సొరియాసిస్ఒక దీర్ఘకాలిక చర్మవ్యాధి. ఈ వ్యాధికి వయసు, ప్రాంతం, స్త్రీ పురుషులనే తేడా లేదు. వేసవి, వర్షాకాలాల్లో నిద్రాణంగా ఉన్నట్లు కనిపించే దీని లక్షణాలు చలికాలంలో మాత్రం తీవ్రమవుతాయి. సొరియాసిస్ వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. ఇది అంటువ్యాధి కాదు. శరీరంలో రోగనిరోధక శక్తి వ్యవస్థలో వచ్చే కొన్ని అవాంఛితమైన మార్పుల వలన కూడా ఇది సంక్రమించవచ్చు. తొలిదశలో గుర్తించటంతో బాటు పూర్తిగా నయమయ్యే వరకు చికిత్స తీసుకుంటే సొరియాసిస్ పూర్తిగా నయమవుతుంది.
సొరియాసిస్ అంటే?
మనిషి చర్మంలో ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అనే పొరలుంటాయి. ప్రతి 28 రోజులకోసారి ఈ పొరల్లోని చర్మకణాలు చనిపోవటం, తిరిగి కొత్తవి పుట్టటం జరుగుతుంది.మృత కణాలు చర్మపు పై పొర అంటే ఎపిడర్మిస్ ద్వారా బయటికి వచ్చి రాలిపోతుంటాయి. అయితే సొరియాసిస్ బాధితుల్లో ఈ ప్రక్రియ కేవలం ఐదారు రోజుల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల మృతకణాల సంఖ్య పెరిగిపోయి ఆ కణాలన్నీ చర్మం పై పొరమీద అట్టకట్టి పొలుసులుగా రాలిపోతుంటాయి. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, వీపు, ఛాతి, తల బాగాల్లోంచి ఎక్కువగా ఈ కణాలు బయటపడుతుంటాయి.
కారణాలు
వంశపారంపర్యత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పొడి చర్మం, ధూమపానం,హఠాత్తుగా వచ్చే వాతావరణ మార్పులు,వాడే మందుల ప్రభావం వల్ల సొరియాసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా సొరియాసిస్ వచ్చేందుకు దోహదపడే ఇతర కారణాలుగా ఉన్నాయి.లక్షణాలు
తొలిదశలో చర్మం మీద చిన్నఎర్రటి మచ్చలు ఏర్పడి క్రమంగా అక్కడి చర్మం చర్మం బూడిద రంగులోకి మారిపోయి చేప పొలుసుల్లా రాలిపోతుంది. దురదతో కూడిన ఈ మచ్చలు ఆవగింజ సైజు నుంచి కొన్ని సెంటీ మీటర్ల దాకా విస్తరిస్తాయి. చర్మం మీదున్న పొలుసులను బలంగా లాగినప్పుడు చర్మం మీద చిన్న చుక్కల్లా రక్తం వస్తుంది. తలలో అయితే పెద్ద పెద్ద పొలుసుల రూపంలో చుండ్రులా రాలిపోతుంటాయి. గోళ్లు గుంతలు పడటం, గోరు పసుపు రంగులోకి మారి చర్మం నుంచి వేరుపడటం కనిపిస్తుంది.
సొరియాసిస్ వ్యాధి రకాలు
చికిత్స
ఏ రకం సొరియాసిస్ అనే నిర్ధారణ అయినా తర్వాత అందుకు తగిన చికిత్స చేస్తారు. కొందరికి కేవలం పైపూత మందులతో, మాయిశ్చరైజర్ల వినియోగంతోసమస్య దారికి రావచ్చు. న్యారోబ్యాండ్ యూవీబీ, గోకెర్మన్ థెరపీల వంటివీ అందుబాటులో ఉన్నాయి. సమస్యతీవ్రంగా ఉంటే మాత్రలు, ఇంజెక్షన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనుషులు లేదా జంతువుల నుంచి తీసిన ప్రోటీన్లయిన 'బయోలాజికల్స్' కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి నేరుగా రోగనిరోధకవ్యవస్థ మీదనే పనిచేస్తాయి. సమస్య చర్మం వరకూ రాకుండా అడ్డుకుంటాయి.