క్షయ ఒకప్పుడు చికిత్సకు లొంగని ప్రాణాంతక వ్యాధి. అయితే.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మెరుగైన వైద్య విజ్ఞానం కారణంగా క్షయ నిర్మూలన, చికిత్స రెండూ సాధ్యమయ్యాయి. అయితే.. ఇప్పటికీ క్షయ లక్షణాలు, తీవ్రత, అది చూపే ప్రభావం, నివారణ, చికిత్స వంటి అంశాల మీద సమాజంలో తగినంత అవగాహన రాలేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న క్షయ కేసులే ఇందుకు తార్కాణం. ఈ నేపథ్యంలో.. అందరూ క్షయ సంబంధిత సమాచారాన్ని తెలుసుకొని దాని బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. 

  ఇది 'మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిన్‌ (ఎం.టి.బి) అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. క్షయకు లింగ, వయో భేదాలు లేవు. ఈ క్రిములు ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి గల వారి ఊపిరితిత్తుల్లో చేరి శ్వాసకోశాల్లో తిష్టవేసి తమ బలాన్ని పెంచుకొంటాయి. సదరు వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, చీదినప్పుడు, మాట్లాడినప్పుడు, ఉమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తూ ఉంటాయి. ఈ శ్వాసకోశ క్షయ తీవ్రమైన అంటువ్యాధి. ఇది శ్వాసకోశాలకే గాక ఉదరకోశం, ఎముకలు, కీళ్ళు, లింఫు గ్రంథులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భాశయం వంటి భాగాల్లోనూ చేరి తన ప్రభావాన్ని చూపుతుంది. ఎయిడ్స్‌ రోగులకు క్షయ సులభంగా సోకుతుంది. 

లక్షణాలు

3 వారాలకు మించిన దగ్గు, కఫం ఉంటాయి. వ్యాధి ముదిరితే కఫంతో పాటు రక్తం కూడా పడుతుంది. పగటిపూట బాగానే ఉన్నా సాయంత్రం వేళకి ఒళ్ళు వెచ్చబడటం, రాత్రి వేళకి జ్వరం ఉంటాయి. ఆకలి లేమి, బరువు తగ్గటం, ఆహారం సహించకపోవటం ఉంటాయి.

గుర్తించటమెలా?

రక్త పరీక్షలు,కళ్లె పరీక్ష ద్వారా దీన్ని గుర్తించవచ్చు. మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌ రే సాయంతో ఏమేరకు ఊపిరితిత్తులను ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు. అప్పటికే స్పష్టమైన అంచనాకు రాలేకపోతే ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష సాయంతో నిర్ధారణ చేసుకోవాలి.

చికిత్స

శరీరంలో ఏ భాగంలో క్షయ సోకినా చికిత్స మాత్రం ఒక్కటే. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ, పూర్తికాలం మందుల వాడితే క్షయ పూర్తిగా నయమవుతుంది. చాలామందికి మందులు వాడటం మొదలుపెట్టిన నెలలోపే ఉపశమనం కలగటంతో వ్యాధి తగ్గిపోయిందని మందులు మానేస్తుంటారు. దీంతో వీరిలో వ్యాధి తిరగబెడుతుంది. పైకి ఉపశమనం కలిగినా లోపలి క్షయ క్రిములు అలాగే ఉండటమే దీనికి కారణం. కనుక క్షయ బాధితులు పూర్తికాలం మందులు వాడాలి.

నివారణ

క్షయ రోగులు దగ్గినా, తుమ్మినా రుమాలు అడ్డు పెట్టుకోవాలి. వీరు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మరాదు. దగ్గినపుడు వచ్చే కఫాన్ని పాత్రలోకి పట్టి కాల్చివేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతతో పాటు గాలి, వెలుతురు బాగా ఉండే ఇంటిలో నివసించాలి. మంచి పోషకాహారం తీసుకుని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE