పిల్లల పెరుగుదల ఒక క్రమపద్దతిలో సాగుతుంది. బోర్లాపడటంతో మొదలయ్యే ఈ ప్రక్రియ పాకడం, కూర్చోవడం, ఏదైనా ఆసరాగా పట్టుకొని నిల్చోవడం, నడవడం, మాట్లాడటం ఇలా సాగుతుంది. అయితే.. ఆటిజం బారినపడిన పిల్లల్లో ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. ఈ సమస్యను ముందే గుర్తించి, సరిదిద్దే ప్రయతనం చేస్తే ఆటిజం బారినపడిన పిల్లలు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. 

కారణాలు

  • ఆటిజం సమస్యకు స్పష్టమైన కారణాన్ని చెప్పటం కష్టం. అయితే.. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, క్రోమోజోముల్లో వచ్చే మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాల్లో వచ్చే మార్పులూ సమస్యకు కారణం కావచ్చు.
  • గర్భిణి వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడినా, లేదా కాన్పు వేళ బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోయినా ఈ సమస్య రావచ్చు.
  • తల్లి తండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవటం, అస్తవ్యస్తమైన పనివేళలు, రేడియేషన్ ప్రభావం, పరిసరాల నుంచి తగు ప్రేరణ లేకపోవటం కూడా సమస్యకు కారణం కావచ్చు. 

 లక్షణాలు 

పసి పిల్లలు అకారణంగా ఏడ్వటం, గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం, తల్లిదండ్రులు పిలిచినా ముభావంగా ఉండటం, తెలిసిన వారిని చూసినా నవ్వక పోవటం వంటి లక్షణాలుంటాయి. అదే.. బడి వయసు పిల్లలైతే పక్క పిల్లలతో కలవకపోవటం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, పిలిస్తే పలకక పోవడం, మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి చూపటం, అడిగిన వెంటనే జవాబు ఇవ్వలేకపోవటం, సూటిగా చూడకపోవటం, స్పష్టమైన భావోద్వేగాలేవీ చూపకపోవటం, మాటలు సరిగా రాకపోవటం, తాము లేదా ఎదుటి వారు గాయపడినా పట్టనట్టు ఉండటం, నడిచేటప్పుడు మునివేళ్ల మీద నడవటం, ఎదుటివారు అడిగినదే జవాబుగా చెప్పటం, అసందర్భంగా మాట్లాడటం, ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం. దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం, చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం, అడిగినవి ఇవ్వకపోతే అరవటం, కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం, గాలికి తీగలాంటిదేదన్నా కదులుతున్నాచూసి భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి. ఒకేపనిని మళ్లీ మళ్లీ చేయటం, ఆ పనిని తిరిగి ఎప్పుడు చేసినా అలాగే చేస్తారు. రోజూ ఒకే కంచంలో తినటం, ఒకే చోట పడుకోవటం చేస్తారు. ఎలాంటి పరిస్థితిలోనూ వీటిలో మార్పులను అంగీకరించరు. సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు.

 వర్గీకరణ

ఆటిజం లక్షణాలు మొదలైన వయసు, తీవ్రత, ప్రభావం వంటి అంశాలను బట్టి అటిజాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. 

ఆటిస్టిక్ డిజార్డర్: ఆటిజం బాధితుల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇదే. దీన్ని ' చైల్డ్ హుడ్ ఆటిజమ్' అంటారు. ఇది మగపిల్లల్లో ఎక్కువ. 

రట్స్ డిజార్డర్: ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఇది బాలికల్లో ఎక్కువగా కనబడుతుంది. ఏడాది దాటినా తర్వాతే దీని లక్షణాలు బయటపడతాయి. రెండు మూడేళ్ల నాటికి ఈ లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ దశలో ముందు నేర్చుకొన్న కొద్దిపాటి మాటలూ మాట్లాడలేరు. తరువాతి దశలో.. నాడీ సమస్యలూ తోడై.. నడుము నిలపలేకపోతారు. 'ఫిట్స్' కూడా వస్తాయి. వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంది. చొంగ కార్చటం, చేతులు కాళ్లు ఒకేలా ఆడిస్తుండటం, చప్పట్లు కొట్టటం ఉంటాయి. యుక్తవయసు నాటికి సమస్యలు ముదిరి వీరు మరణిస్తుంటారు. 

ఆస్పర్జెర్స్ డిజార్డర్: ఇది మగ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆటిజం బాధిత పిల్లల్లో మాదిరిగా గాక వీరు చక్కగా మాట్లాడతారు . నలుగురితో కలవటం, మంచి తెలివి తేటలూ ఉంటాయి. వీరు అడిగిన దానికి జవాబు చెప్పి మౌనంగా ఉండిపోతారు. వీరు పొడవుగా, ఉంటారు. పొడవైన ముఖం, భిన్నంగా ఉండే చెవులతో ఉంటారు. బాగానే చదువుతారు. శ్రద్ధ చూపి నైపుణ్యం సాధిస్తారు. ఇతర ఆటిజం రకాల పిల్లలతో పోల్చినప్పుడు మెరుగ్గా ఉంటారు. వీరిలో ప్రవర్తనా సమస్యలు, కోపోద్రేకాలు చాలా ఎక్కువ. 

చైల్డ్ హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది చాలా తీవ్రమైన సమస్య. వీళ్లు రెండేళ్ల వరకూ బాగానే వుంటారు. ఆ తర్వాత ఒక్కసారిగా ముఖం ముదిరినట్లు మారటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా మారటం వంటి మార్పులు వస్తాయి. వీటితో బాటు నాడీ లోపాలూ తోడై, ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమై కన్నుమూస్తారు.చికిత్స

 'ఆటిజం రేటింగ్ స్కేల్స్' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలను గమనించి సమస్య తీవ్రతను గుర్తిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. తగిన మందులు వాడటం, కౌన్సెలింగ్, శిక్షణ ద్వారా మానసిక పరిపక్వతను పెంచటం, తగు ఆహారాన్ని మాత్రమే ఇవ్వటం ద్వారా ఆటిజాన్ని అదుపు చేస్తారు. పిల్లలతో బాటు పెద్దలకూ చిన్నారుల శిక్షణ, వారి బాగోగుల విషయంలో శిక్షణనిస్తారు. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ అవసరమవుతుంది. నైపుణ్యాల పెంపుకోసం ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ కూడా సూచిస్తారు.Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE