• HOME
 • ఆరోగ్యం
 • గర్భిణుల సమస్య.. జెస్టేషనల్‌ డయాబెటిస్‌

గతంలో మధుమేహ సమస్య లేకున్నా గర్భధారణ తర్వాత మధుమేహం వస్తే దానిని జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. గర్భిణి శరీరంలో కలిగే హార్మోన్ల గందరగోళం మూలంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనివల్ల గర్భిణితో బాటు గర్భస్థ శిశువు సైతం పాక్షికంగా ఈ మధుమేహ ప్రభావానికి గురవుతుంది. సాధారణంగా  3, 4వ నెలల్లో కనిపించే ఈ సమస్య కాన్పు తర్వాత దానంతట అదే దూరమవుతుంది. అయితే.. కొద్దిమందిలో ప్రసవం తర్వాత కూడా మధుమేహ సమస్య కొనసాగుతుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం .. నూటికి 10మంది గర్భిణులు ఈ జెస్టేషనల్‌ డయాబెటిస్‌ బారినపడుతున్నారు. అందుకే గర్భిణులు ఈ సమస్య విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. 

బాధితులు వీరే?

 • ఊబకాయులు
 • గత కాన్పు సమయంలో ఈ సమస్య బారినపడినవారు
 • గత కాన్పులో అధిక బరువున్న పిల్లలను ప్రసవించినవారు
 • ముందునుంచీ మధుమేహం ఉన్నవారు
 • గర్భిణి తల్లిదండ్రుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే 

శిశువుకు వచ్చే సమస్యలు

జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వల్ల వచ్చే మొదటి సమస్య.. గర్భస్థ శిశువు పరిమాణం, బరువు పెరగటం. దీనివల్ల కాన్పు కష్టమవుతుంది. మరో సమస్య.. తల్లికడుపులో ఉన్నప్పటి నుంచే శిశువు మధుమేహ ప్రభావానికి అలవాటు కావడం వల్ల డెలివరీ అయిన వెంటనే శిశువు శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. దీనివల్ల శిశువును కొంతకాలం ఐసియులో ఉంచాల్సి ఉంటుంది. 

అపోహలు

తల్లికి ప్రెగెన్సీలో మధుమేహం వస్తే బిడ్డకూ వస్తుందని అనుకుంటారు. ఇది అపోహే. నిజానికి గర్భిణికి డయాబెటిస్‌ ఉంటే వెంటనే అది పిల్లలకు సంక్రమించదు. భవిష్యత్తులోనూ తప్పనిసరిగా సంక్రమించాలనే నియమమూ లేదు.

సమస్య ఉన్న గర్భిణులకు సైతం వెంటనే మధుమేహం వస్తుందని అనుకుంటారు గానీ అదీ అపోహే. ఈ సమస్య బారినపడిన గర్భిణుల్లో సగం మందికే.. అదీ కాన్పు తర్వాతి నాలుగైదు ఏళ్లలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎదురుకావచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • 3 నెలలు నిండిన గర్భిణులు ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (ఓజిటిటి ) చేయించుకుంటే సమస్య ముందుగా బయటపడుతుంది.
 • కాన్పు తర్వాత పోషకాహారలోపం లేకుండా చూసుకోవటంతో బాటు వేళ పట్టున ఆహారం తీసుకోవాలి.
 • కాన్పు తర్వాతి తొలి 3 నెలలు బరువు తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా బాగా బరువు పెరిగితే మధుమేహం ముప్పు ఎక్కువ. అందుకే బరువు విషయంలో అదుపు, క్రమత్వం అవసరం.
 • కాన్పు తర్వాత బిడ్డకు తప్పనిసరిగా చనుబాలు ఇవ్వాలి. లేకుంటే బరువు పెరిగి మధుమేహం రావచ్చు.
 • కాన్పు తర్వాత 2 వారాల నుంచి కొద్దికొద్దిగా వ్యాయామం చేయటం ద్వారా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.
 • ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా, కొద్దికొద్దిగా విడతలుగా తీసుకోవాలి. బియ్యానికి బదులు పీచు కలిగిన జొన్న, సజ్జ, రాగి, వరిగ వంటి చిరుధాన్యాలు తీసుకుంటే జీర్ణక్రియ ఆలస్యమై త్వరగా ఆకలి కాదు.
 • నెమ్మదిగా జీర్ణమై రక్తంలో గ్లూకోస్ శాతాన్ని నెమ్మదిగా పెంచే ఆహారం తీసుకోవాలి. లేకుంటే రక్తంలో గ్లూకోస్ పరిమాణం ఒక్కసారిగా పెరిగి సమస్యగా మారొచ్చు.
 • ఉదయం అల్పాహారంలో తప్పకుండా మాంసకృత్తులు, పిండి పదార్థాలు అందించే ఇడ్లీ, దోశ, పొంగలి వంటివి తీసుకోవటంతో బాటు మైదా, మిఠాయిలు, పండ్లరసాలు, ప్యాకింగ్ ఆహారం పూర్తిగా మానేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE