• HOME
  • భక్తి
  • శ్రీ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలితాలు

        మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆదాయం: 2         వ్యయం: 8

రాజపూజ్యం: 1      అవమానం: 7

       ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆర్థిక విషయాలు, వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఉపాధి. వ్యాపారులు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తారు. ఏప్రిల్ , మే మాసాల్లో ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్ళు అధికం. కొన్నిసార్లు శ్రమకు తగిన ఫలితం  రాక నిరాశ పడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత, నిదానం  అవసరం.  స్థిరాస్తులు సమకూర్చుకుంటారు.

      5-6 స్థానాల్లో గురు సంచారం వల్ల ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఇంటికోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో విశేష ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్హత, నైపుణ్యానికి తగ్గ అవకాశాలు లభిస్తాయి. పిల్లల వివాహం, విద్య, వృత్తిపరమైన అంశాల్లో ముందడుగు పడుతుంది. ఉగాది నుంచి రెండు మాసాలపాటు గురువు వక్రించినందున పెట్టుబడుల విషయంలో సంయమనం పాటించాలి. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించేందుకు, విదేశీ ప్రయాణం విషయంలో పట్టుదలతో కృషి చేయాల్సి వస్తుంది.

పొదుపు పథకాల్లో పెట్టిన పెట్టుబడులు పెద్దగా లాభించవు. ఆగస్టు 12 నుంచి గురువు కన్యారాశిలో సంచరించటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపించినా అదనపు బాధ్యతలు మోయాల్సివస్తుంది. అనారోగ్యం, పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, అనవసరపు వ్యయం ఉంటాయి. అపనిందలు మోయాల్సి రావచ్చు.

ఈ ఏడాది జనవరి 24 వరకు వృశ్చిక రాశిలో, ఆ తర్వాత ధనుర్రాశిలో శని సంచారం జరుగుతుంది . ఫలితంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. రుణ బాధలు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఎముకలు , కీళ్ళకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మానసిక అశాంతి బాధిస్తుంది. ఉమ్మడి నిధుల విషయంలో, బంధుమిత్రుల వ్యవహారాల్లో  మాట పడాల్సి రావచ్చు. బ్యాంకింగ్, బీమా, చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ ఉద్యోగులు ఆశించిన ఫలితాలు లేక ఇబ్బందిపడతారు. శని వక్రగమనంలో ఉన్న 2016 ఏప్రిల్ - ఆగస్టు మాసాల మధ్య దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. రుణాలకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొండిబాకీలు వసూలవుతాయి. బహుమతులు అందుకుంటారు.

5-11 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాలు, స్నేహాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. విద్యార్ధులు నిర్లక్ష్యం వల్ల దెబ్బతింటారు . నూతన వ్యాపారాలు ఆరంభించటానికి ఇది సరైన సమయం కాదు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసాలకు వెచ్చిస్తారు.

శివారాధన వల్ల ఈ ఏడాది సత్ఫలితాలు సాధిస్తారు.

వృషభం  (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం: 11        వ్యయం: 14

రాజపూజ్యం: 4    అవమానం: 7

ఈ ఏడాది గురు, శని, రాహుకేతువుల సంచారం ఆధారంగా వృషభ రాశి వారు స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ గమనం, ఉన్నత  విద్యాభ్యాసానికీ అనుకూలం. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం ఉంది . ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. సన్నిహితుల అనా రోగ్యం ఆందోళన కలిగిస్తుంది.  వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి.

ఈ ఏడాది 4,5 స్థానాల్లో శుభప్రదుడైన గురువు సంచరిస్తున్నందున విలువైన ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణం, గృహ ప్రవేశాలకు అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభప్రదం. కొత్త పరిచయాలు,  స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. గురువు వక్ర గమనంలో ఉన్న ఏప్రిల్ - మే మాసాల్లో రియల్ ఎస్టేట్ , నిర్మాణ రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో ప్రతికూలత, కుటుంబీకుల వైఖరి మనస్తాపానికి కారణమవుతాయి. న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.

జనవరి 24 ,2017 వరకు శని మీ 7వ స్థానంలో , ఆ తర్వాత 8వ స్థానంలో సంచరిస్తాడు. ఆటంకాలు ఎదురైనా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానంతరం జీవిత భాగస్వామి రూపంలో బాగా కలసి వస్తుంది . ప్రత్యర్ధుల మీద ఓ కన్నేసి ఉంచండి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అనుకున్న సమయానికి డబ్బు అందకపోవటం వంటి సమస్యలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. శని వక్రించిన ఏప్రిల్ - ఆగస్టు మాసాల మధ్య వరకు ప్రత్యర్ధులు సైతం మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. దూర ప్రయాణాల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది. ఆర్ధిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

ఈ ఏడాది 4 -10 స్థానాల్లో రాహు కేతువుల సంచారం జరుగుతుంది. ఫలితంగా ఇల్లు, స్థలం వంటి స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం మందగించే ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాక నిరాశ పడతారు. చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 

 ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. 

మిథునం            (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం: 14         వ్యయం: 11

రాజపూజ్యం: 7        అవమానం: 7

ఈ ఏడాది ఈ రాశి వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత విద్యకై విదేశాలు వెళ్లేవారికి అనుకూలం. వృత్తి పరంగా స్థానచలనానికి అవకాశం ఉంది. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ, ఏజన్సీలు, విద్యా రంగంలోని వారికి ప్రోత్సాహకరం. తోబుట్టువులు, బంధువుల విషయాల్లో శుభపరిణామాలు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సొంతఇంటి కల నిజమవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో గురువు వక్రించిన కారణంగా విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య, రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి.

ఈ ఏడాది గురు గ్రహం ఆగస్టు 10 వరకు సింహంలోనూ, ఆ తర్వాత కన్యారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా దూర ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. తోబుట్టువుల విషయంలో  శుభ పరిణామాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు పై అధికారుల ప్రశంశలు పొందుతారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ఆరంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉగాది నుంచి సుమారు రెండు నెలల పాటు వృత్తి  వ్యాపారాల్లో నిరాశాజనక స్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి.

ఈ ఏడాది 6, 7 స్థానాల్లో శని సంచారం కారణంగా వృత్తివ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సిరావచ్చు. పని ఒత్తిడి అధికం. పై అధికారుల నుంచి ఒత్తిళ్ళు తప్పవు. శక్తికి  పనిచేసి, తగిన గుర్తింపును పొందుతారు. రుణాలు ఇచ్చిపుచ్చుకొనే విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. భారీ వ్యాపారాలను వాయిదా వేసుకోవటం మంచిది. జీవిత భాగస్వామి విషయంలో ఏదో లోటు బాధిస్తుంది. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ - ఆగస్ట్ మాసాల మధ్య వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి శుభప్రదం. పట్టుదలతో కృషి చేసి ఫలితాలను సాధిస్తారు. వైద్యం, కేటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి అనుకూల ఫలితాలు.

3-9 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల అన్నదమ్ముల మధ్య అపోహలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్ధిక విషయాల్లో నష్టం సంభవం. అనుకోకుండా దూరప్రాంతాలకు బదిలీ అవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పై  అధికారుల ఒత్తిడి ఉంటుంది. విదేశాలలో ఉన్నత విద్య విషయాల్లో అవరోధాలు తప్పవు. ప్రయాణాల్లో జాగ్రత్త. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థికంగా నెమ్మదిగా పుంజుకుంటారు.

దుర్గాదేవి ఆరాధనతో శుభఫలితాలు సాధిస్తారు. 

కర్కాటకం    (పునర్వసు 4వ పా, పుష్యమి, ఆశ్లేష )

ఆదాయం: 8         వ్యయం: 11

రాజపూజ్యం: 3        అవమానం: 3 

గురు, శని, రాహుకేతువుల సంచారం ఆధారంగా ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థికపరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. పదోన్నతితో బాటు బదిలీ ఉంది. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషిచేసి సత్ఫలితాలు పొందుతారు. తోబుట్టువులకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏప్రిల్-మే మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్ధిక విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది.

2-3 స్థానాల్లో గురు గ్రహ  సంచారం వల్ల ఆర్థికస్థితి బాగుంటుంది. స్థిరచరాస్తులతొ బాటు విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కుటుంబం విస్తరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు,  ఉద్యోగంలో పురోగతి ఉంటాయి . దానధర్మాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు చేస్తే మంచి లాభాలు పొందుతారు.  తోటివారి సాయంతో లక్ష్యాలు సాధిస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఆగస్టు  11 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి.

5,6 స్థానాల్లో శని సంచారం కారణంగా విద్యార్థులు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. శ్రద్ధ లోపించటం వల్ల లక్ష్యసాధన కష్టం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులు సైతం శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. అపవాదులు ఎదుర్కొంటారు. పనులు పూర్తి  కాకపోవటం వల్ల చికాకులు ఎక్కువవుతాయి. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. జనవరి నుంచి ఆరోగ్యం పట్ల  ప్రత్యేక శ్రద్ధ  చూపాలి. వృత్తివ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. శని వక్రించిన ఏప్రిల్ -ఆగస్టు మాసాల మధ్య ఉన్నత విద్యాప్రయత్నాలకు అనుకూలం. స్నేహ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలూ ఫలిస్తాయి. స్నేహం వ్యామోహంలో చదువు వెనకబడకుండా  చూసుకోండి. స్థిర, చరాస్తుల విషయంలో చికాకులు, ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా ఓర్పుతొ అందరినీ ఒప్పించగలుగుతారు.

2-8 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల ఆర్ధిక విషయాల్లో శ్రద్ధ, అప్రమత్తత అవసరం. డబ్బు తీసుకున్నవారు సకాలంలో తిరిగి చెల్లించరు. మీరు తీసుకున్న బాకీలు తీర్చకపోవటంతో మాట పడాల్సిరావచ్చు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి.

దత్తాత్రేయ స్వామి  ఆరాధన వల్ల కష్టాలు తొలగి, శుభఫలితాలను సాధిస్తారు.

సింహం  (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఆదాయం: 11         వ్యయం: 5

రాజపూజ్యం: 6        అవమానం: 3 

సింహరాశివారు ఈ ఏడాది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం ఉంది. ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి. రోగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. గృహ నిర్మాణం, స్థల సేకరణకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రించిన ఏప్రిల్, మే మాసాల్లో అశాంతికి లోనవుతారు. అలర్జీలు బాధిస్తాయి. 

గురువు 2016 ఆగస్టు 10 వరకు మీ జన్మరాశిలోనూ, ఆ తర్వాత కన్యా రాశిలోనూ సంచరిస్తున్నందున మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి  చేయగలుగుతారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ మాట చెల్లుబాటు అవుతుంది. చక్కని ఆలోచనలు వస్తాయి. కొత్త పథకాలకు కార్యరూపం ఇస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక , రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు.  ఉద్యోగంలో పదోన్నతి. ఏప్రిల్, మే నెలల్లో స్నేహ సంబంధాల్లో విభేదాలు తలెత్తుతాయి. ప్రేమలు బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి.

శని 4,5 స్థానాల్లో సంచరించటం మూలంగా రియల్ ఎస్టేట్ , గృహ నిర్మాణ రంగాల వారికి శుభ  ఫలితాలుంటాయి. సొంతఇంటి కల నిజమవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి. 2017 జనవరి నుంచి విద్యార్థుల్లో శ్రద్ధాలోపం  కారణంగా నష్టపోతారు. శని వక్ర గమనంలో ఉన్న మార్చ్ - ఆగస్టు మాసాల మధ్యలో పెద్దలు అనారోగ్యం పాలవుతారు. కుటుంబంలో కలతలు ఎదురవుతాయి. భూ క్రయవిక్రయాల్లో అన్ని దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. పనుల్లో ఎక్కడో ఒక చోట ఆటంకం ఏర్పడుతుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు ఎక్కువవుతాయి.

1-7 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల పనుల పట్ల  అశ్రద్ద, అనారోగ్యాలు తప్పవు. ప్రత్యర్ధుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతములతో ఎడబాటు తప్పక పోవచ్చు. భాగస్వాములతో కలహాలు, మనస్పర్థలు అధికం. స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి. చిన్న మొత్తాలలో పెట్టిన పెట్టుబడులు చక్కని రాబడినిస్తాయి.

శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తే శుభఫలితాలు పొందుతారు.

 

కన్య   (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఆదాయం: 14          వ్యయం: 11

రాజపూజ్యం:  2      అవమానం: 6

          కన్యరాశి వారు ఈ ఏడాది చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తివ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రణాలికలు, ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి . కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే ఏప్రిల్, మే మాసాల మధ్య ఉద్యోగ, వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రేమ వ్యవహారాల్లో, ఆర్ధిక వ్యవహారాల్లో తొందరపాటు తగదు. విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తేనే సత్ఫలితాలు పొందగలరు.

          ఈ ఏడాది 12 -1 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో దుబారా ఖర్చులు అధికం. ఆదాయం ఎంత బాగున్నా మిగులు ఉండదు. ఇల్లు, ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉగాది నుంచి నెల రోజుల వరకు పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో చదువు నిమిత్తం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల మూలంగా ఆదాయం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు డబ్బు వెచ్చిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేస్తారు. నూతన పథకాలకు కార్యరూపం ఇస్తారు. సంతానం విషయంలో శుభ ఫలితాలు.

ఈ ఏడాది శని 3,4 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా తోబుట్టువుల వైఖరి చిరాకు కలిగిస్తుంది. మార్కెటింగ్, రవాణా, ఏజన్సీలు, స్టేషనరీ, బోధనా రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెడతాయి. చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. జనవరి తర్వాత ఇల్లు మరమ్మతు పనులకు డబ్బు అధికంగా ఖర్చవుతుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు శని వక్ర గమనంలో ఉన్నందున విద్యార్థులు పట్టుదలతో చదివి రాణిస్తారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి అనుకూల సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబం, ఆస్తులు, ఆరోగ్య సంబంధిత విషయాల్లో మెరుగైన వాతావరణం కనిపిస్తుంది.

12- 6 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల చేపట్టిన  ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అయినా పట్టుదలతో కృషి చేస్తే విజయం మీదే. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాలు ఆరంభించేందుకు తగిన సమయం కాదు. మనశ్శాంతి లోపిస్తుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం: 11           వ్యయం: 14

రాజపూజ్యం:  5      అవమానం: 6

       తులా రాశి వారికి ఈ ఏడాది వ్యాపారాభివృద్ధికి అనుకూలం. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ఆరంభించి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి ఉంటుంది. జీవితం ఆనందంగా సాగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఏప్రిల్ - మే మాసాల్లో ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో అనవసరమైన ఖర్చులు అధికం. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద ధ్యాస తగ్గుతుంది.

         గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకూ అవకాశం ఉంది. వివాహయత్నాలు  ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణల, ప్రకటనల, బోధన, సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ యాత్రలు, విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్త్ర, సినీ, మత్స్య, రవాణా, టైల్స్, ఫోటోగ్రఫీ రంగాల వారికి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఉగాది నుంచి నెల రోజుల సమయంలో పెద్ద వయసువారికి అనారోగ్య సమస్య వచ్చే సూచన ఉంది. స్నేహానుబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఖర్చులు అంచనాలను మించుతాయి.

దుర్ముఖి నామ సంవత్సరంలో 2,3 స్థానాల్లో శని సంచారం వల్ల పెట్టుబడుల్లో తొందరపాటు కూడదు. ఇతరుల ఆర్ధిక విషయాల్లో తలదూర్చితే ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఆర్ధిక విషయాల్లో అపోహలు, వివాదాలు తలెత్తుతాయి. సౌకర్యాల లేమి ఇబ్బందిపెడుతుంది. రుణ బాధలు ఎక్కువ. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. జనవరి నుంచి విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది. తోబుట్టువుల బాధ్యతలు మోయాల్సివస్తుంది. ఏప్రిల్ 8 నుంచి సినీ, రాజకీయ రంగాల వారికి శుభప్రదం. ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు సాగించి ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి.

11-5 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల విద్యార్థులకు చదువుమీద శ్రద్ధ సన్నగిల్లుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. అపోహల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. రుణ బాధలు  పెరుగుతాయి. ఆస్తి తగాదాలు, కుటుంబ పరమైన ఒత్తిళ్ళ వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక స్థిరత్వం లోపిస్తుంది. విలాసాలు, ప్రయాణ ఖర్చులు అధికం. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి.

పార్వతీదేవి ఆరాధన వల్ల చిక్కులు తొలగి శుభాలు కలుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట )

ఆదాయం: 2           వ్యయం: 8

రాజపూజ్యం:  1      అవమానం: 2

వృశ్చిక రాశి వారు ఈ ఏడాదంతా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులు దక్కుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువు కూడా మిత్రుడవుతాడు. ఏప్రిల్ - మే మాసాల మధ్య కాలంలో పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి. రుణ బాధలు ఎక్కువవుతాయి. స్థలమార్పిడి అవకాశాలు అధికం.

పురోగతినిచ్చే గురువు ఈ ఏడాది మీ 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కాబట్టి వృత్తి వ్యాపార, ఉద్యోగాల్లో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పలుకుబడిగలవారు, ఉన్నతపదవుల్లో ఉన్నవారు వృత్తి ఉద్యోగాలలో సహకరిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ నాయకులకు పదవీయోగం ఉంది. లాభ స్థానంలో గురుసంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ - మే మాసాల్లో బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. ఆర్ధిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు.

ఈ సంవత్సరం మీ జన్మరాశి వృశ్చికం, 2వ స్థానమైన ధనుస్సుల్లో శని సంచరించటం వల్ల 2017 జనవరి వరకు పోలీసు, రక్షణ రంగాల వారికి ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. అపనిందలూ తప్పవు. ఉగాది నుంచి ఆగస్టు 3 వరకు శని వక్రించిన కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి.

10-4 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. పెట్టుబడుల్లో జాగ్రత్తలు పాటించాలి. పై అధికారులతో మనస్పర్ధల కారణంగా నష్టపోతారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు  అశాంతికి గురవుతారు. మహిళలు సమస్యలు ఎదుర్కొంటారు.

ఆంజనేయస్వామి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఆదాయం: 5           వ్యయం: 14

రాజపూజ్యం:  4      అవమానం: 2

ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే ధనుస్సు రాశివారు వృత్తి వ్యాపారాల్లో  అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీయానానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల స్థాపనకు తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్, మే మాసాల మధ్య ఆందోళనలు ఎక్కువవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు . న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

9, 10  స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల్లో వారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం. విద్యా విషయాలు, న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. కళలు, సాంస్కృతిక , బోధన, ఉన్నత  విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆదాయం పెంచుకునే ఫలితాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు పదవీయోగం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉగాది నుంచి నెల రోజుల పాటు గురువు వక్రించిన కారణంగా వృత్తి వ్యాపారాల్లో అధికంగా శ్రమించాల్సి వస్తుంది. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త.

           12, 1వ  స్థానాల్లో ఈ ఏడాది శని సంచారం జరుగుతుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాటక రంగాల వారు ఆశించిన ఫలితాలు అందక నిరుత్సాహపడతారు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రహస్య కారణాల వల్ల అప్రతిష్ట పాలవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనుల్లో ఒత్తిళ్ళు తప్పవు. 2017 జనవరి నుంచి మానసికంగా చిరాగ్గా ఉంటుంది. ఆటంకాలు, అవరోధాల వల్ల ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లు ఉంటుంది. ఏప్రిల్ - ఆగస్టు మాసాల మధ్య శని వక్ర గమనం వల్ల భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. క్రమశిక్షణ, ఓర్పు తో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.

9 -3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఏజన్సీలు, స్టేషనరీ, ట్రావెల్ రంగాల వారికి ఒత్తిడి అధికం. సన్నిహితుల మధ్య అపోహలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. మోసపోయే అవకాశం ఉంది. దూరప్రాంతాలకు బదిలీ అవుతారు. కుటుంబ వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది.

శ్రీ లలితాదేవి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

 ఆదాయం: 8           వ్యయం: 8

రాజపూజ్యం:  7      అవమానం: 2

ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే మకర రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పైచదువులు, విదేశీయానానికి, కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు ఆరంభించేందుకు  అనుకూల సమయం. విద్యార్థులు , క్రీడాకారులకు శుభ ఫలితాలు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థల మార్పిడి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ. కళ, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్ - మే మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిళ్లకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

8-9 స్థానాల్లో గురు సంచారం వల్ల ఈ ఏడాది ఆస్తి వ్యవహారాల్లో చికాకులు  ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇచ్చిన బాకీలు సమయానికి తిరిగిరాకపోయే ప్రమాదం ఉంది. న్యాయపరమైన సమస్యలు ఆగస్టు తర్వాతే పరిష్కారమవుతాయి. ఏప్రిల్ -మే మాసాల మధ్య స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శుభపరిణామాలు. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య రంగంలోని వారికి చక్కని పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విభేదాలు సమసిపోతాయి.

ఈ ఏడాది 11, 12 స్థానాల్లో శని సంచారం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రుల కారణంగా అదనపు బాధ్యతలు మోయాల్సిరావచ్చు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టాలు సంభవం. క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రశాంతత లోపింఛి మానసిక ఒత్తిళ్ళకు దారితీస్తాయి. ఆలస్యాలు, ఆటంకాలు, వైఫల్యాలు అసంతృప్తికి దారితీస్తాయి. వాహనాలు నడిపే వేళ  ఏకాగ్రత అవసరం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే ముప్పు ఉంది. మార్చి- ఆగస్టు మాసాల మధ్య శని వక్రించిన కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. స్వయంకృషి, కార్యదీక్ష, ఓర్పు, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలను సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం.

8-2  స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్ధిక సాయం చేయబోయేముందు కాస్త ఆలోచించాలి. చదువుల్లో అశ్రద్ద కారణంగా వైఫల్యాలు ఎదురవుతాయి. మంచి మనసుతో పక్కవారికి సాయం చేసి చిక్కుల్లో పడతారు.

గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన వల్ల దైవకృప లభించి విజయం సాధిస్తారు.   

కుంభం ( ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం: 8           వ్యయం: 8

రాజపూజ్యం:  3      అవమానం: 5

 ఈ ఏడాది గురు, శని, రాహు, కేతువుల సంచారం వల్ల  కుంభరాశి వారు వృత్తి వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు. పై చదువులు, విదేశీయానానికి అనుకూలం. కొత్త పరిశ్రమల, వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు, క్రీడాకారులకు శుభప్రదం.  పెద్దల సాయంతో లక్ష్యాలను సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్ - మే మాసాల మధ్య ఆందోళనలు అధికం. వృత్తిపరమైన ఒత్తిళ్లకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.

ఆగస్టు 10 వరకు 7వ స్థానంలో గురు గ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు, శ్రీమతి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్య సాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. సంతానం కోరుకొనేవారి కోరిక ఈ ఏడాది నెరవేరుతుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. రాజకీయాలు, ప్రకటనలు, ఏజన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆగస్టు 11 నుంచి సంవత్సరాంతం వరకు విధి నిర్వహణలో ఒత్తిళ్ళు అధికమవుతాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. పూర్వానుభవంతో, యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

ఈ సంవత్సరం 10,11 స్థానాల్లో శని సంచారం ఉన్నందున పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు బదిలీలయ్యే సూచన. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావటంతో ఒత్తిడి ఎక్కువవుతుంది. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. జనవరి నుంచి ఆర్ధిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏప్రిల్ -ఆగస్టు మాసాల మధ్య ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధించి మంచిపేరు సంపాదించుకుంటారు. గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

7-1 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల భాగస్వాములతో కలహాలు, మనస్పర్ధలు అధికం. స్పెక్యులేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అంచనాలను మించిన ఖర్చులుంటాయి . అనుబంధాలు, ఆర్ధిక విషయాల కారణంగా అశాంతికి లోనవుతారు. అశ్రద్ధ కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

దుర్గాదేవి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది. 

మీనం ( పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి) 

ఆదాయం: 5           వ్యయం: 14

రాజపూజ్యం: 6      అవమానం: 5

ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం మూలంగా మీన రాశివారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు, పరిశ్రమల స్థాపనకు తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి శుభ ఫలితాలు. గురువు వక్ర గమనంలో ఉండే ఏప్రిల్ - మే మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిళ్ళకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం.

6-7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆసుపత్రులు, కేటరింగ్, నిత్యావసరాల రంగాల వారికి  ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఆదాయం పెరుగుతుంది. విలాసాలకు, మంచి పనులకోసం డబ్బు బాగా వెచ్చిస్తారు. పొరుగు రాష్ట్రాలు, విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉగాది నుంచి నెల రోజుల పాటు ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో చిక్కులు  ఎదురవుతాయి. అనాలోచితంగా పక్కవారి సలహాలు పాటించటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.

ఈ ఏడాది 9, 10 స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ రంగాల వారికి, టీచింగ్, బ్యాంకింగ్ రంగాల వారికి శుభప్రదం. వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు చేపడతారు. శని వక్రించిన ఏప్రిల్- ఆగస్టు మాసాల మధ్య న్యాయ, బోధన, కళా, రాజకీయ రంగంలోని వారు అనాలోచిత వైఖరి వల్ల ఇబ్బందులు పడతారు. ఆస్తిపాస్తుల విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రుణ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.

రాహు-కేతు గ్రహాల సంచారం ఫలితంగా శత్రుబాధ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో చికాకులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. వృత్తిపరంగా ప్రయోగాలకు ఈ ఏడాది అంత అనుకూలం కాదు.

అన్నపూర్ణాదేవి ఆరాధన వల్ల శుభాలు చేకూరతాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE