• HOME
  • ఆరోగ్యం
  • క్యాన్సర్ బాధితులకు భరోసానిచ్చే ..  రోజ్ డే

            క్యాన్సర్ మానసికంగానూ మనిషిని చెప్పలేనంతగా కుంగదీస్తుంది. ఇక.. ఈ మహమ్మారి బారిన పడిన పిల్లల సంగతి వేరే చెప్పనవసరం లేనే లేదు. క్యాన్సర్ బారినపడిన తమ పిల్లలను తలుచుకొని తల్లిదండ్రులు, బంధువులు సైతం ఒకరకంగా జీవచ్ఛవాలుగా మారుతుంటారు. ఈ పరిస్థితిని నివారించి క్యాన్సర్ బాధితులకు, విశేషించి చిన్నారులకు ఉపశమనాన్ని, ఉల్లాసాన్ని కలిగించేందుకు ఏటా సెప్టెంబర్‌ 22న వరల్డ్‌ రోజ్‌ డే (కేన్సర్‌ బాధితుల స్వాంతన దినం)గా నిర్వహిస్తున్నారు. ఈ రోజున క్యాన్సర్ బాధితులతో పంచుకొనే ఓ చిరునవ్వు, ఓ పలకరింపు, ఒక ఆత్మీయ స్పర్శ వారికి చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తాయనీ, ముఖ్యంగా  చిన్నారులు క్యాన్సర్ ను జయించి పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందటంలో పై అంశాలు ఎంతో దోహదపడతాయని వైద్యులు చెబుతున్నారు. పలు ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలు ఈ వరల్డ్‌ రోజ్‌ డే నాడు క్యాన్సర్ బాధితులకు ఆట, పాటల పోటీలతో బాటు వారి అభిరుచులకుతగిన ప్రదర్శనలు నిర్వహించటం ద్వారా వారి జీవితాల్లో మెరుగైన మార్పుకు కృషి చేస్తున్నాయి.

ఆనందంతో ఆరోగ్యం

మనదేశంలో మొత్తం కేన్సర్‌ బాధితుల్లో 5 శాతం మంది అభంశుభం తెలియని చిన్నారులే.  వీరిలో 2- 14 వయసు లోపువాళ్లే ఎక్కువ. మొత్తంమీద చూస్తే పిల్లల్లో నేత్ర సంబంధిత క్యాన్సర్ల ముప్పు ఎక్కువగా ఉంటోంది. ఇందులో రెటినోబ్లాస్టోమా కంటి కేన్సర్‌ బాధితులే ఎక్కువ. దీనిని సకాలంలో గుర్తిస్తే 90 శాతం మేరకు నయం చేయొచ్చు గానీ దురదృష్ట వశాత్తూ వీరిలో సగం మందే చికిత్స పొందుతున్నారు. దీంతో మిగిలినవారు చికిత్స పొందలేక అంధులుగా మారటం విషాదం. నేత్ర సమస్యలతో బాటు లింఫ్, కిడ్నీ, బ్రెయిన్‌ ట్యూమర్‌, నేత్ర, కడుపు బ్లడ్‌ క్యాన్సర్ల ఉనికి ఎక్కువ. మనదేశంలో ఏటా సుమారు 50 వేలమంది పిల్లలకు మాత్రమే కేన్సర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఎక్కువమంది తల్లిదండ్రులు ఈ సమస్య ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో కనిపించే క్యాన్సర్లు త్వరగా అదుపులోకి వస్తాయి గనుక ఏటా ఓ సారి పిల్లలకు ఈ పరీక్ష చేయిస్తే ఈ ముప్పు ఉండనే ఉండదు. 

  బాధిత చిన్నారులకు అవసరమైన చికిత్సతో బాటు మానసిక ఉలాసాన్ని కలిగించే వాతావరణాన్ని, కుటుంబపరమైన మద్దతును అందించగలిగితే క్యాన్సర్ బాధిత చిన్నారులు వేగంగా కోలుకొంటారని అపోలో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ ఆనంద్‌రెడ్డి వివరిస్తున్నారు. పెద్దలకు 6సార్లు కిమోథెరపీ ఇస్తే, పిల్లలకు 9 నుంచి 18 సార్లు కూడా కిమోథెరపీ ఇవ్వొచ్చనీ, చిన్నారుల శరీరం సైతం చికిత్సకు పూర్తిగా సహకరిస్తుందన్నారు. క్యాన్సర్ చికిత్స విషయంలో పెద్దలతో పోల్చితే మూడోదశ క్యాన్సర్ బాధితులైన వయోజనులు కంటే మూడో దశ క్యాన్సర్ బాధిత చిన్నారులు సానుకూలమైన, ఖచ్చితమైన ఫలితాన్ని పొందవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. 

రోజ్‌ డే నాడు..

  • బాధిత బాలలతో ప్రేమగా మాట్లాడాలి. వారితో రోజంతా సమయం గడపాలి.
  • స్నేహితులు, బంధువులు ఆ రోజు చిన్నారులకు బహుమతులు అందించటం ద్వారా వారిని మరింత సంతోషపరచవచ్చు.
  • పిల్లలకు ఇష్టమైన విహారయాత్ర లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాలి.
  • పిల్లలతో బాటు తల్లిదండ్రులూ ఆడిపాడి వారిని ఉల్లాసపరచాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE