ఈ రోజుల్లో డైట్ ప్లాన్ పాటిస్తూ బరువు తగ్గించుకొనే వారిని చూస్తున్నాం. నాజూకైన శరీరాకృతి కోసం డైటింగ్‌ చేసే యువతులు, మహిళల సంఖ్యా ఈ రోజుల్లో ఎక్కువే. అయితే మరీ సన్నబడాలనే విపరీతమైన ఆలోచనతో శరీరావసరాలకు కావలసిన ఆహారంలో సగం కూడా తీసుకోక చిక్కి శల్యమైపోయే వారూ ఉన్నారు. వైద్య పరిభాషలో ఈ ధోరణినే 'అనొరెక్సియా నెర్వోసా' అంటారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య నగర ప్రాంతపు, మానసిక సమస్యలున్న ఉన్నత వర్గాల యువతుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మానసిక సమస్యను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం తలెత్తే ప్రమాదం ఉంది.

 ప్రధాన కారణాలు

  అమ్మాయిలు అందం మీద శ్రద్ధ పెట్టటం సహజమే. స్నేహితుల ప్రభావం, ఫ్యాషన్‌ షోలు, బరువు తగ్గమని చెప్పే ప్రకటనలు,బరువు తగ్గించే క్లినిక్స్ సమాచారం వీరిని బరువు తగ్గించుకొనేలా ప్రేరేపిస్తుంది. దీనికితోడు నటీమణులు, మోడల్స్ ను చూసి వారిలా సన్నగా ఉంటేనే అందమనీ, అప్పుడే సమాజంలో ప్రత్యేకంగా కనిపిస్తామనే అపోహా బయలుదేరుతుంది. కుటుంబ విషాదాలు, ప్రేమ వైఫల్యం వంటివీ ఆహారం పట్ల విముఖతకు దారితీసి ఈ సమస్యకు దారితీయవచ్చు. ఈ క్రమంలో ఆహారాన్ని తగ్గిస్తూ చిరు తిండ్లు, పండ్ల రసాల మీద దృష్టి పెడుతుంటారు. దీనికితోడు అతిగా వ్యాయామం చేయడం, బరువు తగ్గే మందులు వాడటంతో ఎముకలగూడుగా మారిపోతారు. ఈ దశలో ఆహారం పట్ల విముఖత, ఒకవేళ తిన్నా వాంతి చేసుకోవటం చేస్తుంటారు. ఇంట్లో పెద్దలు, ఇతరులు నెత్తీ నోరూ బాదుకుంటున్నా తమ పరిస్థితిని గుర్తించలేరు.

కనిపించే లక్షణాలు

  • బహు తక్కువగా ఆహార తీసుకోవటం
  • స్థూలకాయం వస్తుందనే అపోహ
  • ప్రమాదకర స్థాయికి బరువు తగ్గించుకోవటం
  • అతిగా వ్యాయామం చేయడం
  • రుతుక్రమ సమస్యలు
  • తరచూ అద్దంలో శరీరాకృతిని పరిశీలించుకోవటం

ప్రతికూల ప్రభావాలు

ఆహారం తీసుకోక  తీవ్రమైన ఆకలికి లోనై పలు శారీరక, మానసిక సమస్యలకు గురవుతారు. ఎప్పుడూ రూపం మీదే దృష్టి పెట్టి ఇతర అంశాలకు దూరంగా ఉంటారు. ఏకాగ్రత తగ్గుతుంది. నిద్ర పట్టదు. శారీరక బలహీనత, ఎముకలు బలహీనపడి విరిగే ముప్పు ఎక్కువ. మూర్ఛ, కిడ్నీ సమస్యలూ రావచ్చు. గుండె లయ గతి తప్పుతుంది. హార్మోన్ల అసమతుల్యతతో రుతుక్రమం గతి తప్పుతుంది. కొందరిలో పూర్తిగా ఆగిపోతుంది.

ఏం చేయాలి?

ఈ సమస్యను తొలిదశలోనే గుర్తిస్తే పిల్లలను తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం అంత కష్టమేమీ కాదు. సమస్య తొలి బాధితులకు ప్రత్యేక కౌన్సెలింగ్ సాయంతో అపోహలను తొలగించి క్రమంగా వారిని సాధారణ స్థితికి తేవచ్చు. పరిస్థితి మరీ దిగజారిన వారి విషయంలో కౌన్సెలింగ్ తో బాటు పూర్తికాలపు చికిత్స తప్పనిసరి. ఈ దశలో వీరు చికిత్స పట్ల విముఖత చూపినా దాన్ని కొనసాగించాల్సిందే. లేకుంటే ప్రాణాపాయం సంభవించవచ్చు. బాధితుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టటంతో బాటు మానసిక వైద్య నిపుణులతో చికిత్స చేయించడం ఎంతో అవసరం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE