• HOME
 • ఆరోగ్యం
 • అనారోగ్యాన్ని ముందుగా సూచించే నాలుక

  మాట స్పష్టంగా పలకాలన్నా,  రుచి చూడాలన్నా, ఆహారాన్ని పద్దతిగా నమిలిమింగాలన్నా నాలుక సాయం ఎంతో అవసరం. మన నాలుకకు శరీరంలో అంతర్గతంగా జరిగే పలు మార్పులను ముందుగా పసిగట్టి కొన్ని మార్పుల రూపంలో ముందుగానే సూచించే శక్తి ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది గానీ ఇది ముమ్మాటికీ నిజం. ఏ చిన్న అనారోగ్యంతో వైద్యుడి దగ్గరకు వెళ్లినా ముందుగా పరీక్షించేది నాలుకనే. వైద్యపరిభాషలో నాలుక గురించిన శాస్త్రాన్ని 'గ్లాసాలజీ'  అంటారు. పలు అనారోగ్యాలను నాలుక వ్యక్తం చేసే తీరు, వాటికి సంబంధించిన మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం. 

 • పొడిబారితే.. డీహైడ్రేషన్‌

విపరీతమైన వాంతులు, విరేచనాల వల్ల శరీరంలోని నీరు బయటికి పోయి 'డీహైడ్రేషన్‌' బారిన పడుతుంటాం. ఈ సందర్భంలో ఎన్ని నీళ్లు తాగినా నాలుక పొడిబారినట్లు అనిపిస్తుంది. పిల్లల్లో, వృద్ధుల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. భయం, ఆందోళన, సైనసైటిస్‌, కొన్నిమానసిక సమస్యల వాళ్ళ కూడా నాలుక పొడిబారవచ్చు.

 • సైజు పెరిగితే .. హార్మోన్ సమస్య

కొందరి నాలుక నోట్లో పట్టనంత పెద్దదిగా ఉంటుంది. వైద్యపరిభాషలో దీన్ని 'మాక్రో గ్లాసియా' అంటారు. ఎదుగుదల హార్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉండటం, ముదిరిన థైరాయిడ్‌ సమస్య ఈ లక్షణానికి ప్రధాన కారణాలు కావచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్‌ కణుతులు, ఎలర్జీ కూడా ఈ లక్షణాలకు మూలం కావచ్చు.

 • పాలిపోతే.. రక్తహీనతే

మూడింట రెండొంతుల మంది మహిళల్లో, ముఖ్యంగా గర్భిణులలో రక్తహీనత వల్ల ముదురు గులాబి రంగులో ఉండాల్సిన నాలుక.. పాలిపోయి కనిపిస్తుంది.

 • విటమిన్లు లోపిస్తే..నున్నబడే నాలుక

ఒంట్లో ఇనుము, నియాసిన్‌ వంటి బీ కాంప్లెక్స్‌ విటమిన్లు తగ్గినప్పుడు నాలుక నున్నగా అయిపోతుంది. దీన్ని 'బాల్డ్‌ టంగ్‌' అంటారు.

 • మందుల దుష్ప్రభావంతో నల్లబడే నాలుక

యాంటీబయాటిక్స్‌, ఎసిడిటీ మందుల వాడటం వల్ల నాలుక నల్లబడే అవకాశం ఉంది. 'లైనిజోలిడ్‌' వంటి మందుల వల్లా ఈ మార్పు కానరావచ్చు. కనుక అవసరమైతే తప్ప మందులు వాడొద్దు. కొందరిలో రక్తహీనత నివారణకు వాడే 'ఐరన్‌ సిరప్‌'లు వాడినప్పుడు నాలుక నల్లబడినా, వాడటం ఆపిన తర్వాత మునుపటిలా మారుతుంది.

 • వణికే నాలుక.. నాడీ సమస్యలకు సంకేతం

నాడీమండలం లోపాల కారణంగా వచ్చే పార్కిన్సన్స్‌ వ్యాధి, పక్షవాతం, థైరాయిడ్ గ్రంథి లోపాలున్నప్పుడు, మద్యం అలవాటు మానుకొన్నవారిలో నాలుక వణకటం కనిపిస్తుంది. పురుగుల మందు తాగిన వారిలోనూ ఈ లక్షణం ఉంటుంది.

 • నాలుకపై తెల్లని పొర.. జీర్ణ సమస్యకు గుర్తు

నాలుక మీద పాచి మాదిరిగా ఎప్పుడూ తెల్లని పొర ఉంటుంటే జీర్ణ సంబంధిత సమస్యగా భావించాలి. అసిడిటీ, మలబద్ధకం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, జ్వరాలు, లివర్‌ వ్యాధులున్నవారిలోనూ  ఈ లక్షణం కనిపిస్తుంది.  

 • నాలుక పూత ఉంటే రోగనిరోధక శక్తి తగ్గినట్టే

కొందరికి నాలుక మీద పెరుగు తరకల్లా పూత వస్తుంది. ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గటమే ఇందుకు కారణం. దీర్ఘకాలంగా అదుపుతప్పిన మధుమేహం, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ బాధితుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది.

 • యాంటీబయాటిక్స్‌ వినియోగంతో.. ఎరుపెక్కే నాలుక

దీర్ఘకాలం యాంటీబయాటిక్స్‌ వాడినప్పుడు పేగుల్లో బీ-కాంప్లెక్స్‌ విటమిన్‌ను తయారు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీనివల్ల విటమిన్‌-బి లోపం తలెత్తి.. నాలుక ఎర్రగా పొక్కిపోతుంది. కొన్నివ్యాధుల్లో రక్తంలో హిమోగ్లోబిన్‌ మోతాదు పెరగటం వల్ల కూడా నాలుక ఎర్రబారుతుంది.

 • నీలి నాలుక.. శ్వాస క్రియ లోపానినికి గుర్తు

శ్వాస సమస్యల వల్ల రక్తంలో ఆక్సిజన్‌ తగ్గి, కార్బన్‌డైఆక్సైడ్‌ పరిమాణం పెరిగితే నాలుక నీలం రంగులోకి మారుతుంది. పుట్టుకతోనే గుండె జబ్బులున్న పిల్లల్లో, పుట్టగానే ఏడ్వని పిల్లల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది.

 • విటమిన్‌ బి12 లోపంతో.. నల్ల మచ్చలు

కొందరికి విటమిన్‌ బి12 లోపం వల్ల నాలుక మీద నల్లమచ్చలు రావచ్చు. మరికొందరికి కాఫీ, నలుపు కలిసిన రంగులో నాలుక మచ్చలు వస్తుంటాయి.

 • ఒత్తిడి పెరిగితే.. నంజు పొక్కులు

మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పిల్లలు, నిద్రలేమి బాధితులు, వ్యక్తిగత సమస్యల బాధితుల్లో నాలుక మీద నంజు పొక్కులు కనిపిస్తాయి. విపరీతమైన నొప్పి కలిగించే ఈ  పొక్కులు వారం పది రోజుల్లో అవే తగ్గిపోతాయి.

 • తెల్లటి మచ్చలు, నొప్పిలేని పుండ్లు .. క్యాన్సర్‌ ముప్పుకు సంకేతం

దీర్ఘకాలంగా పొగతాగుతున్న, పొగాకు నములుతున్న వారికి నోటి క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ. క్యాన్సర్ రాకకు గుర్తుగా వీరి నాలుక తెల్లబడటం, పొక్కులు ఏర్పడి నొప్పిలేని పుండ్లుగా మారటం, తెల్ల మచ్చలు కనిపించటం సహజమే. దీన్నే వైద్యపరిభాషలో 'ల్యూకో ప్లేకియా' అంటారు. ఈ తెలుపు గీకినా పోదు. నొప్పీ ఉండదు. కొందరిలో హెర్పిస్‌, సిఫిలిస్‌ వ్యాధుల వల్లా నోట్లో, నాలుక మీద నొప్పి లేని పుండ్లు రావచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE