వృత్తి స్వభావం, స్వరూపం మూలంగా తలెత్తే అనారోగ్యాల నివారణ, చికిత్స విధానాన్నే వైద్య పరిభాషలో "ఆక్యుపేషనల్ మెడిసిన్" అంటారు. మనం ఎదుర్కొనే చాలా అనారోగ్యాలకు వృత్తిపరమైన అంశాలే ప్రధాన కారణాలుగా ఉంటాయి. అందుకే ఏదైనా అనారోగ్యంతో డాక్టర్ ని కలిసినప్పుడు అనారోగ్య సమస్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలతో బాటు వృత్తి వివరాల గురించీ ఆరా తీస్తుంటారు. పలు వృత్తులు, వారు ఎదుర్కొనే సమస్యల పట్ల కనీస అవగాహన ఉన్నప్పుడు మన వృత్తిని బట్టి తగు ముందు జాగ్రత్తలు తీసుకొని సంబంధిత అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చు. కొన్ని వృత్తుల వారికొచ్చే వ్యాధులు, వీరు పాటించాల్సిన జాగ్రత్తల వివరాలు... 

  • గాజుల పరిశ్రమ కార్మికులూ, వెల్డింగ్‌ పనివారు రోజంతా మిరుమిట్లుగొలిపే కాంతి, అధిక వేడి, పొగతో సతమతమవుతారు. అలాగే ఇనుము, మాంగనీస్‌,నికెల్‌, క్రోమియం లోహాల రజను శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లో చేరుతుంది.అందుకే వీరు ముక్కుకు మాస్క్, రక్షణ కళ్లద్దాలు ధరించాలి. లేకుంటే పరారుణ కిరణాల ప్రభావంతో త్వరగా కంటి శుక్లాలు రావటం, కళ్లు ఎర్రబడటం, నీరు కారటం వంటి సమస్యలు వస్తాయి. వీరు క్రమం తప్పకుండా కంటిపరీక్ష చేయించుకోవటమూ అవసరమే.
  • రోజంతా సముద్రం ఒడ్డున అమ్మకాలు చేసేవారు, తీరప్రాంత గైడ్స్, ఉప్పు తయారీ దారులు చర్మ, నేత్ర సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువ. వీటికి తోడు వీరిలో అధిక రక్తపోటు, మూత్రంలో సోడియం పోవటం, సీరమ్‌ పీహెచ్‌ పెరగటం వంటి ఇబ్బందులూ ఎక్కువే.
  • ఐటీ, బ్యాంకింగ్, సర్వీస్ రంగాల ఉద్యోగులు రోజంతా కంప్యూటర్లపై పని చేయటంతో మెడ, నడుము నొప్పులతో బాటు దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం వంటి రుగ్మతల బారినపడుతుంటారు. కూర్చొనే భంగిమ, అందుకు తగిన కుర్చీలు, టేబుళ్లు లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి కూడా ఈ సమస్యలకు కారణాలే. షిఫ్టు మార్పుల కారణంగా నిద్రలేమి, జీర్ణ సమస్యలు, మానసిక కుంగుబాటు వంటి ఇబ్బందులూ వీరిని వేధిస్తున్నాయి.
  • ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, పోలీసులు, మార్కెటింగ్ ఉద్యోగులు వాతావరణ మార్పులు, కాలుష్యం, వాహనాల ధ్వనుల ప్రభావానికి ఏడాదిపొడవునా లోనవుతుంటారు. దీంతో గాలిలోని సీసం, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ ఊపిరితిత్తుల్లోకి శ్వాసకోశ సమస్యల బారినపడుతుంటారు. ఇక.. క్వారీ కార్మికులు, పలకల పరిశ్రమ, బలపాల తయారీ కార్మికులు ఇసుక, రాళ్లలో ఉండే సిలికాన్‌ డైఆక్సైడ్‌ వంటివి దీర్ఘకాలం పీల్చటం వల్ల సిలికోసిస్‌ వంటి ఊపిరితిత్తుల సమస్యల బారినపడుతుంటారు.
  • రోజంతా నిలబడే ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, పోలీసులు, రిక్షా కార్మికుల్లో, దర్జీల్లో కాళ్ల రక్తనాళాల సమస్యలు తలెత్తి ‘వెరికోస్‌ వెయిన్స్‌’ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
  • పెట్రోలు బంకు ఉద్యోగులు రోజంతా బెంజీన్‌, టొలీన్‌ వంటి రసాయనాల ప్రభావానికి గురవటం వల్ల కళ్ళ మంట, కంటి నుంచి నీరు కారటం, దగ్గు, తలనొప్పి, డస్సిపోవటం, గొంతులో నస వంటి ఇబ్బందుల పాలవుతారు. వీరికి దీర్ఘకాలంలో చర్మం పాలిపోవటం, రక్తహీనత , మగత, కండరాల బలహీనతలూ దురు కావచ్చు. అందుకే వీరు ఈ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి.
  • లోహ, తోళ్ల పరిశ్రమ కార్మికులు క్రోమియం, క్యాడ్మియం ప్రభావానికి గురై ముక్కు ఎముక రంధ్రాలు పడటం, చర్మంపై అలర్జీ,మూత్రనాళాలు దెబ్బతినటం వంటి ఇబ్బందులకు గురవుతుంటారు.
  • బస్తాలు, బరువులు మోసే హమాలీలు కీళ్లనొప్పులు, వెన్ను సమస్యల బారినపడటంతో బాటు ధాన్యంలోని ధూళి వల్ల ఉబ్బసం బారిన పడటం సహజమే.
  • రోగుల చికిత్సకు వాడే సూదులు, కత్తెరల మూలంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిగాయాలపాలైహెపటైటిస్‌-బి, సి, హెచ్‌ఐవీ వంటి వాటి బారినపడే ముప్పు ఎక్కువ. అలాగే ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తుమందు ప్రభావం, రోజంతా తిరగటం, నిలబడటం వల్ల నడుం నొప్పి కూడా రావచ్చు. దంతవైద్యులకు అమాల్గమ్‌ల వల్ల శరీరంలోకి పాదరసం చేరటం, ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ.
  • మతబోధకులు, టీచర్లు, గాయకులను స్వరపేటిక సమస్యలు, స్వర్ణ కారులు లెడ్‌, క్యాడ్మియం వంటి లోహాల అవశేషాలను శ్వాసించటం వల్ల పలు వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.
  • వ్యవసాయ కూలీలు పంటలకు వాడిన క్రిమిసంహారకాల అవశేషాల ప్రభావానికి లోనవడం, తడివాతావరణంలో పొగాకు తోటల్లో పనిచేసే కార్మికులు నికోటిన్‌ ప్రభావానికి లోనైనప్పుడువికారం, తలనొప్పి, తీవ్రమైన బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి.
  • ఇళ్లలో పనివారు తడిలో తిరగటం, పనులు చెయ్యటం వల్ల చేతులు, కాలి వేళ్ళ మధ్య ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు.
  • రోజంతా సెలూన్లు, పార్లర్లలో పనిచేసే వారికి అక్కడ వాడే పౌడర్లు, రాలిన వెంట్రుకల వల్ల అలర్జీల బెడద ఎక్కువ.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE