శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవటాన్ని చెముడు అంటారు. వయసు పైబడటం, ప్రత్యేక కారణాల వల్ల వచ్చే చెముడుతో పోల్చినప్పుడు పిల్లల్లో పుట్టుకతో వచ్చే చెముడును చాలామంది సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారు. దీనివల్ల పిల్లలు చెవుడుతో బాటు మూగతనం బారిన పడుతున్నారు. గతంలో ఈ సమస్య బారిన పడిన వారు తగిన చికిత్స అందుబాటులో లేకఆ సమస్యతోనే అలాగే జీవితాన్ని కొనసాగించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సమస్యకు ఇప్పుడు చక్కని చికిత్సతో బాటుఆధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే వినికిడి లోపించిన పిల్లలకు వీలున్నంత త్వరగా చికిత్స ఇప్పించాలి.
ప్రధాన కారణాలు
- మేనరికపు వివాహాలు
- చెవుల్లో చీము కారడంతో మధ్య చెవి, లోపలి చెవి దెబ్బతినటం, ఇన్ఫెక్షన్లు
- మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం పనితీరు దెబ్బతినటం వల్ల
- కర్ణభేరికి రంధ్రం అయి దానితో కలిసి ఉండే 3 ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, చెవి నుంచి ముక్కు చెవి నాళం మూసుకుపోయి అక్కడ ద్రవాలు, జిగురు పేరుకుపోవటం, చెవి కేంద్ర భాగంలో కణితి ఏర్పడటం
- చెవి లోపలి భాగపు నాడులు బలహీనపడటం లేదా ఇతర అనారోగ్యానికి వాడిన కొన్ని మందుల దుష్ప్రభావాల మూలంగా ఈ నాడులు దెబ్బతినటం
లక్షణాలు
- మాట ఒకటికి రెండు సార్లు చెప్పాల్సి రావటం, వెంటనే జవాబివ్వలేకపోవటం
- ఏదైనా చెప్పేటప్పుడు పూర్తిగా అర్దం చేసుకోలేకపోవడం, బిగ్గరగా మాట్లాడమనటం
- రేడియో, టి వి సౌండ్ ఎక్కువగా పెట్టటం
- పిల్లలు శబ్దానికి ప్రతిస్పందించలేకపోవటం
గుర్తించే పరీక్షలు
- వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసే ఆబ్జెక్టివ్ పరీక్ష.
- 6 నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్ ఇవోక్‌డ్ రెస్పాన్స్‌డ్ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
- మధ్య చెవిలోసమస్యలను గుర్తించేందుకు ఇంపిడెన్స్ పరీక్ష
- చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందించే ప్యూర్‌టోన్ పరీక్ష
వినికిడి యంత్రాలు
- చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన సాంప్రదాయ పరికరాలు
- చెవుడు స్థాయిని బట్టి ఆడియాలజిస్టులు రూపొందించే పరికరాలు
- వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికిచ్చే 'కాక్లియర్ ఇంప్లాంట్’