• HOME
  • ఆరోగ్యం
  • ప్రసవానంతర అనారోగ్య సమస్యలు.. చికిత్స

కొందరు మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో, ప్రసవం తర్వాత అంత నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యం ఇన్‌ఫెక్షన్లు, వక్షోజాల నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలు, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి పలు సమస్యలకు కారణమవుతుంది. అయితే..ముందునుంచే ఈ సమస్యల పట్ల తగిన అవగాహన పెంచుకొని, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందులేమీ రాకుండా చూసుకోవచ్చు. తద్వారా తల్లీబిడ్డా ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

'పర్పురల్‌ ఇన్‌ఫెక్షన్స్‌'

 ప్రసవానంతరం కొందరు బాలింతలు పర్పురల్‌ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతుంటారు. రక్తహీనత, కాన్పువేళ అధిక రక్తపోటు బారినపడటం, నీరసం వంటి కారణాల వల్ల బాలింతలు ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. కొందరిలో కాన్పు సమయంలో అధిక బ్లీడింగ్‌ కావడం, మాయ కిందికి ఉండడం, కాన్పు తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌లు రావచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌ బాధితుల్లో తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, దుర్వాసనతో కూడిన యోని స్రావాలు కనిపిస్తాయి. ముందుగా దీన్ని గుర్తించి చికిత్స చేయకపోతే ఈ గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ క్రమంగా పొట్ట, ఆ తర్వాతా మొత్తం శరీరం వ్యాపిస్తుంది.

పరిష్కారం

గర్భిణిగా ఉన్నప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల రక్తహీనత, అధిక రక్తపోటు,మధుమేహం, టిబి, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌, దంత, చిగుళ్ల సమస్యలు వంటి సమస్యలు ఉన్నా ముందుగా తెలుసుకొని తగు చికిత్స తీసుకోవచ్చు. కాన్పు జరిగే గది శుభ్రంగా ఉండేలా చూసుకోవటం, ముందునుంచి వ్యక్తిగత పరిశు భ్రత పాటించటం, శుభ్రమైన నీటితో స్నానం, స్నానం తర్వాత ఒళ్ళు శుభ్రంగా తుడుచుకోవటం, ఒంటిపై ఎక్కడయినా గాయమైతే వెంటనే వైద్యం చేయించుకోవటం, స్టెరైల్‌ ప్యాడ్స్‌ వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. కాన్పు తర్వాత గర్భాశయం సరిగా మూసుకోకపోవటం, మాయ అవశేషాలు గర్భాశయంలో ఉండిపోవటం వంటి కారణాలు ఇన్ఫెక్షన్ కు కారణమయితే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.

యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌

బాలింతల్లో కొందరికి యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ రావచ్చు. ఇలాంటివారిలో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, మూత్రాశయం వాపునకు గురికావటం, దగ్గినప్పుడు యోనిలో నొప్పి ఉండటం, మూత్రం తక్కువగా రావటం వంటి లక్షణాలు ఉండొచ్చు. ఇలాంటివారు మంచినీరు ఎక్కువగా తాగాలి. మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకోకూడదు.

వక్షోజాల సమస్యలు

కొందరు బాలింతలు శిశువులకు పాలిచ్చేటప్పుడు వక్షోజాల్లో విపరీతమైన నొప్పి, వక్షోజాలు ఎర్రబారటం, ముట్టుకుంటే నొప్పి కలగడం, చనుమొనలు చిట్లి రక్తం కారటం, పాలు తక్కు వగా పడటం, అసలు పాలు పడకపోవటం, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు సూచించిన యాంటీ బయోటిక్స్, క్రీమ్‌లు, మందులు వాడాలి. కొందరు మహిళల్లో చనుబాలు గడ్డ కడతాయి. వీరికి ఎప్పటికప్పుడు అదనపు చనుబాలను తీసేయాలి. లోబీపీ, ఎనీమియా, బాలింత వయసు 40కి పైబడటం, డిప్రెషన్‌, అల్సర్లు వంటి కారణాలే ఈ తరహా సమస్యలకు ప్రధాన కారణాలు. ఈ సమస్యలున్నప్పుడు బాలింతల్ని మానసికంగా సిద్ధం చేయటం తో బాటు శిశువును తల్లి పక్కనే ఉంచడం, పోషకాహారం, విశ్రాంతి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సబ్‌ ఇన్‌వల్యూషన్‌

కాన్పు తర్వాత గర్భాశయం సరిగా ముడుచుకోకపోవడాన్ని 'సబ్‌ ఇన్‌వల్యూషన్‌' అంటారు. ఈ తరహా కేసుల్లో అధిక బ్లీడింగ్, తీవ్ర కడుపునొప్పి, బ్లీడింగ్‌ రంగు మారి వాసన రావటం ఉండొచ్చు. ఎక్కువగా డెలివరీలు జరిగినవారికి, సిజేరియన్‌ అయిన వాళ్లకు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్లకి, యుటెరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వాళ్లకి ఈ తరహా ఇబ్బంది రావచ్చు.

 

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం…

కాన్పు తర్వాత కాలి, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులున్నవారికి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి ఈ సమస్య ఏర్పడుతుంది. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌ సమస్యలే దీనికి ప్రధాన కారణాలు. వీరు వైద్యులు సూచించిన యాంటిబయాటిక్స్‌ వాడుతూ విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ కాళ్ల నరాల మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పులు వస్తే వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE