• HOME
  • భక్తి
  • ఆత్మ తత్వానికి ప్రతీక.. పశుపతినాథుడు

 పశుత్వాన్ని జయించి సత్యాన్వేషణ దిశగా మనిషి అడుగులు వేయాలంటే నేపాల్లోని పశుపతినాథుని దర్శించుకోవాల్సిందే. నేపాల్ రాజధాని ఖాట్మండుకు 5 కిలోమీటర్ల దూరాన, ఈశాన్య దిక్కుపొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇక్కడ కొలువై ఉన్న ఈశ్వరుడిని పశుపతినాథుడుగా పిలుస్తారు. ఏడాదిపొడవునా మనదేశం నుంచి వేలాదిమంది యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. క్రీస్తుశకం 400 సంవత్సరానికి ముందే ఈ ఆలయం ఉంది. యూనెస్కో ప్రకటించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో ఈ ఆలయం కూడా ఉంది.

క్షేత్ర చరిత్ర

ఒకనాడు పార్వతీపరమేశ్వరులు కాశీ నుంచి ఇక్కడి భాగమతి నదీ తీరాన మృగస్థలి అనే ప్రదేశంలో జింక రూపాల్లో విహరించి నిద్రిస్తున్నారట.ఈ సమయంలో దేవతలు స్వామిని తిరిగి కాశీ తీసుకెళ్లే ప్రయత్నంలో జింకరూపంలో ఉన్న ఆయన కొమ్ము పట్టుకొని లాగారట. దీంతో ఆ కొమ్ము విరిగి నాలుగు ముక్కలై ఆలయ గర్భాలయంలో పడి ఇప్పుడున్న నాలుగు ముఖాల శివలింగం మారినట్లు స్థలపురాణం చెబుతోంది. క్రీ.శ.753 సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగిందనీ , 1416 సంవత్సరంలో పునరుద్ధరణ పనులు జరిగాయనీ, తర్వాత కాలంలో కూలిపోయిన ఆలయాన్ని 1697 సంవత్సరంలో పునర్నిర్మించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

 ప్రధాన ఆలయ విశేషాలు

 ఆలయం గోపురం బంగారు, రాగి తాపడాలతో రెండు అంతస్తులుగా ఉండి, చైనీయుల నిర్మాణ శైలిని తలపిస్తుంది. ఆలయానికి నాలుగు దిక్కులా 4 ద్వారాలున్నాయి. వెండి తాపడాల ఈ ద్వారాల నుంచి లోపలికి వెళ్తే పడమర ద్వారం వద్ద స్వామిని రెప్పవేయకుండా చూస్తున్నట్లుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 6 అడుగుల ఎత్తున బంగారు కవచంతో గంభీరంగా ఉండే నందీశ్వరుని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఎదురుగానే నాలుగు ముఖాలతో భక్తులకు దర్శమిచ్చే పశుపతినాథుడు కొలువై వున్నాడు. మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి,సంక్రాంతి, గ్రహణం రోజుల్లో మహాశివరాత్రి రోజున లక్షలాదిగా వచ్చే భక్తుల నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రధాన పూజారిని మూల భట్ట లేదా రావల్ అంటారు. ఆలయ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు ఆయనే నేరుగా రాజుకు నివేదిస్తారు. (ఇప్పుడు నేపాల్లో రాజరికం పోయి ప్రజాస్వామ్యం ఉంది). ఆలయంలోని ఇతర పూజారులను భట్ట అని పిలుస్తారు.

ఇతర ఆలయాలు

 పశుపతినాథ్ ఆలయంలోని బంగారు దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, ఏడవ శతాబ్ధికి చెందిన చండికేశ్వరుడి మూర్తి భక్తులను కట్టిపడవేస్తాయి. ఆలయ సమీపంలోని బ్రహ్మదేవాలయం, గోకర్ణ నాథ్ మరియు విశ్వరూప్ దేవాలయాలు, గుహ్యేశ్వర దేవాలయం, కీర్తకేశ్వర మందిరం, గౌరీ ఘాట్ లు ఎంతో ప్రముఖమైనవి. ప్రధాన ఆలయానికి తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.

 ప్రత్యేకతలు 

  • హిందువులకు తప్ప అన్య మతస్తులకు ఆలయంలో ప్రవేశం లేదు.
  • ఇక్కడి ఆలయంలో పనిచేసే నలుగురు పూజారులకు మాత్రమే మూల విరాట్టుని తాకే అధికారం ఉంది.
  • ఈ ఆలయం పేరుకు నేపాల్ దేశంలో ఉన్నాపూజాదికాలన్నీ దక్షిణ భారత పూజారులే నిర్వహిస్తారు.
  • ఆదిశంకరుల నిర్ణయం మేరకు ఏర్పరచిన విధానం ప్రకారమే ఇక్కడి పూజాదికాలు జరుగుతాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE