కంటి పనితీరు బాగుండాలంటే దాని వెలుపలి, లోపలి భాగాల్లో తగినంత తేమ ఉండాలి. అయితే పెరిగిన కాలుష్యం, మారిన జీవనశైలి, విశ్రాంతి లేమి వంటి కారణాలు కంటిలో తేమను తగ్గేలా చేస్తున్నాయి. దీంతో కంటిలోని పారదర్శకమైన పొర(కార్నియా)కు తగిన పోషకాలు, ప్రాణవాయువు అందక కళ్ళు పొడిబారి రోజువారీ దినచర్యను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితినే వైద్యపరిభాషలో Dry Eyes అంటారు.
ముఖ్య కారణాలు
- కన్నీటి గ్రంథుల వ్యాధులు, కండ్లకలక వంటి సమస్యలు
- ప్లాస్టిక్, పింగాణీ, రసాయన, తోలు పరిశ్రమల్లో పనిచేయటం వల్ల
- మూత్ర విసర్జనను పెంచే, రక్తపోటును తగ్గించే మందులు వాడటం
- గర్భనిరోధక మాత్రలు వాడటం
- మానసిక ఒత్తిడి, మొటిమలు, నిద్రలేమి, ఎలర్జీ, జీర్ణకోశ వ్యాధులకు మందులు వాడటం
- రోజంతా ఏసీలో కూర్చొని కంప్యూటర్‌పై పని చేయడం,
- కాంటాక్ట్ లెన్స్‌ను ఎక్కువ కాలం వాడటం,
- శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం
లక్షణాలు
కళ్లు ఎర్రబారడం, నలకలు పడి దురద అనిపించటం, కళ్లు అలసిపోవడం, కనురెప్పలు బరువెక్కడం, అతిగా కంటి రెప్పలు కొట్టుకోవడం
పాటించాల్సిన జాగ్రత్తలు
- రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
- ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే చలువ కళ్లద్దాలు వాడాలి.
- వేసవిలో కళ్లకు చల్లని ఐప్యాక్ తరచుగా పెట్టుకోవటం, చక్రాల్లా తరిగిన కీర దోస ముక్కలను కళ్ల మీద ఉంచుకోవాలి.
- కంప్యూటర్ పై పనిచేసే సమయంలో తప్పక యాంటీగ్లేర్ కళ్లద్దాలు వాడాలి.
- కంప్యూటర్ను వాడేవారు అరగంటకోసారి చూపును బయటికి సారించటం, చల్లని నీటితో కళ్ళు కడుక్కోవటం వంటివి చేయాలి.
- కంటిచూపుతో తేడా వంటి లోపాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని కలిసి వారు సూచించిన లూబ్రికెంట్స్ వాడాలి.