• HOME
  • ఆరోగ్యం
  • ఇలాచేస్తే వేసవిలో పిల్లల ఆరోగ్యం పదిలం

మరికొద్ది రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులు రానున్నాయి. ఏడాదిపొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులకు చెప్పుకోదగ్గ విరామం, ఊరట లభించేది ఈ వేసవి సెలవుల్లోనే. అందుకే.. పెద్దలు సైతం ఈ సెలవుల్లో పిల్లలను అంతగా కట్టడి చేసేందుకు ఇష్టపడరు. అటు పిల్లలు సైతం.. మండే ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతలను లెక్క చేయకుండా రోజంతా ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. అయితే.. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ వేసవి సెలవులను ఆస్వాదించటం సాధ్యమవుతుంది గనుక పెద్దలు తప్పకుండా ఈ కింది అంశాల మీద దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి..

ముప్పు కలిగించే సమస్యలు

సాధారణంగా చిన్న పిల్లల మెదడులోని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం బలహీనంగా ఉంటుంది. ఎండలు పెరిగేకొద్దీ పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది గనుక ఈ సమయంలో వారు ఎండబారిన పడితే వడదెబ్బ ముప్పు తప్పదు. దీనికి తోడు ఆటపాటల్లో పడి తగినంత నీరు తాగకపోవటంతో శరీరంలోని నీటినిల్వలు తగ్గటం, ఉక్కపోత వల్ల చెమట పట్టి ఒంట్లోని లవణాలు పోవటంతో నీరసం, తలనొప్పి రావచ్చు. ఆరేళ్ళ లోపు పిల్లల్లో ఈ పరిస్థితి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి ఫిట్స్‌ కూడా రావచ్చు. 

వేసవిలో పిల్లల శారీరక పరిశుభ్రత మీద పెద్దలు శ్రద్ధ వహించాలి. దుమ్ము ధూళిలో గంటలు కొద్దీ గడిపి స్నానం చేయకపోతే ఒంటిమీది స్వేద గ్రంథులు మూసుకుపోయి వ్యర్థ పదార్థాలు ఒంట్లో పేరుకుపోయి ఒళ్ళు త్వరగా చల్లబడదు. దీనివల్ల వడదెబ్బ తగిలే ముప్పు పెరుగుతుంది. దీనితో బాటు చర్మంపై మురికి చేరి చెమటకాయలు వస్తాయి. దురద పెట్టినప్పుడల్లా గోకటంతో చర్మం మీద పుండ్లు పడి, అక్కడ ఇన్‌ఫెక్షన్‌ చేరటం జరుగుతుంది. మరికొందరిలో సెగగడ్డలతో బాటు తీవ్రమైన జ్వరం కూడా రావచ్చు. పిల్లలు ఎండల్లో తిరగటంతో ముక్కులు పొడిబారి దురద పెడతాయి. అలవాటుకొద్దీ ముక్కులో వేళ్ళు పెట్టి తిప్పటం వల్ల లోపల పుండ్లు పడి రక్తం కారవచ్చు. 

వేసవిలో వండిన ఆహారం త్వరగా పాడవుతుంది. ఆటల ధ్యాసలో పడి ఏదో ఒకటి తిని బయటపడదామని చూసే పిల్లలు పొరబాటున ఇలాంటి ఆహారం తింటే వాంతులు, విరేచనాలు తప్పవు. ఆటల్లో పడి తగినంత నీరు తాగకపోతే మూత్రం బిగదీయటం, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్‌, కిడ్నీలో రాళ్ళ వంటి సమస్యలూ రావచ్చు. ఇక.. ఎక్కడబడితే అక్కడ నీరు తాగితే కలరా, టైఫాయిడ్‌, కామెర్ల వంటి వ్యాధులు రాకమానవు. కలుషిత నీటితో చేసిన ఐస్ కలిపిన పండ్ల రసాలు, పానియాలు తాగితే తీవ్రమైన స్టమక్ ఇన్‌ఫెక్షన్లు తప్పవు . వీటికితోడు వేసవిలో ఈగల బెడద ఎక్కువ. ఈగలు వాలిన ఆహారం తిన్నా, పానీయాలు తాగినా అంటువ్యాధులు తప్పవు. 

వేసవిలో అంటువ్యాధుల బెడద ఎక్కువ. ముఖ్యంగా ఎండలు ముదిరే దశలో కళ్ళ కలక ఎక్కువగా కనిపిస్తుంది . వేసవిలో గాలికి రేగే దుమ్మూధూళి వల్ల ఈ ఇన్ఫెక్షన్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తుంది. అలాగే ఆటలమ్మ, గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, హైపటైటిస్‌ 'ఎ' కామెర్లు కూడా కనిపిస్తాయి. అందుకే వేసవికి ముందే వైద్యులను కలిసి పిల్లలకు టీకాలు ఇప్పిస్తే వీటి బెడద ఉండదు. 

పాటించాల్సిన జాగ్రత్తలు

  • ఎండవేళ పిల్లలు ఇంటిపట్టున ఉండేలా చూడాలి. పుస్తకాలు చదివేలా ప్రోత్సహించటం, బొమ్మలు వేయటం నేర్పించటం, పాటలు పాడమని ప్రోత్సహించటం, వారికిష్టమైన సినిమాలు చూపించటం వంటివి అలవాటు చేయాలి. ఆటలు, ఈత నేర్పించాలంటే ఉదయం 11 లోపు, సాయంత్రం 4 తర్వాతి సమయం మంచిది.
  • వేసవిలో పిల్లలకు ఇంట్లోనే రుచికరమైన చిరుతిళ్ళు, వంటకాలు చేసిపెడితే బయటి ఆహారం జోలికిపోరు.

గంటకోసారి మజ్జిగ, చెరుకురసం, రాగి జావ, సబ్జాగింజల నీరు, కొబ్బరి నీరు, నిమ్మ రసం వంటివి పిల్లలకు అందిస్తే మూత్ర సంబంధిత సమస్యలు రావు. తగినన్ని పోషకాలూ అందుతాయి.

  • వేసవిలో కీరదోస, పుచ్చ, కర్బూజా, దానిమ్మ వంటి సీజనల్ పండ్లు, తేలికగా జీర్ణమయ్యే ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి. వేసవిలో అధికంగా మసాలా వాడొద్దు. మాంసాహారం మానుకొంటే మరీ మంచిది.
  • పిల్లలున్న గది వాతావరణం వీలున్నంత చల్లగా ఉండేలా చూడాలి. ఆటపాటల్లో అలసిన పిల్లలకు రెండు పూటలా తప్పక చల్లని నీటితో స్నానం చేయించాలి. స్నానానికి సున్నిపిండి వాడితే ఒంటిపై చేరిన మురికి పూర్తిగా వదిలిపోతుంది.
  • పిల్లలకు పలుచటి, మెత్తటి కాటన్‌ బట్టలు తొడగాలి. జీన్స్, టీ షర్టుల బదులు కుర్తా, పైజామా వాడితే సౌకర్యంగా ఉంటుంది. వేసవికి ముందే పిల్లలకు తెల్లని టోపీ,మెత్తని చెప్పులు, ఒక గొడుగు కొనిస్తే ఎండలో బయటికి వెళ్లినా ముప్పు తప్పించుకోగలుగుతారు.
  • వేసవిలో రాత్రి ఆరుబయట, డాబాపై పాడుకొనే వారు తప్పక దోమతెర వాడాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE