• HOME
  • ఆరోగ్యం
  • ఇప్పుడు క్యాన్సర్‌ ప్రాణాంతకం కాదు

ప్రపంచవ్యాప్తంగా ప్రాణనష్టం కలిగిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందువరుసలో ఉంది. అయితే గతానికి భిన్నంగా ఇటీవలికాలంలో రోగ నిర్ధారణ, చికిత్స అంశాల్లో పురోగతి సాధించటంతో ఇప్పుడు ఇది పూర్తిగా అదుపుచేయగల వ్యాధిగా మారింది. అయితే నేటికీ సమాజంలో క్యాన్సర్ వ్యాధి పట్లా, దాని చికిత్స పట్ల ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఈ అపోహలను తొలగించి బాధితులు ధైర్యంగా చికిత్సకు ముందుకు వచ్చేలా చేసేందుకు ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ వ్యాధి విషయంలో జనసామాన్యంలో ఉన్న కొన్ని అపోహలు, వాటికి సంబంధించిన వాస్తవాల గురించి తెలుసుకుందాం.

అపోహ: కేవలం ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య.

వాస్తవం : క్యాన్సర్‌ కేవలం అనారోగ్య సమస్యే కాదు. ఇది ప్రపంచాన్నిపలు రకాలుగా దెబ్బతీస్తున్న సామాజిక, ఆర్థిక సమస్య కూడా. 

అపోహ : ఇది కేవలం వయసుపైబడిన, డబ్బున్న వారికి మాత్రమే వచ్చే జబ్బు.

వాస్తవం : ఇది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా సోకవచ్చు. దీనికి పేదవారు, సంపన్నులనే తేడా లేదు .

అపోహ : క్యాన్సర్‌ అంటే మరణమే.

వాస్తవం : ఇది ఒకప్పటి మాట. ఇప్పటి రోజుల్లో కాస్త ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా చికిత్సకు లొంగుతుంది.

అపోహ : ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తలరాత బాగా లేకపోతే క్యాన్సర్ రావచ్చు.

వాస్తవం : ఇది నిరాశావాదుల మాట. మంచి జీవన శైలి, తగినంత వ్యాయామం చేయటం, పోషకాహారం తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.

అపోహ: సర్జరీ చేసి క్యాన్సర్ కణితిని తీస్తే దాని చుట్టూ ఉన్న భాగాలకు అది వ్యాపిస్తుంది.

వాస్తవం : శస్త్రచికిత్సకు ముందే కణితి సైజు, లక్షణం, వయసు తదితర అంశాలను వైద్యులు కూలంకషంగా పరిశీలించి దాన్ని ఏ మేరకు తొలగించాలో, అంతే మేరకు తొలగిస్తారు. దీనివల్ల క్యాన్సర్‌ పక్కకు వ్యాపిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే.

అపోహ: సెల్‌ఫోన్, మైక్రో ఒవేన్ రేడియేషన్ వల్ల క్యాన్సర్‌ వస్తుంది.

వాస్తవం : జన్యువుల (జీన్స్‌)లో జరిగే అసాధారణ మార్పులే క్యాన్సర్‌ కు కారణమని పరిశోధనలు తేల్చిచెప్పాయి. అయితే సెల్‌ఫోన్‌, మైక్రో ఓవెన్ రేడియేషన్‌ లకు తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది గనుక దానివల్ల జన్యువులు దెబ్బతినే ప్రమాదం ఉండదు. కనుక సెల్‌ఫోన్, మైక్రో ఒవేన్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పలేము.

అపోహ: క్యాన్సర్ రోగికి చేసే రేడియేషన్‌ చికిత్స చెప్పలేనంత బాధకు గురిచేస్తుంది.

వాస్తవం : ఇది అపోహ మాత్రమే. రోజువారీ రేడియేషన్‌ చికిత్స చేసేటప్పుడు శరీరం కొద్దిగా వేడెక్కుతుంది. కొందరిలో చర్మం పొడిబారి తాత్కాలికంగా పొక్కులు, దురదలు వస్తాయి తప్ప భరించలేని బాధ ఉండదు.

అపోహ: జుట్టుకు రంగు వేసుకొంటే క్యాన్సర్‌ తప్పదు.

వాస్తవం : జుట్టుకు వేసుకొనే రంగులను అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే మార్కెట్లో విడుదల చేస్తారు. కనుక అందులోని రసాయనాల వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పలేము.

అపోహ: కీమోథెరపీ చేస్తే తలవెంట్రుకలు పూర్తిగా రాలిపోతాయి.

వాస్తవం : కీమోథెరపీలో వాడే మందుల వల్ల తల వెంట్రుకల ఎదుగుదలకు దోహదపడే ఫాలికిల్స్‌ దెబ్బతిని వెంట్రుకలు పలచబడతాయి. అయితే ఇది కేవలం తాత్కాలికమైన పరిణామం మాత్రమే. దీన్ని నివారించే అనేక వైద్య విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

అపోహ: కీమోథెరపీ చేయించుకొంటే ప్రతికూల ప్రభావాలు( సైడ్‌ఎఫెక్ట్స్‌) తప్పవు.

వాస్తవం : ఇప్పుడు వాడుతున్న కీమో థెరపీ మందుల వల్ల ఆ ఇబ్బంది లేదు. 

అపోహ: అన్ని రకాల క్యాన్సర్లకు సర్జరీ ఒక్కటే పరిష్కారం.

వాస్తవం : క్యాన్సర్ కణాల లక్షణం, ఎదుగుదల వేగం వంటి పలు అంశాల ప్రాతిపదికన ఏ చికిత్స అవసరమో వైద్యులు నిర్ణయిస్తారు. వారి వారి లక్షణాలను బట్టి కొందరికి సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్ అవసరం కావచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE