వయసు పైబడేకొద్దీ మతిమరుపు సహజమే. అయితే.. ఈ మతిమరుపు సొంత ఇంటి మనుషులనే గుర్తుపట్టలేనంతగా మారితే రోజూవారీజీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. 60 ఏళ్ళ పైబడిన వారిలో మెదడు పనితీరు తగ్గటం వల్ల ఉత్పన్నమయ్యే ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో డిమెన్షియా అంటారు. ఇది కేవలం వృద్ధుల్లోనే రావాలని లేదు. 40 ఏళ్ల వారికీ రావచ్చు. ఈ సమస్యను వయసు ప్రభావంగా కొట్టిపారేయకుండా ఆరంభ దశలోనే గుర్తించి తగిన చికిత్సను అందించగలిగితే వృద్ధులు మునుపటిలా సాధారణ జీవితాన్ని గడపటం సాధ్యమవుతుంది.     

 వయసుతో వచ్చే మార్పు

సాధారణంగా 60 ఏళ్ళు పైబడిన వారిలో మెదడులోని న్యూరాన్ల సంఖ్య తగ్గటం, వాటి మధ్య సమాచార మార్పిడి నెమ్మదిగా జరగటం వంటి మార్పులు రావటం సహజమే. పెద్ద వయసులో ఉండే మానసిక ఒత్తిడి, మెదడులోని న్యూరాన్ల నశింపు, ప్రమాదాల్లో తలకు తగిలిన దెబ్బలు, నాడీ సంబంధిత రుగ్మతలు, నాడీ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురికావటం , మెదడులో జరిగే అసాధారణ మార్పులు, జీవక్రియ లోపాలు, జీవనశైలి అలవాట్లు వల్ల శరీరంలోని కొన్ని రకాల సాధారణ ప్రొటీన్లు అసాధారణంగా మారి మెదడు కణాలమీద పేరుకు పోయి అక్కడి కణాలను క్రమంగా నిర్వీర్యం చేస్తాయి. ఈ దశలో సమస్యను గుర్తించకపోతే మెదడు తో బాటు ఇతర అవయవాలు, జీవక్రియల మీద కూడా నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే అప్పటికే జరిగిన నష్టాన్ని తిరిగి భర్తీ చేయలేకపోయినా తగిన చికిత్స ద్వారా మెదడులోని న్యూరాన్ల సంఖ్య మరింత తగ్గిపోకుండా ఆపే అవకాశం ఉంది.

 లక్షణాలు

 స్వల్ప మతిమరుపుతో మొదలై క్రమేపీ తీవ్రమవుతాయి. తొలిదశలో పది నిమిషాల ముందు చెప్పిన మాట గుర్తుండకపోవటం, పరిచయస్తులైన వ్యక్తుల పేర్లు కూడా మరచిపోవటం, పదే పదే అడగటం లేదా చెప్పిందే చెప్పటం, బాగా తెలిసిన దారులు కూడా మరచిపోవటం, మాట్లాడేటప్పుడు పదాల కోసం వెతుక్కోవటం, వ్యక్తిగత వస్తువులను, వాటిని పెట్టిన చోటు మర్చిపోవటం వంటి ఇబ్బందులుంటాయి. సమయం గడిచేకొద్దీ మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ప్రవర్తనలో మార్పులు, నడవడానికి, పదార్థాలు మింగటానికి ఇబ్బంది పడటం, నచ్చని పని చేయిస్తే వెంటనే తీవ్ర భావోద్వేగానికి లోనవటం, విపరీతమైన కోపం తెచ్చుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 నిర్ధారణ, చికిత్స

మతిమరుపు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చికిత్సకు ముందు వైద్యులు బాధితుడి కుటుంబ సభ్యుల ద్వారా వీలైనంత సమాచారాన్ని సేకరించటంతో బాటు విటమిన్‌ బి12, థైరాయిడ్‌ లోపాలు, మధుమేహం, పక్షవాతం, మెదడులో రక్తం గడ్డలు, ఇతర ఇన్‌ఫెక్షన్లను నిర్ధారించేందుకు పలు రక్త పరీక్షలు, స్కానింగ్‌ చేస్తారు. ఙ్ఞాపకశక్తిని అంచనా వేసేందుకు కొన్ని ప్రశ్నలతో కూడిన పరీక్ష ఆధారంగా మతిమరుపు స్థాయి తెలుసుకుంటారు. కొందరికి మందులతో సమస్య దారికి వస్తుండగా, మరికొందరికి సర్జరీ అవసరం కావచ్చు. వీటితోపాటు ఫంక్షనల్‌ రిహాబిలిటేషన్‌ (ఇష్టమైన వ్యాపకాలతో గడపటం) ఎంతో అవసరం. అయితే చికిత్సలేని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చిన డిమెన్షియాకు చికిత్స అందించినా పరిమిత ఫలితాలే ఉంటాయి.   

ఆదరణే కీలకం

డిమెన్షియా బాధితులతో కల్పించుకొని తరచూ ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ల ఆసక్తిని బట్టి ఆటల్లో పాల్గొనేలా చేయాలి. విసిగించినా వారితో ఆప్యాయంగా , సహనంతో మసలుకోవాలి. ఇంట్లో ఈ విధమైన వాతావరణం లేకపోతే బాధితుల పరిస్థితి మరింత దిగజారుతుంది.

అదుపు చేయటమెలా?

నలభై ఏళ్ళున్న వారు రోజూ తప్పక వ్యాయామం, సమతుల ఆహారం అవసరం. మల్టిపుల్‌ హాబీలు.. అంటే పెయింటింగ్‌, రచనలు, పాడటం, నాట్యం, ఆటలు, కొత్త భాష నేర్చుకోవటం , మెదడును ప్రేరేపించే పజిల్స్‌ పూరించటం, తరచుగా విహారయాత్రలు చేయటం వంటి వ్యాపకాల కోసం రోజులో కొంత సమయాన్నైనా కేటాయించగలిగితే .. డిమెన్షియాను అదుపుచేయవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE