మనిషిని వేదించే పలు సమస్యలకు మలబద్ధకం ఒక ప్రధాన కారణం. మలబద్దక బాధితుల్లో అశాంతి, విసుగు, కోపము, నిరుత్సాహము కారణంగా వారి వ్యక్తిగత, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీని బాధితులు ఏనాడూ రోజువారీ దినచర్యను ఉత్సాహంగా నిర్వహించలేరు. ఏరోజుకారోజు శరీరం నుంచి బయటకు వెళ్లాల్సిన వ్యర్థాలు శరీరములో పోగుపడి, హానికారకాలుగా మారటంతో గ్యాస్, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక, హానికారక సమస్యల బారిన పడుతుంటారు. ఇక.. మల విసర్జన జరిగిన ప్రతిసారీ నరకాన్ని గుర్తు చేసే మొలల సమస్య వీటికి అదనం. ఇన్ని రకాల అనర్ధాలకు దారితీస్తున్న మలబద్దక సమస్యకు ఆయుర్వేద వైద్య విధానంలో లో చక్కని పరిష్కారాలు ఉన్నాయి.
సమస్యకు మూలం అనారోగ్యపుటలవాట్లే
మారిన పరిస్థితుల్లో మనిషి ఆహార విహారాలలో తీవ్రమయిన మార్పులు వస్తున్నాయి. దీనికితోడు రోజంతా ఏసీ రూముల్లో ఒకేచోట కూర్చొని పనిచేయాల్సిరావటంతో తగినంత శారీరక వ్యాయామం లేక ఆ ప్రభావం పేగుల పనితీరును తగ్గేలా చేస్తోంది. అదే సమయంలో అధికంగా ఉండే సహజసిద్ధమైన పీచుపదార్ధాలు వుండే వంటకాల స్థానంలో పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ ప్రవేశించటంతో ఆహారకదలికలు మందగించి పేగులలో మలం పేరుకుని పోయి మలబద్దకానికి దారితీస్తోంది. గతంలో 2 నెలలకోసారైనా ఆముదం వంటి విరేచనకారిని వాడి పేగులను శుభ్ర పరచుకునేవారు. ఇప్పుడు ఆ అలవాటూ మాయం కావటంతో సమస్య మరింత పెరిగింది. వేళ పట్టున తినకపోవడంతో బాటు ఎక్కడ ఏది దొరికితే అది తినటానికి అలవాటు పడటం ఈ సమస్య తీవ్రతకు మరో ముఖ్య కారణం. ఈ కారణాల వల్ల సంక్రమించిన మలబద్ధకం కారణంగా రోజూ మలవిసర్జన సమయములో గట్టిగా ముక్కటంతో మొలలు రావటం, వాటిబాధ తట్టుకోలేక మలవిసర్జన పూర్తికాకుండానే లేచి వెళ్లటంతో మలబద్ధక సమస్య మరింత జటిలం అవుతోంది.
నివారణ
రోజూ క్రమం తప్పక వ్యాయామం చేయటం, పండ్లు, ఆకుకూరల వంటి పీచుపదార్ధాలున్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం, వేళ పట్టున తినటం, రోజూ కనీసం ఒక గ్లాసు మజ్జిగ తాగటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.
చిట్కా
రోజూ రాత్రి నిద్రకుముందు ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని గ్లాసు మజిగతో లేదా మంచినీటితో తీసుకొంటే ఉదయమే సుఖ విరేచనం అవుతుంది. అలాగే మొలలు, బాల నెరుపు సమస్యలూ దూరమవుతాయి. అలాగే.. కనీసం 6 నెలలకోసారైనా విరోచనానికి వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.