• HOME
 • ఆరోగ్యం
 • గర్భిణుల ఆరోగ్య సమస్యలు..పరిష్కారాలు

మహిళ జీవితంలో మాతృత్వం ఓ తీయని అనుభవం. అయితే అవగాహనా లోపం, శారీరకంగా వచ్చే మార్పులు, మానసికంగా ఎదురయ్యే ఒత్తిళ్ళు తదితర కారణాల వల్ల ఈ దశలో గర్భిణులు.. ముఖ్యంగా తొలిసారి గర్భం ధరించిన వారు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలలో నెలతప్పినది మొదలు ప్రసవం వరకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. అందుకే గర్భిణులంతా ఈ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపట్ల సరైన అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అటు తల్లి, ఇటు బిడ్డ ఆరోగ్యంగా ఉండగలరు.

 • నెలతప్పిన తొలినాళ్ళలో వేవిళ్ళు కాస్త ఇబ్బంది పెడతాయి. తిన్న వెంటనే వాంతి కావటం, తాగిన నీళ్ళు కూడా ఇమడకపోవటం వంటిఈ లక్షణాలు క్రమంగా తగ్గుతాయి గనుక ఆందోళన పడాల్సిన పనిలేదు. అసలేమీ తినకుంటే నీరసం వచ్చే ప్రమాదం ఉంది గనుక తేలికపాటి ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి.
 • గర్భిణి శరీరంలో కలిగే హార్మోన్ల మార్పుల మూలంగా చాలాసార్లు తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. నెలలు నిండే కొద్దీ దీనివల్ల కడుపుబ్బరంగా ఉండటం, ఛాతీ అంతా పట్టేసినట్లు అనిపించటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే గర్భిణులు వీలున్నంత మేరకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. శీతలపానీయాలు, ఎలర్జీ కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.
 • గర్భిణులు మలబద్ధకం బారిన పడటం సహజమే గనుక తగినంత నీరు తాగటం, పండ్లు, పచ్చి కూరగాయలు, పోట్టుతీయని ధాన్యాలవంటి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
 • మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
 • నెలతప్పిన తర్వాత ఏ పనీ చేయకూడదనే అపోహలో కొందరు ఉంటారు. కానీ ఇది నిజం కాదు. తేలికపాటి ఇంటిపనులు, రోజూ కాస్త దూరం నడవటం వంటివి యధావిధిగా చేసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి తగినంత వ్యాయామం చేకూరి మంచి నిద్రపడుతుంది. ఇది సుఖ ప్రసవానికీ దోహదం చేస్తుంది.
 • నెలలు నిండే కొద్దీ గర్భిణులు సాధారణంగా మూత్ర విసర్జన మీద పట్టు కోల్పోతారు. అంటే.. మూత్రం వచ్చినట్లు అనిపిస్తాయి గానీ తీరా వెళ్ళిన తర్వాత మూత్ర విసర్జన అంతగా ఉండదు. మరికొందరిలో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నవ్వినప్పుడు చుక్కలు చుక్కలుగా మూత్రం విడుదల అవుతుంటుంది. ఇది చిన్న ఇబ్బందే. ఇది సమస్య అనిపిస్తే వైద్య సలహా కోరటం మంచిది. మాటిమాటికీ లేవటం కష్టంగా ఉంటుంది గనుక నిద్రించే సమయంలో పాడ్లువాడుకోవటం మంచిది.
 • నెలలు పైబడే కొద్దీ యోని స్రావాలు ఉండటం సహజమే అయినా కొందరిలో ఈ స్రావాలు తీవ్రమైన దుర్వాసనతో కూడి ఉంటాయి. ఇలాంటప్పుడు వైద్య సలహా తీసుకొని తగు చికిత్స తీసుకోవాలి.
 • సాధారణ మహిళల కంటే గర్భిణులలో శ్వాసవేగం ఎక్కువ. దీనివల్ల నచ్చని వాసనలు చూసినప్పుడు అసౌకర్యం పాలవుతారు. అందుకే వారుండే గదిలో అగరుబత్తీలు, అత్తరు వంటి ఘాటైన వాసనలు లేకుండా చూసుకోవాలి.మరికొందరు గర్భిణులకు లేని వాసన ఉన్నట్లు కూడా అనిపిస్తుంది.
 • హార్మోనులలో వచ్చే మార్పుల కారణంగా గర్భిణి ముఖం, చేతులు, పొట్ట, కాళ్ళ మీద అవాంచిత రోమాలు రావటం సహజమే. అయితే కొందరిలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాక్సింగ్ లేదా ట్వీజింగ్ వంటి విధానాల సాయంతో వీటిని దూరం చేసుకోవాలి తప్ప సొంత ప్రయోగాలకు పూనుకుంటే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు తప్పవని గుర్తుంచుకోవాలి.
 • హార్మోన్ల మార్పుల వల్ల చర్మం జిడ్డుగా మారటం, మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు రావచ్చు. వైద్యులు సూచించిన క్రీములు, సబ్బులు, ఫేష్ వాష్ లను ఉపయోగించి ఈ సమస్యను అధిగమించవచ్చు.
 • గర్భిణులు మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. శ్రావ్యమైన సంగీతం వినటం, రోజూ కాసేపు ప్రాణాయామం చేయటం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడటం మూలంగా మానసిక ఒత్తిడి దరిజేరదు. ఆందోళన కలిగించే టీవీ కార్యక్రమాలు, సినిమాలు చూడకుండా ఉండటమే ఉత్తమం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE