ఉన్నట్టుండి శ్వాస తీసుకోలేకపోవటం, భరించలేని ఛాతీనొప్పి కనిపిస్తే అందరూ గుండెపోటే అని అనుకుంటారు గానీ కొన్నిసార్లు ఆ లక్షణాలు ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ (పల్మనరీ ఎంబోలిజమ్-పీఈ) మూలంగానూ కావచ్చు. శరీర భాగాల్లో.. ముఖ్యంగా కాళ్ల ధమనుల్లో రక్తం గడ్డలు కట్టి అవి ఊపిరితిత్తులకు చేరుకొని స్థిరపడటంతో అది క్రమంగా 'పల్మనరీ ఎంబోలిజమ్'కు దారితీస్తుంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించి తగు చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు, గుండె కోలుకోలేనిరీతిలో దెబ్బతినే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రమయ్యే వరకూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

ఎవరికి రావచ్చు?

 ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టటమనే సమస్య ఏ వయసువారికైనా రావచ్చు. సాధారణంగా రోజంతా ఒకేచోట కూర్చొని పనిచేసేవారికి , మంచాన పడ్డవారికి, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్స మూలంగా సిరలు దెబ్బతిన్నవారికి, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఈ సమస్య ముప్పు ఎక్కువ. ఊబకాయులు, గర్భిణులు, బాలింతలకూ ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

లక్షణాలు

 • హఠాత్తుగా శ్వాస తీసుకోలేక పోవటం
 • ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో తీవ్రమైన నొప్పి
 • చర్మం పాలిపోవటం
 • గుండె వేగం పెరగటం, ఆందోళన
 • క్షణాల్లో చెమట పట్టటం.
 • రక్తపోటు పడిపోయి స్పృహ తప్పటం లేదా తల వాల్చటం
 • ఇబ్బందిపెట్టేలా వచ్చే దగ్గు, కొన్నిసార్లు రక్తంలో కళ్లె పడటం
 • పిల్లికూతలు

చికిత్స

నిజానికి ఇది ఇబ్బందికర సమస్యే అయినా సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. సాధారణంగా ఏర్పడిన రక్తం గడ్డలలో కొన్ని వాటంతట అవే కరుగుతాయి. మందుల ప్రభావంతో రక్తం పలుచబడుతుంది గనుక రక్తం గడ్డలు కట్టటం ఆగిపోతుంది.

నివారణ

 • ఎక్కువసేపు ఒకేచోట కూర్చునేవారు ప్రతి అరగంటకోసారి లేచి తిరగాలి. కనీసం కాళ్లు, చేతులను కదిలిస్తుండాలి.
 • రోజుకు కనీసం అరగంటపాటు నడక వంటి తేలిక వ్యాయామాలూ సమస్యను నివారిస్తాయి.
 • కాలుపై కాలు వేసుకొని కూర్చొనే అలవాటు మానుకోవాలి.
 • ధూమపానం పూర్తిగా మానుకోవాలి.
 • అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ బాధితులు తగిన మందులు వాడుకోవాలి.
 • బరువు పెరగకుండా చూసుకోవాలి.
 • కుటుంబ పెద్దల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ముందుగా డాక్టరును కలిసి సలహా కోరాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE