(జులై 6, బుధవారం జరగనున్న రథయాత్ర సందర్భంగా)

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ఏటా ఆషాడ శుద్ధ విదియనాడు నయన మనోహరంగా జరిగే జగన్నాథుని రథయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగత్తుకే నాథుడైన ఆ ప్రభువు తనను దర్శించలేని వారికోసం తానే స్వయంగా తరలివచ్చే సందర్భమిది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ఉత్సవంలో కులమతాలు, జాతిభేదాలకు అతీతంగా భక్తులు పాల్గొని ఆనంద పారవశ్యంలో మునిగితేలుతారు. రేపు అనగా జులై 6 ఆరంభం కానున్న జగన్నాథ రథయాత్ర గురించిన కొన్ని విశేషాలు....

ఆరంభ వేడుక

ఏటా జేష్ఠ పౌర్ణమ నాడు పూరీలోని మూలవరులను గర్భాలయ పీఠం నుంచి తరలించి మంగళ స్నానం చేయిస్తారు. అందుకే దీనిని స్నాన పౌర్ణిమ అని అంటారు. ఈ సందర్భంగా మూలమూర్తులను ఆలయ తూర్పుగోడ వద్దకు చేర్చి ఆలయ ప్రాంగణంలోని బంగారుబావి నుంచి తోడిన 108 కలశాల నీటితో మంగళ స్నానం చేయిస్తారు. సుదీర్ఘంగా జరిగే ఈ స్నానవేడుక కారణంగా జగన్నాథుడు తలనొప్పి, జలుబు బారిన పడతాడట. అందుకే ఆ రోజునుంచి మూల మూర్తులను 2 వారాల పాటు చీకటి గదిలో ఉంచి ఔషధ మూలికలతో వైద్యం చేస్తారు. ఈ సమయంలో భక్తులకు స్వామి దర్శనం ఉండదు. అనంతరం స్వామి వారు సోదర, సోదరి అయిన బలభద్ర,సుభద్రా సమేతుడై యాత్రకు బయలు దేరతారు.

అబ్బురపరిచే రథాలు

రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణ రథాలే. విభిన్నమైన రంగులతో చూడ ముచ్చటగా అలంకరించిన రథాల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. రథయాత్రలో ముందుగా ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉండే బలభద్రుని(బలరాముడు) రథం సాగుతుంది. 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని తాళధ్వజ అంటారు. ఆ వెనుక నలుపు, ఎరుపు రంగులో, 14 చక్రాలతో 44.6 అడుగుల ఎత్తైన 'దర్పదళన' అనే రథంలో జగన్నాథుని సోదరి అయిన సుభద్ర బయలుదేరుతుంది. చివరగా 18 చక్రాలతో 45. 6 అడుగుల ఎత్తున్న 'నందిఘోష' అనే పేరున్న పసుపు, ఎరుపు రంగుల రథంలో జగత్తుకే నాథుడైన స్వామి  బయలుదేరతాడు.

యాత్రా గమనం

రథయాత్ర ముందురోజే అద్భుతమైన తీరున అలంకరించి సిద్ధంగా ఉంచుతారు. యాత్ర ఆరంభ సమయానికి ముందుగా బలరాముడు, సుభద్ర, జగన్నాథుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి రథాలలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం యాత్రకు సర్వం సిద్ధం కాగానే పూరీ రాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచి, రథాల ముందు చందనపు కళ్ళాపి జల్లి ఆయా దేవతలకు నమస్కరించి యాత్ర ఆరంభించేందుకు ఆజ్ఞ ఇవ్వమని స్వామిని కోరతారు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ సేవను తమకు దక్కిన అదృష్టంగా రాజా వంశీకులు భావిస్తారు. భగవంతుని ముందు రాజూ, పేద ఒక్కటేనని తెలియజెప్పే సత్యం ఈ క్రతువు ద్వారా మనకు బోధపడుతుంది. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాలతో, పలు రకాల మంగళ వాద్యాల నడుమ, నయన మనోహరంగా జగన్నాథ రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాధుని ప్రధాన ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరాన ఉన్న గుండిచా మందిరం దాకా రథ యాత్ర సాగుతుంది. రథాలను లాగేందుకు దేశ, విదేశాలనుంచి పూరీ చేరిన శ్రద్దాళువులైన భక్తులు పోటీపడతారు. ఈ రథయాత్ర రోజుల్లో పూరీ వీధులన్నీ ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో నిండిపోతాయి.

నేల ఈనిందా అన్నట్లుగా రాజవీధికి రెండువైపులా బారులు దీరిన భక్తజన సందోహం, భూమి, ఆకాశాలు దద్దరిల్లేలా సాగే జగన్నాథ నామ స్మరణ, తమ జన్మ పావనం చేసేందుకు తరలి వచ్చే స్వామిని చూసి భక్తజనం చేసే జయ జయ ధ్వానాల మధ్య రథాలు నెమ్మదిగా సాగుతూ సాయంత్రానికి గుండిచా ఆలయం చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది. 3 కిలోమీటర్ల ప్రయాణంలో రథచక్రాలు కదిలేందుకు మొరాయించినప్పుడల్లా భక్తులు కొబ్బరికాయలు కొడతారు. యాత్ర గుండిచా ఆలయానికి చేరిన తర్వాత మూలమూర్తులను గుండిచా ఆలయంలో వేంచేపు చేస్తారు. ఆషాఢ శుద్ధ దశమి వరకు అంటే 9 రోజులపాటు స్వామి ఇక్కడే ఉంటూ దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం దశమినాడు తిరిగి ఆలయం దిశగా బయలుదేరిన రథాలు ఆషాఢ పౌర్ణమి నాటికి ప్రధాన ఆలయాన్ని చేరుకుంటాయి. ఈ సందర్భంగా స్వర్ణాలంకార భూషితుడైన ఆ దేవదేవుడి భువనైక సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. ఈ ఘట్టాన్ని బహుదా యాత్ర అంటారు. దీంతో రథయాత్ర పరిసమాప్తమవుతుంది. 

ప్రత్యేక ప్రసాదాలు 

బాలకృష్ణుడు రోజుకు 8 సార్లు ఆహారం తీసుకునేవాడట. అయితే గోకులాన్ని కాపాడేందుకు గోవర్ధనగిరిని చిటికిన వేలితో నిలిపిన స్వామి ఆ వారం రోజులూ నిరాహారిగా ఉన్నాడట. తమను కాపాడి అలసిపోయిన కృష్ణయ్యకు రోజుకు 8 రకాల చొప్పున ఆ ఏడు రోజుల ఆహారాన్ని ఆంటే.. 56 రకాల ప్రసాదాలను ఒకేసారి అక్కడి యాదవులు నివేదించారట. ఈ ఆనవాయితీ ప్రకారమే సాక్షాత్తూ ఆ కృష్ణుడే జగన్నాథునిగా నిలిచిన పూరీ ఆలయంలో రోజూ 56 రకాల ప్రసాద నివేదన జరుగుతుంది. వందలాది వంటవాళ్లు సంప్రదాయ బద్దంగా కట్టెల పొయ్యిమీద వండిన ప్రసాదాలనే స్వామికి నివేదిస్తారు. 

లక్షలాదిమంది పాల్గొనే జగన్నాథుని రథయాత్రలో వేలాది మంది విదేశీయులు సైతం పాల్గొంటారు. కేవలం పూరీలోనే గాక దేశవిదేశాల్లో ఉన్న అన్ని ప్రముఖ జగన్నాథాలయాల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) చొరవతో ఏటా ఈ రథయాత్ర నేత్రపర్వంగా జరుగుతుంది.( హైదరాబాద్ బంజారాహిల్స్ జగన్నాథాలయం, నాంపల్లి ఇస్కాన్ ఆలయం నుంచి సాగే రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు). Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE