మనిషి భావోద్వేగాల ప్రభావం పేగుల కదలికలపై పడినప్పుడు జీర్ణవ్యవస్థ పనితీరులో ప్రతికూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా పెద్దపేగులో అతి ప్రకోపం, అవాంఛిత ప్రేరణల వంటి మార్పులు కడుపులో గడబిడ సమస్యకు కారణమవుతాయి . ఈ స్థితినే వైద్యపరిభాషలో ఐబిఎస్( ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్) అంటారు. ఇది పేగులతో బాటు హార్మోన్ వ్యవస్థను, నాడీవ్యవస్థను దెబ్బతీస్తూ క్రమంగా మొత్తం శరీర వ్యవస్థనూ దెబ్బ తీస్తుంది. తిన్నదంతా విసర్జనలో వెళ్లడంతో ఎంత ఆహారం తీసుకున్నా ఇమడక సప్తధావులూ క్షీణిస్తాయి. ఫలితంగా శరీరం చిక్కి, వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి శరీరం రోగాల నిలయమవుతుంది. ఆయుర్వేదంలో ఇందుకు మంచి చికిత్సలు ఉన్నాయి.

కారణాలు

శరీరంలో ఓజస్సు (ఇమ్యూనిటీ) తగ్గటం, ధాతువుల్లో వ్యర్ధాలు పేరుకుపోవటం వంటి ముఖ్య కారణాలతో బాటు జీర్ణశక్తి తగ్గటం , పోషకాహారలోపం, నాడీవ్యవస్థ సమతుల్యత కోల్పోవడం, మానసిక ఒత్తిళ్లు, జీవన శైలి ఈ సమస్యకు కారణాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇది ప్రాణాంతక సమస్య కాకున్నా రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు మూడు రెట్లు అధికంగా దీని బారినపడతారు. దేశవ్యాప్తంగా 22 శాతం మంది మహిళలు దీని బాధితులేనని గణాంకాలను బట్టి తెలుస్తోంది.

అధిక ముప్పు వీరికే

వేళపట్టున తిననివారు, తరుచూ ప్రయాణాలు చేసేవారు, నిద్ర, విరామం లేకుండా పనిచేసేవారు, అతిగా కొవ్వు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్ తినేవారు, జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారు ఎక్కువగా దీని బారినపడతారు.

లక్షణాలు

దీనిబారిన పడిన వారిలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం, విరేచనం ఈ నాలుగు లక్షణాలూ కలగలిసి ఉంటాయి. ఒకరోజు మలబద్దకం ఆ వెంటనే విరేచనం వేధిస్తూ ఉంటాయి. వీటితో బాటు తేన్పులు, తరుచూ అపాన వాయువు విడుదల కావడం, జిగురు విసర్జన, రుచి తెలియకపోవడం, ఛాతీలో మంట, వికారం, వాంతి భావన, కండరాల నొప్పులు, నిద్రలేమి, వెన్ను, పొట్టకింది భాగాల్లో నొప్పి, మహిళల్లో రుతుక్రమం దెబ్బతినటం, కొందరు స్త్రీలలో మూత్ర విసర్జనపై అదుపు లేకపోవటం, రతిలో నొప్పి కూడా ఉండొచ్చు. ఐబిఎస్ దీర్ఘకాలం పాటు కొనసాగితే దిగులు, ఆందోళన, ఆత్మన్యూనత, ఆత్మనింద, ఆసహనం, కోపం, భయం వంటి భావనలూ కలుగుతాయి.ఒక్కోసారి పార్శ్వపు తలనొప్పికీ ఐబిఎస్ కారణమవుతుంది. రోజుకోతీరు పరిస్థితితో మనిషి అసౌకర్యానికి, అసహనానికి గురవుతారు. ఈ అస్తవ్యస్తత క్రమంగా వ్యాధిగా మారి రోజువారీ దినచర్యను తీవ్రంగా దెబ్బ తీస్తుంది.

ఆయుర్వేద చికిత్స

మన జీర్ణవ్యవస్థలో గ్రహణి అనే విభాగం తీసుకొన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసి, వ్యర్థాలను బయటికి పంపుతుంది. శరీరంలో అగ్ని తగినంత లేనప్పుడు ఈ ప్రక్రియలు జరగక ధాతువుల్లో ఆమం పేరుకుపోతుంది. ఇదే సమస్యకు అసలు కారణం. ఇందుకోసం లంఘనం, ఆమహర చికిత్సలు చేసి ఆమాన్నిబయటికి పంపుతారు. అదే సమయంలో శరీరంలో అగ్నిని పెంచి ఇతర రోగాలూ నశించేలా చేయటం, ఆకలిని పెంచే దీపన చికిత్సలు, పంచకర్మ చికిత్సలు చేసి శరీరంలో పునరుత్తేజం తెస్తారు. ఇవన్నీ కలిసి ఐబిఎస్ సమస్యను సమూలంగా, శాశ్వతంగా తొలగిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE