మిగిలిన సీజన్లలో కంటే వానాకాలంలో గొంతు సంబంధిన అనారోగ్య సమస్యలు ఎక్కువే. వానలో తడవటం, చల్లని వాతావరణంలో సరైన రక్షణ లేకుండా వాహనాల మీద తిరగటం, కొత్త ప్రాంతంలో ప్రయాణించినప్పుడు అక్కడి వాతావరణం, నీరు, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల గొంతులో మంట, నొప్పి, బొంగురుబోవటం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులు రోజువారీ దినచర్యను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వీటికి జలుబు, దగ్గు, తుమ్ములు కూడా తోడైతేఆ రెండు రోజులూ ఏ పనిమీదా మనసు పెట్టలేని పరిస్థితి.  అయితే కొన్ని ముందు జాగ్రత్తలు, చిట్కా వైద్యం సాయంతో ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేమిటో తెలుసుకుందాం.

సరైన ఔషధం తేనె

 • గొంతు సమస్యలకు తేనెను మించిన ఔషధం లేదు. ఎంత తీవ్రమైన గొంతు నొప్పి అయినా అల్లం టీ లేదా హెర్బల్‌ టీలో కాస్త తేనె వేసి తాగితేవెంటనే తగ్గుతుంది.
 • తేనెలో దాల్చినచెక్క లేదా మిరియాల పొడి కలిపి రంగరించి ఆ లేహ్యాన్ని రోజూ 2 సార్లు తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి తగ్గుతుంది.
 • తేనె, నిమ్మరసం కలిపి రోజూ 4 సార్లు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

ఇతర పరిష్కారాలు

 • గొంతు సమస్యలకు విటమిన్ సి మంచి ఔషధం. గొంతు జలుబు ఉందని వెనకాడకుండా నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్ల రసాలు తీసుకోవాలి. విటమిన్ సి మూలంగా గొంతు సమస్యలు ఉపశమించటమే గాక శరీరానికి తగినంత రోగనిరోధక శక్తి చేకూరి ఎలర్జీలు కూడా దరిజేరవు.
 • తులసీ దళాల కషాయం తాగితే కొన్ని గంటల్లోనే గొంతునొప్పి తగ్గుతుంది.
 • రోజుకు 4 సార్లుగ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు లేదా సోడా ఉప్పు వేసి కలిపి ఆ నీటితో బాగా పుక్కిలిస్తే గొంతులో పేరుకున్న శ్లేష్మము, కఫము కొద్దీ కొద్దిగా బయటకు పోతాయి.
 • గ్లాసు వేడి పాలలో పావు చెంచా మిరియాల పొడి వేసుకొనిరోజుకు 2 సార్లు తాగినా గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • గొంతు గరగర వేధిస్తుంటేవెల్లుల్లి సూపు, అల్లం వేసి కాచిన డికాషన్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 • 2 లీటర్ల వేడి వేడి నీటిలో అర చెంచా పసుపు వేసి చుట్టూ దుప్పటి కప్పుకొని ఆ ఆవిరిని పూర్తిగా పీల్చటం వల్లముక్కు, గొంతు మార్గం పూర్తిగా తెరుచుకొనిఅప్పటివరకూ ఉండే అసౌకర్యం తొలగిపోతుంది.

జాగ్రత్తలు

 • జలుబు, దగ్గు, గొంతు సమస్యలతో సతమతం అయ్యేవారు ఏసీ రూంలో గాక వెచ్చని వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలి. వెచ్చని పొడి దుస్తులు ధరించాలి.  
 • శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్ కు బదులుగా వేడి వేడి సూపులు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటివి తీసుకోవాలి.
 • నిల్వ పచ్చళ్ళు, రోడ్డు వెంట అమ్మే ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.

గమనిక: గొంతు గరగరతో బాటుకళ్లు, ముక్కు, గొంతు భాగాల్లో దురదగా ఉండటం, అలసట, కళ్లు ఎర్రబడడం, కళ్ళు, ముక్కు నుంచి నీరు కారటం, లోజ్వరం కనిపిస్తే ఎలర్జీగా అనుమానించి వైద్య సలహా తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE