• HOME
  • ఆరోగ్యం
  • అప్రమత్తతే న్యుమోనియా నివారణా మంత్రం

శీతాకాలం ప్రారంభమవడంతో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువైంది. దీంతో న్యుమోనియా వ్యాధి విజృంభిస్తోంది. ఏటా వేలాది మంది ఈ వ్యాధిన పడుతుండగా సకాలంలో గుర్తించలేకపోవటం మూలంగా పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 2 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఎక్కువగా దీని బారినపడుతుండగా, చిన్నారులే ఎక్కువగా మరణించటం మరో విషాదం. ఈ సమస్య పట్ల సమాజంలో అవగాహన పెంచటానికి ఏటా నవంబర్ 9న ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని జరుపుతున్నారు.

ప్రధాన కారణాలు

శ్వాస తీసుకునేటప్పుడు వైరస్‌, బాక్టీరియా, ఫంగస్‌, ప్రోటోజోవాలు శ్వాస కోశాల్లోకి చేరి బలపడటమే న్యుమోనియాకి దారితీస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారితో బాటు కొన్ని రకాల మందుల వాడకం, ధూమపానం, మద్యపానం, వంటి అలవాట్లు, పోషకాహార లోపం, మధుమేహం, హెచ్‌ఐవి, కేన్సర్‌, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యల బాధితులకూ న్యుమోనియా ముప్పు ఎక్కువ. ఎక్కువ సమయం చలిగాలిలో తిరగడంతో బాటు అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలున్న వారి పిల్లలకూ ఇది సంక్రమించవచ్చు.

లక్షణాలు..

  • వదలని చలి జ్వరం, ఆకలి లేమి, చెప్పలేనంత నీరసం, ఛాతీలో నొప్పి
  • విపరీతమైన దగ్గు, కళ్లె పడటం, అందులో చీము, రక్తం పడటం
  • ఆయాసం, ఛాతిలో నొప్పి, వంచి లక్షణాలు కనిపిస్తాయి.
  • ఊపిరితిత్తుల చుట్టూ నీరు లేదా చీము చేరటం
  • శ్వాసకోశాల్లో ద్రవాలు నిండి ఊపిరి తీసుకోవడం కష్టంగావటం
  • జలుబు లక్షణాలున్న పిల్లలు ఆహారమూ, కనీసం పాలు తాగేందుకు నిరాకరించటం

వర్గీకరణ

సాధారణ పరిస్థితులు, వాతావరణంలోని మార్పులు మూలంగా న్యుమోనియా వస్తే దాన్ని 'కమ్యూనిటీ ఎక్వైర్డ్‌ న్యుమోనియా' అనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వస్తే దానిని 'హాస్పిటల్‌ ఎక్వైర్డ్‌ న్యుమోనియా' అని అంటారు. దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు నర్సింగ్‌కేర్‌ సేవలు పొందుతున్నప్పుడు వచ్చే దానిని 'హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్‌ న్యుమోనియా' అంటారు. ఇవన్నీ ఒక పట్టాన మందులకు లొంగని ఇబ్బంది పెట్టే రకాలే.

వ్యాధి నిర్ధారణ

సాధారణంగా పై లక్షణాలు కనపడినవారికి రక్తపరీక్షలు, కళ్లెపరీక్షలు , ఛాతీ ఎక్స్‌రే తీసి న్యుమోనియా ఉన్నదీ లేనిదీ నిర్ధారిస్తారు. సిటి స్కాన్‌, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షల సాయంతో వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయొచ్చు. న్యూమోనియా అని నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. చికిత్స పొందుతూ తరచూ పరీక్షలు చేయించటం ద్వారా వ్యాధి తగ్గుముఖం పట్టిందా? లేదా? అనే విషయం కూడా తెలుస్తుంది.

చికిత్స

పై లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహా కోరాల్సి ఉంటుంది. న్యుమోనియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులు 7-10 రోజుల పాటు ఇంజెక్షన్ల రూపంలో యాంటిబయాటిక్స్‌ ఇచ్చి సమస్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ఐవి ఫ్లూయిడ్స్‌, ఆక్సిజన్‌ కూడా అవసరం కావచ్చు. అయితే తొలిదశలోనే వ్యాధిని సరిగ్గా గుర్తించి సరైన వైద్య సలహాను పాటిస్తే, తరువాత జరిగే దుష్పరిణామాలను నివారించవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE