మన జనాభాలో 60 శాతం యువజనులే. ఏ దేశంలోనూ లేనంత యువశక్తి మన బలం. మరి.. ఇంతటి యువశక్తిని సరిగా వాడుకొంటే అద్భుతాలు సాధించవచ్చు. దీనివల్ల వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలు నెరవేరటమే గాక దేశానికీ ఎంతో మేలు కలుగుతుంది. అయితే..డ్రగ్స్ వినియోగం వంటి ప్రమాదకరమైన జాడ్యం మన యువత వెన్ను విరిచి, అమూల్యమైన ఈ యువశక్తిని నిర్వీర్యం చేస్తోంది. యుక్తవయసు తొలిరోజుల్లో స్నేహితుల ప్రభావంతో సరదాగా మొదలయ్యే ఈ అలవాటు క్రమంగా మానలేని వ్యసనంగా మారి చివరికి ప్రాణాలమీదికి తెస్తోంది. ఇక.. ఒంటరితనం, ఒత్తిళ్ల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు వీటిని ఆశ్రయించే వారి సంఖ్యా నానాటికీ పెరుగుతూ పోతోంది. ఈ మాదకద్రవ్యాల జాడ్యంపై అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఇప్పటికీ ఈ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదనే చెప్పాలి. డ్రగ్స్ వినియోగం విషయంలో సమాజంలో ఇప్పటికీ ఉన్న అవగాహనా లేమి ఇందుకు ప్రధాన కారణం. పిల్లలు డ్రగ్స్ జోలికి పోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ కింది అంశాల మీద దృష్టి పెట్టాలి. 

  • చిన్నప్పటి నుంచే పిల్లలకు వారికిష్టమైన, మానసిక ఉల్లాసాన్ని అందించే ఏదైనా ఒకటి, రెండు వ్యాపకాలు అలవాటు చేయాలి. ఉదాహరణకు సంగీతం, క్రీడలు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్, చిత్రలేఖనం వంటివి. మొదట్లో పిల్లలు వీటిపట్ల ఆసక్తి చూపకపోయినా , కొద్దిగా ప్రోత్సహించి వేసవి సెలవుల్లో తగిన శిక్షణనిప్పిస్తే ఆ తర్వాత వారే వాటిని కొనసాగిస్తారు. దీనివల్ల పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా హాయిగా ఉండగలరు. ఇలాంటి పిల్లలు పొరబాటున కూడా డ్రగ్స్ జోలికి పోరు.
  • యుక్తవయసులో తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్నేహితులుగా వ్యవహరిస్తూనే వారిని కట్టడి చేయాలి. వారికోసం తప్పక సమయం కేటాయించి అండగా నిలవాలి. పిల్లల వ్యాపకాలు, చదువు విషయాలు, కాలేజీలో అతని వ్యవహారశైలి, స్నేహితుల వంటి విషయాల మీదా పెద్దలకు అవగాహన ఉండాలి.
  • కోరినంత డబ్బునివ్వడం హోదాకు చిహ్నం కాదని తల్లిదండ్రులు గుర్తించాలి. అలాగే పొద్దుపోయాక ఇల్లు చేరటం, తరుచూ పార్టీలకు వెళ్లడం, విచ్చలవిడి ఖర్చులు వంటివి ఉంటే పిల్లలను గట్టిగా ప్రశ్నించాల్సిందే. లేకుంటే.. మరిన్ని చిక్కులు రావచ్చు.
  • పిల్లలకు కుటుంబ బంధాల విలువను తెలియజెప్పి, కుటుంబ వ్యవస్థను గౌరవించేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి పిల్లలు డ్రగ్స్ జోలికి వెళ్ళటం ఉండదు.
  • చదువులో వెనకబాటు, ప్రేమ వైఫల్యం వంటి కారణాల వల్ల యువత మానసిక ఒత్తిడికి లోనై అందుకు ఉపశమనంగా డ్రగ్స్ కు అలవాటు పడతారు. అయితే ఈ విషయంలో యోగా, కౌన్సెలింగ్, పెద్దల ఆదరణ పనిచేసినంతగా డ్రగ్స్ పనిచేయవని అవగాహన ముందునుంచే పిల్లలకు తెలిసేలా చేయాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE