మహిళ జీవితంలో మాతృత్వం ఓ మరపురాని మధుర ఘట్టం. అమ్మ హోదా రాబోతోందని తెలిసిన క్షణం నుంచి బిడ్డను కనే వరకూ ఎన్నెన్నో తీయని అనుభూతులు. చెప్పలేనంత సంతోషాన్ని అనుభవించే ఈ సమయంలోనే వేవిళ్ళ వంటి సమస్యలూ ఉంటాయి. ప్రతి గర్భిణీ ఏదో ఒక స్థాయిలో వీటి ప్రభావానికి లోనవటం సహజమే అయినా కొందరు మాత్రం వేవిల్లతో సతమతవుతారు. గర్భం ధరించిన ఆరు వారాల నుంచి మూడు నెలలు నిండే వరకు ఈ లక్షణాలు కాస్త ఇబ్బంది పెడతాయి. పలు అభివృద్ధి చెందినా దేశాల్లో వివాహం, గర్భధారణ, కాన్పు వంటి ప్రతి అంశంలోనూ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇందులో ఆయా సందర్భాలలో కనిపించే లక్షణాలు, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు వివరిస్తారు. కానీ మన దేశంలో ఇప్పటికీ ఆ ధోరణి లేకపోవటం విచారకరం.

లక్షణాలు

నెలతప్పిన తొలినాళ్ళలో గర్భిణి శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులే వేవిల్లకు కారణం. వీరిలో వెంటవెంటనే వాంతులు కావటం, వికారంగా అనిపించటం, నీరసం వంటి లక్షణాలుంటాయి. మార్నింగ్ సిక్ నెస్ అని పిలిచే వేవిళ్ళ తీవ్రత  ఉదయం నిద్ర లేచే సమయంలో ఎక్కువగా కనిపించే మాట నిజమే అయినా కొందరిలో ఈ లక్షణాలు రోజులో ఎప్పుడైనా కనిపించొచ్చు.

కొందరిలో విపరీతంగా వాంతులు కావటం వల్ల కనీసం గుక్కెడు నీళ్ళు తాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఒంట్లో నీటి శాతం పడిపోయి, నీరసం, కల్లుతిరగతం, బరువు కోల్పోవటం  వంటి డీ హైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ' హై పెరిమిసిస్ గ్రావిడారం' అంటారు.  మరికొందరిలో మూత్రం చిక్కబడటం, సృహ కోల్పోవటం, గుండెదడ కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో తగినంత నీటి నిల్వలను పెంచేందుకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి రావటంతోబాటు ఇతర వైద్య చికిత్స కూడా అవసరం కావొచ్చు.

పైన చెప్పుకున్న శారీరక లక్షణాలతో బాటు కొందరిలో తీవ్రమైన మానసిక ఆందోళన, గందరగోళం కూడా ఉంటాయి. ఈ లక్షణాల ప్రభావం ఎదుగుతున్న పిండం మీద పడుతుందనే ఆందోళన కూడా ఎక్కువే. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, సరిపడా విటమిన్ బీ 6 వంటి అంశాల పై  దృష్టిపెట్టగలిగితే సమస్యను అధిగమించవచ్చు. మరీ నీరసంగా ఉన్నా పట్టించుకోక సొంత వైద్యాలతో సరిపెడితే తల్లికి, బిడ్డకూ ప్రమాదం ఏర్పడే ముప్పు ఉంటుంది.

ఆహారం

గర్భిణులు ముందునుంచీ తగినంత పౌష్టికాహారం తీసుకోవాలి. మసాలాలు, కొవ్వు పదార్ధాలు తగ్గించుకోవాలి. ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. పాలు, పండ్లు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి తరచూ తీసుకోవాలి. ద్రవాహారం ఇష్టం లేనివారు విడతల వారీగా ఆహరం తీసుకునేందుకు ప్రయత్నించాలి.

పరిసరాలు

నివాసంలో తగినంత గాలి, వెలుతురూ ఉండాలి. ఏదైనా కొత్త ప్రదేశoలో విహార యాత్ర చేయటం, సరదాగా గడపటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం వల్ల ఈ లక్షణాలు కాస్త తగ్గుతాయి.

జాగ్రత్తలు

  • పొట్ట ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే వికారం మరింత ఎక్కువవుతుంది.
  • ఉదయం లేవగానే వీలున్నంత త్వరగా ఏదైనా అల్పాహారం తీసుకోవటం వల్ల, కడుపులో ఆమ్లాల ఉత్పత్తి తగ్గి వికారంగా అనిపించదు.
  • వాంతులు, వికారం మరీ ఎక్కువగా ఉంటె నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్ల ముక్కలను బుగ్గన పెట్టుకోవాలి.
  • వంతుల కారణంగా కోల్పోయే నీటిని ద్రవాహారం, మంచి నీటి రూపంలో ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE