ప్రపంచంలో అందరూ ఏ చీకూచింతా లేని జీవితాన్నే కోరుకుంటారు.  అయితే నిజంగా జీవితం అలావుంటే అదెంత దుర్భరమో ఒక్క క్షణం ఊహించుకుంటే మాత్రం జీవితంలోకి కష్టాలో భాగమని తెలుసుకుంటారు. ఆ కష్టాలను ధైర్యంగా అధిగమించగలుగుతారు. అయితే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేకే ఏటా ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని చాలిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాడు. నమోదవుతున్న ప్రతి 3 ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లోనే నమోవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకే ఏటా ఏటా సెప్టెంబర్ 10 నాడు ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం పేరిట పలు అవగాహనా సదస్సులు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

    ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 19 నుంచి 35 ఏళ్లలోపు వారే ఎక్కువ కాగా మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన వివక్షకు లేదా నిరాదరణకు గురికావటం, తీవ్రమైన అభద్రతాభావం, తనకెవరూ లేరనే అపోహ, చదువు ఒత్తిడి, తోటివారితో పోల్చుకోవటం, ప్రేమ, పెళ్లి వంటి అంశాలు యువతను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న ప్రధాన కారణాలని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనుబంధాలు, అనుభూతుల స్థానాన్ని వస్తువులూ, హోదాలు, డబ్బు ఆక్రమించటం కూడా సమస్యకున్న మరోకారణంగా వారు అభివర్ణిస్తున్నారు. 

బాధితులు ఎక్కువగా వీరే

ఆత్మవిశ్వాసం కోల్పోయినవారు, పరువు గురించి అతిగా ఆలోచించేవారు,  చదువులో వెనుకబడ్డవారు, తల్లిదండ్రుల ఆకాంక్షలమేరకు చదువు, ఉపాధి విషయాల్లో రాణించలేని యువత, వ్యసనాల బాధితులు, షేర్లు, బెట్టింగ్‌, వ్యాపారాల్లో దివాళా తీసినవారు, రైతులు, చేనేత కార్మికులు,  కుటుంబ, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలున్నవారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  

ఈ లక్షణాలుంటే అనుమానించాలి

ఆత్మహత్యా యత్నానికి పాల్పడే వ్యక్తులు   ఏ పనిమీదా ఏకాగ్రత చూపలేకపోవటం, ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం,  కుటుంబ సభ్యులు, స్నేహితులపై తరచూ అసహనం వ్యక్తం చేయడం,  దిగాలుగా ఉండడం,  చీకట్లో  ఉండిపోవటం,ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, పడే పడే ఏడవటం,  రాత్రి మెలకువగా ఉండడం,  ఏమీ సాధించలేకపోయానన్న నిర్వేదాన్ని వ్యక్తం చేయటం,  తాను బతకి సాధించేదేమీ లేదనుకోవటం, అటూ ఇటూ తిరుగుతుండడం వంటి లక్షణాలున్నప్పుడు సదరు వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించాలి. 

ఇలా చేయాలి

ఎక్కువమంది క్షణికావేశంలోనే ఆత్మహత్యా  యత్నానికి ఒడిగడుతున్నారు. ఆ ఒక్క క్షణం మనం వారిని ఆలోచింపజేయగలిగితే మళ్ళీ వారు ఆ దిశగా వెళ్ళటం తక్కువ. ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని తగిన కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం సముచితం. పని ఒత్తిడి నుంచి బయట పడడం, చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురవ్వడం, అసూయ, మానసిక రుగ్మతలను తగ్గించుకునేలా కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఈ అంశాల మీద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రోషిణి ( 040- 66661117, 4066661118), వన్‌లైఫ్ ( 7893078930), మాక్రో ఫౌండేషన్(040-46004600) వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి.  కౌన్సెలింగ్ సాయంతో యువతలో ఆశావహ దృక్పథాన్ని పెంచగలిగితే ఇప్పుడు జరుగుతున్నా ఆత్మహత్యల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE