుమ్ములు, పొడి దగ్గు, ముక్కు బిగదీసుకుపోవటం, తలనొప్పి, గొంతులో అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే ఎలర్జీ గా అనుమానించి  వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి.

న్యుమోనియా

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ బాధితులు నిద్రలేమి,  విరామం లేకుండా పనిచేయటం, వేళ పట్టున తినకపోవటం మూలంగా ఊపిరితిత్తులలోని ఇన్‌ఫెక్షన్‌  బలపడి న్యుమోనియాగా మారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు, చిన్నారులు, వృద్దుల్లో ఇది వేగంగా తన ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తుల్లో చీము చేరటం, అధిక జ్వరం. చలి, దగ్గు, వణుకు, దగ్గినప్పుడు తెమడ దీని లక్షణాలు. మరికొందరిలో న్యుమోనియా ఉన్నప్పటికీ ఈ లక్షణాలు ఉండవు గానీ తేలికపాటి తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు కనిపిస్తాయి. తీవ్రమైన  జలుబు చేసి 2 రోజులపాటు జ్వరం కూడా ఉన్నప్పుడు న్యుమోనియా అని అనుమానించి వైద్య సలహా కోరటం అవసరం.

గొంతునొప్పి

నూటికి 90 శాతం కేసుల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, 10 శాతం కేసుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల మూలంగా గొంతు నొప్పి వస్తుంది.  వైరస్ కారక ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోకి ప్రవేశించగానే మన రోగనిరోధక శక్తి వ్యవస్థ దానిని అణచివేసేందుకు పనిచేయటం  మూలంగానే ఆ సమయంలో  గొంతునొప్పి అనిపిస్తుంది.  గొంతునొప్పి ఉన్నప్పుడు తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలి. వేడినీళ్ళు, హెర్బల్ టీ, సూపులు తీసుకోవాలి. 

 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE