తెలుగు వారి తొలిపండుగా ఉగాది. యుగం ఆరంభమైన రోజు గనుక దీనికి యుగాది అనీ, కాలక్రమంలో ఇదే ఉగాదిగా మారినట్లు పెద్దలు చెబుతారు.  చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిన తరువాత వసంత ఋతువు ప్రారంభంతో ఉగాది ప్రకృతిలో చైతన్యం నింపుతుంది. చిగురించి లేలేత చిగుళ్ళతో చెట్లు సువాసనలు వెదజల్లుతూ ప్రకృతి శోభను ఇనుమడింపజేస్తే, కోయిలలు నూతనోత్సాహంతో చక్కని మధుర గీతాలాపనలతో స్వాగతం పలుకుతాయి. తుమ్మెదలు ప్రతి పూవునూ స్పృశిస్తూ మధువును గ్రోలిఝంకార నాదంతో నినదిస్తాయి. తెలుగునేలపై శాలివాహనుడి పాలన ఆరంభమైన రోజుగా, రావణ వధ అనంతరం శ్రీరామ చంద్రుడు అయోధ్యకు బయలుదేరిన రోజుగా, వేదాలను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించిన రోజుగానూ ఉగాది ప్రాచుర్యంలో ఉంది. ఉగాదిని తెలుగు వారితో బాటుగా కన్నడిగులూ , మరాఠీలూ కూడా వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఉగాది రోజున  అభ్యంగనస్నానం వల్ల శరీరదోషాలు, వేప ప్రసాదం తినడం వల్ల అంతర్గతంగా వున్న దోషాలు నివారించబడతాయి. జడప్రాయమైన జగత్తును మేల్కొల్పి నూతన ఆశయాల సాధన దిశగా ఉగాది మనల్ని నడిచేందుకు సన్నద్ధం చేస్తుంది.

ఉగాది అనగానే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడికి  మారుతున్న వేసవి వాతావరణాన్ని తట్టుకునే శక్తిని అందించటంతో బాటు శీతాకాలపు వాతావరణానికి మందగించిన జీర్ణశక్తి ని పెంచే గుణం ఉంది. అద్భుతమైన రుచి, అతి తక్కువ కేలరీలుందాటం దీని ప్రత్యేకత. కనుక అందరూ దీనిని తీసుకోవచ్చు. పేరుకు ఉగాది పచ్చడే అయినా ఆయా ప్రాంతాల్లో దీన్ని తయారు చేసే విధానంలో కొన్ని తేడాలున్నాయి. ఆంధ్ర ,రాయల సీమ  ప్రాంతాల్లో దీన్ని గుజ్జుగా చేస్తుండగా తెలంగాణలో పానీయంలా చేస్తారు. రూపాలు వేరైనా  పండగపూట ఉగాది పచ్చడిని ప్రసాదంగా తప్పనిసరిగా స్వీకరించటం ఆనవాయితీ. ఉగాది పచ్చడి తయారీ, అందులో వాడే పదార్ధాలలో దాగి ఉన్న ఔషధ గుణాలు  మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయో తెలుసుకుందాం.

వేపపువ్వు: రుచికి చేదుగా ఉండే వేపపువ్వు మన నిజ జీవితంలో ఎదురయ్యే పలు దుర్భరమైన అనుభవాలకు ప్రతీక. విజయాన్ని ఆనందంగా ఆహ్వానించినట్లే పరాజయాలనూ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఇది సూచిస్తుంది. వేపవృక్షంలోని మౌలిక గుణాలన్నింటినీ తనలో ఇముడ్చుకొని శరీరంలోని వాత, పిత్త, కఫాలను సమ ప్రకృతిలో ఉంచే శక్తి కలిగి ఉంది. వేప పువ్వులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు  పలు రకాల ఇన్ఫెక్షన్ల  నుండి శరీరాన్ని కాపాడుతాయి. గడచిన చలికాలంలో ఊపిరితిత్తుల్లో  చేరిన తేమ, కఫ ప్రభావాలను వేపపువ్వు సమూలంగా దూరం చేస్తుంది. పొట్టలో చేరిన నులిపురుగులనూ ఇది తరిమికొడుతుంది.

బెల్లం: దీని తియ్యని రుచి జీవితంలో మనమంతా కోరుకునే సుఖసంతోషాలకు గుర్తు. శరీరంలో చేరిన మలినాలు, వ్యర్ధాలను తొలగించే విశేష గుణం దీని సొంతం. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి  పొడి దగ్గును

వదిలించటంతో బాటు రక్తహీనతను ఇది దూరం చేస్తుంది.

మిరియాలు లేక పచ్చిమిరప: రుచికి ఘాటుగా ఉండే ఇవి మన కోపాన్ని సూచిస్తాయి. పచ్చి మిరప రోగనిరోధక శక్తిని పెంపొందించటమే గాక లైంగిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇక మిరియాలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.

ఉప్పు: నిజ జీవితంలో మనం ఎదుర్కొనే భయాలు, ఆందోళనలకు ఉప్పు చిహ్నం. జీవ క్రియల పనితీరును మెరుగు పరచటం, రక్తపోటును నియంత్రించటంతో బాటు కండరాల కదలికలను సరిగా ఉండేలా చూడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

చింతపండు: ఉగాది పచ్చడికి పులుపును చేర్చే చింతపండు నూతనోత్సాహానికి ప్రతీక. కొలెస్ట్రాల్ ను అదుపు చేసి పలు రకాల హృదయ సంబంధిత అనారోగ్యాలను నివారిస్తుంది.

పచ్చి మామిడి: వగరు, పులుపుల మిశ్రమంగా వుండే పచ్చి మామిడి ముక్కల వల్ల శరీరంలో కణ విభజన సక్రమంగా జరుగుతుంది. పులుపు శుక్రునిని ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది ఉపకరిస్తుంది. ఇది యాంటీ సెప్టిక్ కూడా.

ఉగాది పచ్చడి తయారీ

కావలసిన పదార్ధాలు

బెల్లం తరుగు -150 గ్రాములు, తాజా వేప పువ్వు -2 చెంచాలు, ఉప్పు- తగినంత, పచ్చిమిరపకాయలు- 2, పచ్చి మామిడి -1, కొత్త చింతపండు – నిమ్మకాయంత

చేసే పద్దతి

ఒక గిన్నెలో అరగ్లాసు నీళ్ళు పోసి బెల్లం తరుగు వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో వేప పువ్వు , చింతపండు గుజ్జు, వేప పువ్వు, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చి మిరప ముక్కలు, మామిడి కోరు వేసి బాగా కలిపితే ఉగాది పచ్చడి రెడీ అయినట్లే. కొందరు ఇందులో చిన్న చిన్న చెరుకు ముక్కలు, పండిన అరటిపండు ముక్కలు కూడా కలుపుకుంటారు. మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినీ వాడతారు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE