చాంద్రమానం ప్రకారం ఆషాఢ పౌర్ణమిని 'గురు పూర్ణిమ' లేదా 'వ్యాస పూర్ణిమ' గా జరుపుకుంటాము. గురు శబ్దంలోని గు అనగా తమస్సు (చీకటి) అనీ, రు అనగా తొలగించే వాడు అని అర్థం. మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడే గురువు . ఆచార్య దేవోభవ, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అనే సూక్తులు గురువు ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తాయి. గురువు, సాక్షాత్తూ గోవిందుడూ ఒకేసారి ఎదురుపడితే నేను ముందుగా గురువుకే నమస్కరిస్తానని భక్త కబీర్ దాస్ చెప్పిన మాటను బట్టి భారతీయ సంప్రదాయంలో గురువుకున్న ప్రాధాన్యం అర్థమవుతుంది. 

 నాలుగు వేదాలు, 18 పురాణాలను రచించి, అమూల్యమైన ఆర్ష సాహిత్యాన్ని మానవజాతికి అనుగ్రహించిన వ్యాసభగవానుని జయంతి కూడా నేడే. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుని రూపంలో వచ్చినట్లు చెబుతారు. ఇందుకు రుజువుగా విష్ణు సహస్ర నామంలోని 'వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే' అనే ప్రస్తావన కనిపిస్తుంది. మహోన్నతమైన గురుశిష్య పరంపరను ఏర్పరిచిన ఆది గురువూ వ్యాస భగవానుడే.ఈ రోజున తన నామాన్ని స్మరించిన వారికి దర్శనమిస్తానని ఆయనే స్వయంగా చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. అందుకే ఈ రోజున వ్యాసునితో బాటు గురు పరంపరలో నిలిచిన ఎందరో జ్ఞానులను, చిన్ననాటి నుంచి మనకు విద్యనేర్పిన గురువులను స్మరించుకోవటం ఆనవాయితీ. 

జీవితంలో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సందర్భంలో గురువు అవసరం ఉంటుంది. శిష్యులు లేని గురువులుండొచ్చు గానీ గురువు లేని శిష్యులుండరు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సైతం సాందీపని మహర్షి వద్ద శిష్యుడై గురు శుశ్రూష చేశాడు. ఆయనే కురుక్షేత్ర సంగ్రామారంభంలో అర్జునునికి గురువై నిలిచి గీతోపదేశం చేసాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక బోధకులు అంతా గురువులే. అయితే ఆత్మశోధన ద్వారా తనను తాను తెలుసుకొని, తద్వారా భగవంతుని తెలుసుకొనే స్థాయికి తన శిష్యులను తయారు చేయగల వారే అసలైన గురువు. అందుకే ప్రతి ఒక్కరూ సద్గురువును ఆశ్రయించాలి. 

ఈ రోజున చాలామంది రోజంతా ఉపవాసం ఉండి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రదర్శనం తర్వాత పూజ చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్నిచేసుకుంటారు. బాసర క్షేత్రంలో కొలువై ఉన్న వ్యాస భగవానుని దర్శనానికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళతారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. మనమూ ఈ పర్వదినాన సద్భావనతో మనసును కేంద్రీకరించి ఆ వ్యాస భగవానుని, మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన మన గురువులనూ స్మరించి తరిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE